కనుమరుగవుతున్న మానవ సంబంధాలు

నాది ప్రస్తుత పెద్దపల్లి జిల్లా కొలనూర్ గ్రామం నా చిన్నతనంలో మా ఊళ్లో ఏ మతస్థుల్తెెన ఏ కులం వాళ్లతోనైన ఆప్యాయతతో మమతా అనురాగాలతో ఒకరినొకరు బాధలు కష్టసుఖాలు మాట ముచ్చట్లు చెప్పుకునేవారం. ప్రతి వారిని ఏదో ఒక వరుసతో  పిలుచుకునే వారం. ఇప్పటి కూడా ఇదే  పద్ధతి సాంప్రదాయం  పల్లెలలో గ్రామాలలో జరుగుతున్నది. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఇంతే కాక ఏదైనా ఎవరైనా ఒక వ్యక్తి ఊరు నుండి ఇతర ఊర్లకు గాని బతుకు తెరువు కోసం షోలాపూర్ భీవండి ముంబాయి బలార్షా చంద్రపూర్ సిరిసిల్ల కొత్తగూడెం మొదలగు ప్రాంతాలకు  వలస వెళ్లేవారు. వారు అక్కడ చేరిన వెంటనే ఒక కారటు చిట్టి వ్రాయమని చెప్పేవారు వారు అక్కడ చేరినాక వారు పంపిన ఆ చిట్టి కారటు చదివి రెండు మూడు రోజుల వరకు వారి క్షేమ సమాచారం గురించి  ఊరు ఊరంతా మురిసిపోయేవారు .  ఎనుకట ఒక వ్యక్తి ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళుతున్నప్పుడు జాగ్రత్తగా పొయి, పోయిన వెంటనే కారటు(post card) వ్రాయమని ప్రాధేయపడేవారు. ఇట్లా మానవ సంబంధాలు ఆత్మీయతతో కూడినవుగా ఉండేవి.

గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబ సంబంధాలు మానవ  సంబంధాలలో వస్తున్న మార్పులను చూస్తుంటే   పెద్దగా ఆస్తులు చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు  సమాజంలో హోదా సౌకర్యాలు  పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు చక్కగా అన్యోన్యంగా ఉండేవి. ఒకరికి ఒకరు చేదోడుగా నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించేవారు. కష్ట సుఖాలకు ఒకరినొకరు కలుసుకోవడం  అందరం ఒక్కటే వాళ్ళం అనే అనుభూతి కొండంతగా ఉండేది. కుటుంబంలో ఎవరి పిల్లలు అయినా ఏదైనా సాధిస్తే అది కుటుంబమే కాక తెలిసిన వారందరు సంతోషం వ్యక్తం చేసేవారు. మా  అన్నదమ్ములు అక్కచెల్లెలు చిన్నాన్న మేనత్త మేనబావ మనవడు  మనవరాలు  తాతలు  మేనకోడలు  మేనల్లుడు అమ్మమ్మ ఇంటివారు నానమ్మ ఇంటి వారు అందరూ గర్వంగా చెప్పుకునే వారు. కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలు అయిన తరువాత  ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి ప్రాధాన్యత ఇవ్వడం  పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉన్నత ఉద్యోగాలు దొరకడం వలన  కూడా పోటీ తత్వాలు మొదలైనవి పిల్లలో ఈర్ష్య, పెద్దలలో అసూయ ప్రారంభమైనది మొదట్లో విజయం సాధించిన వారే కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశనం చేసే వారు  మిగిలిన వారికి లోటుపాట్లు లేకుండా సహాయ సహకారాలు అందించే వారు తాము ఎదగడంతో పాటు తమ వారు కూడా ఎదగడం కోసం సహాయ పడేవారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాముఖ్యత పెరగడం వలన  శీఘ్రంగా ఉద్యోగాలు లభించడం వలన వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం  గతము కంటే జీవితంలో సౌఖ్యాలు విలాసాలు పెరగడం వలన మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిన దగ్గర అసూయ ద్వేషం  కలగడం మొదలైనది పక్కాగా సంబంధాలు పలుచపడటం వ్యాపార ధోరణి గా మారినది  ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు  సంపాదించిన ఆస్తులు చేయించుకున్న నగలు వారు పొందుతున్న జీతాల గురించి  వారు అనుభవిస్తున్న అశేష సౌకర్యాల గురించి మాట్లాడడమే తప్ప  వెనుకటి రోజుల్లో మాదిరిగా ఆప్యాయంగా నోరారా మాట్లాడుకోవడం ఒకరి నొకరి క్షేమచారాలు తెలుసుకోవడం తగ్గిపోయినది.     ఆ రోజుల్లో ఇంట్లో కీడు, శుభకార్యం జరిగినా కనీసం 20 మంది చుట్టాలు వారం పది రోజుల ముందు నుంచే వచ్చి ఉండేవారు.   తరువాత కూడా ఇంకో వారం పది రోజులు వుండేవారు.రాత్రి పూట వాకిట్లో మంచాలు వేసుకుని పొద్దుబోయిందాక చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ పడుకునే  వారు . ప్రస్తుతం ఎంత చిన్న కార్యక్రమం అయినా చేసే వారు కూడా ఆప్పో సప్పో చేసి పక్క వాడి కన్నా ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ ఇతర చుట్టల దగ్గర  పరువు నిలుపుకుందాము అనే తపన, వచ్చే వారు కూడా తమ గొప్పతనం చూపించుకోవడానికి తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడనికి ఇస్తున్న ప్రాధాన్యత తప్ప మానవ విలువలకు సంబంధాలకు  ఇవ్వడం లేదు  చాలా మొక్కుబడిగా పిలవడం రావడం పోవడం జరుగుతున్నది. అందరికి పిల్లలు దూరంగా వుంటున్నా పక్కనే ఉంటున్న  చట్టపక్కాలతో ఆత్మీయ అనుబంధాలు ఉంచుకోవడం లేదు.  చిన్న చిన్న కారణాలు తోనే విపరీతమైన అహం ఈర్ష్య ద్వేషాలతో అందరికి అందరూ గిరిగీసుకుని బతకడానికి అలవాటు పడిపోతున్నారు   పెరిగే కొద్దీ ఓర్పు సహనం ఉండవలసిన చోట దగ్గర ఈర్ష్య ద్వేషాలు పెంచుకుంటున్నారు. నూటికి 70% కుటుంబాలలో పిల్లలు దూరంగానే వుంటున్నారు. వీళ్లకు  ఒంటరి తనం అనారోగ్య సమస్యలు మనిషి తోడు అవసరం అయినా కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో వుండడం లేదు విపరీతమైన స్వార్థం వలన పక్కవాడి  సహాయ సహకారాలు కోరడం లేదు.

దగ్గరి వాళ్ళతో కూడా ఘర్షణలు మాట్లాడుకోకపోవడం ఒక ధోరణిగా మారినది. వీలైతే  మనం బాగున్నప్పుడు  అందరితో కలిసి ఉండాలి మన వారికీ అవసరమైన సహాయం అందించాలి. చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు  తక్కువ అయిపోయినారు అయిపోతున్నారు కూడా.
విదేశాలలో ఉద్యోగాలు చదువు సంధ్యల వలన చాలీచాలని ఆర్థిక పరిస్థితి  మరియు అందరికన్నా అతి గొప్పగా బతకాలన్న తాపత్రయంతో కుటుంబ వ్యవస్థ చిన్న కుటుంబాలుగా మారినది.  మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి. నేడు పిల్లలకు అసలు కుటుంబ వ్యవస్థ గురించి చుట్టాలతో సంబంధాల గురించి తెలవడం లేదు. రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనే వారే లేని మిగలని పరిస్థితి సృష్టిస్తున్నాము. మీ ఇంటికి వస్తే ఏమి లాభం? మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అన్న భావన నుంచి కొద్దిపాటి అయినా మార్పు చెందాలి. అందరూ కొద్దిగా ఆలోచించండి. మన కుటుంబాల్ని మనమే దూరం చేసుకుంటు మనలో మనమే దూరం పెంచుకుంటూ ఇంకా సమాజం నుంచి మనం ఏమి ఆశిస్తాము.  ఎవ్వరికీ వారు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి. మన చిన్ననాడు మనం ఏమేమి పొందాము నేడు మన పిల్లలకు ఏమేమి దూరం చేస్తున్నాం.   పెద్దవారు చాలా మంది వెళ్ళిపోయినారు. మనం ఎంత కాలం ఉంటామో  తెలియదు కదా. మానవ విలువలు సంబంధాలు పెంపొందించుకుంటూ ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ సమాజ శ్రేయస్సుకు అందరం తోడ్పడి ముందు తరాలకు ఆదర్శంగా ఉండి మానవ సంబంధాలు తెలియజేయాలి.

దండంరాజు రాంచందర్ రావు
రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ సింగరేణిభవన్
హైదరాబాద్
9849592958 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *