ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ టెండర్లపై సమగ్ర విచారణ

 తక్కువ రేటుకు కట్టబెట్టిన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం 

హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ దుబాయ్‌ మోడల్‌ టూరిజం స్పాట్‌
రీజనల్‌ రింగ్‌ రోడ్డు వరకు హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణకు నిర్ణయం
హెచ్‌ఎండీఏ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక అధికారులు, కట్టుదిట్టమైన చర్యలు
లే అవుట్లలోని ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు
హెచ్‌ఎండీఏ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : అవుటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస రేట్‌ నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్‌ఎండీఏ అధికారులను ప్రశ్నించారు. అందులో ఎవరెవరి ప్రమేయముంది.. ఏయే సంస్థలున్నాయి.. ఎవరెవరు బాధ్యులెవరో అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ టెండర్లలో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్‌ఎండీఏ  జాయింట్‌  కమిషనర్‌ అమ్రా పాలీకి బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు ఏవైనా మిస్సయినట్లు గుర్తిస్తే.. వెంటనే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. హెచ్‌ఎండీఏ నుంచి  పూర్తి నివేదిక  అందిన తర్వాత  కేబినేట్లో చర్చించి ఈ టెండర్ల వ్యవహారాన్ని  సీబీఐ  లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని సీఎం చెప్పారు.

బుధవారం  సచివాలయంలో హెచ్‌ఎండీఏ అధికారులతో  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
టెండర్లకు ముందు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రతి నెలా గరిష్ఠంగా టోల్‌ వసూళ్లతో ఏడాదికి  రూ.600 కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు సీఎం వివరించారు. అలాంటప్పుడు 30 ఏండ్లకు రూ.18 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని  కేవలం  రూ.7380 కోట్లకు ఐఆర్‌ బీ కంపెనీకి ఎలా అప్పగించారని ముఖ్యమంత్రి ఆరా తీశారు. హెచ్‌ఎండీఏ అనుసరించిన టెండర్‌ విధానంతోనే ప్రభుత్వం రూ.15 వేల కోట్లకుపైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమికం గా అంచనాకు వచ్చారు. హెచ్‌ఎండీఏ రెండు కంపెనీలతో డీపీఆర్‌ తయారు చేయించటం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే  డీపీఆర్‌ ను ఎంచుకుందని చర్చకు వచ్చింది. అందుకే ఈ వ్యవహారంపై  సమగ్రంగా విచారణ చేయిస్తేనే, నిజాలు బయటకు వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు.  టెండర్‌ దక్కించుకున్న  కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్‌ ను చూపించి  49 శాతం వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించిందని, విదేశీ కంపెనీతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.అవుటర్‌ రింగ్‌ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌ గా తీసుకుని హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్రమంగా రీజనల్‌ రింగ్‌ రోడ్డు వరకు హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరించాలని  సూచించారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానం ఉండేలా రేడియల్‌ రోడ్లు నిర్మించాలని చెప్పారు.  ఇప్పటికే అభివృద్ది చెందిన సిటీతో పాటు కొత్తగా విస్తరిస్తున్న చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. మాస్టర్‌ ప్లాన్‌-2050కి అనుగుణంగా ప్రత్యేక కన్సల్టెన్సీతో సిటీ అభివృద్ధికి విజన్‌ డాక్యుమెంట్‌ ను రూపొందించాలని సీఎం సూచించారు.

హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న చెర్వులు, కుంటలను పరిరక్షించాలని, మరోవైపు ల్యాండ్‌ ఫూలింగ్ను వేగవంతం చేయాలని సీఎం చెప్పారు. అవసరమైతే ల్యాండ్‌ ఫూలింగ్‌, అక్కడి స్థలాల అభివృద్ది విషయంలో జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని,  సమన్వయంతో పని చేయాలని సూచించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో దాదాపు 8374 ఎకరాల ల్యాండ్‌ పార్శిళ్లు ఉన్నాయి. వీటిలో 2031 పార్శిళ్లు వివిధ స్థాయిల్లో కోర్టు కేసుల్లో ఉన్నాయి. హెచ్‌ఎండీఏ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, డిజిటల్‌, జీపీఎస్‌ విధానాలతో ఎక్కడ ఎంత స్థలముందో మ్యాపింగ్‌ చేయాలని సీఎం సూచించారు. తమ పరిధిలో ఉన్న స్థలాలతో హెచ్‌ఎండీఏ ఆదాయం పెంచుకునే చర్యలు చేపట్టాలని చెప్పారు. అడ్వర్టయిజ్మెంట్ల ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ల్యాండ్‌ ఫూలింగ్‌, ల్యాండ్‌ పార్శిల్స్‌, చెర్వులు, కుంటలు ఆక్రమణకు గురవకుండా చూసేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలని సమావేశంలో చర్చ జరిగింది. డీఐజీ స్థాయిలో ఒక ఐపీఎస్‌ అధికారిని నియమించాలని, ఇద్దరు ఎస్పీ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు.
హైదరాబాద్‌ తో పాటు వరంగల్‌, కరీంనగర్‌ తదితర పట్టణాలన్నింటా లే అవుట్లలో కమ్యూనిటీ అవసరాలకు ఇచ్చిన స్థలాలు తమ అధీనంలో ఉన్నాయా.. లేదా ఆక్రమణకు గురయ్యాయా.. వెంటనే సర్వే చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల ఏర్పాటుకు ముందుకొచ్చే కార్పేరేట్‌ కంపెనీలు, పేరొందిన పాఠశాలల యాజమాన్యాలకు వీటిని అప్పగించాలని సూచించారు. ఆ ప్రాంతంలోని పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు కనీసం 25 శాతం కోటాగా ఉచితంగా అడ్మిషన్లు ఉండేలా చూడాలని, దీంతో అన్ని ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు అందుబాటులోకి వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌ హుస్సేన్సాగర్‌  సమీపంలోని పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరంగా ఉండే అందమైన జోన్‌ గా తీర్చిదిద్దాలని సీఎం అధికారులకు సూచించారు. ఇటు అంబేద్కర్‌ విగ్రహం, ఎన్టీఆర్‌ పార్కు, తెలంగాణ అమరుల జ్యోతి, అటు నెక్లెస్‌ రోడ్డు నుంచి ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు వరకు మొత్తాన్ని ప్రపంచ స్థాయి సందర్శనీయ ప్రాంగణంగా తయారు చేయాలని సీఎం సూచించారు. హుస్సెన్‌ సాగర్‌ చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలను తొలిగించి, పర్యాటకులు, సిటీ ప్రజలు తీరికవేళలో ఆనందంగా గడిపేలా ఈ ప్రాంతం ఉండాలని సీఎం అధికారులకు వివరించారు. దుబాయ్‌ తరహాలో స్కై వాక్‌ వే, ఫుడ్‌ స్టాళ్లు, చిల్డ్రన్‌ అమ్యూజ్మెంట్‌ జోన్‌, గ్రీనరీ ల్యాండ్‌ స్కేప్లను..అభివృద్ధి చేయాలని సూచించారు. అవసరమైతే ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలను మరో రూట్‌ మళ్లించి, దీన్ని పర్యాటక జోన్‌ గా మార్చాలని సూచించారు. వెంటనే అంతర్జాతీయ స్థాయి కన్సెల్టెన్సీలతో ఈ ప్రాజెక్టు నమూనాలు తయారు చేయాలని సీఎం సూచించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం స్పెషల్‌ సెక్రెటరీ అజిత్‌ రెడ్డి,  మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ దాన కిషోర్‌, ఆర్‌ అండ్‌ బీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శ్రీనివాసరాజు  హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ అమ్రాపాలీతో పాటు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *