- ఓ ఎంపీకి సమాచారం ఇవ్వకపోతే ఎలా?
- పదిహేను రోజుల్లోగా అడిగిన సమాచారాన్ని ఇవ్వండి
- రేవంత్ పిటిషన్‌పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూలై 28(ఆర్‌ఎన్‌ఎ) : ఓఆర్ఆర్ టెండర్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో అర్థం లేదని, ఓ ఎంపీ అడిగితే దానిని ఎందుకు ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అడిగిన సమాచారాన్ని లిఖితపూర్వకంగా 15 రోజుల్లో ఎంపి రేవంత్ కెడ్డికి ఇవ్వాలని ఆదేశించింది. ఇందుకు ప్రభుత్వం కూడా హైకోర్టులో ఒప్పుకుంది. సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారని, ఆర్టీఐ పిటిషన్ ద్వారా అడిగినా ఇవ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఆర్టీఐ ఉన్నది ఎందుకని విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా అడిగిన సమాచారం ఇవ్వకపోతే చట్టసభల్లో వారు ఏం మాట్లాడుతారని ప్రశ్నించింది.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అడిగిన సమాచారం మొత్తం ఇస్తామని ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. రెండు వారాల్లోగా రేవంత్ రెడ్డి అడిగిన సమాచారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఓఆర్ఆర్ టెండర్లపై 26న రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. లీజు టెండర్ల విషయంలో తక్కువ మొత్తానికి కేటాయించి ముంబైకి చెందిన కంపెనీకి కట్టబెట్టారని, ఇందులో అధికార బీఆర్ఎస్ హస్తం ఉందని రేవంత్ పదే పదే ఆరోపిస్తూ వొస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీఐ కూడా సమాచారం ఇవ్వకపోవడం..ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనయాంశమయింది.
ఆర్టీఐకి కమిషనర్లు లేకపోవడంతోనే సమాచారం రావడం లేదని చెబుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఓఆర్ఆర్ లీజులో భారీ స్కామ్ జరిగిందని, ఈ కుంభకోణంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు చేతులు మారాయని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ ఓఆర్ఆర్ లీజ్ స్కాములో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్, మరో అధికారి అరవింద్ కుమార్ కీలక పాత్రధారులని ఆయన అంటున్నారు. ఓఆర్ఆర్ లీజ్ స్కామ్‌పై విచారణ సంస్థకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే రేవంత్ రెడ్డి ఆరోపణలన్నీ తప్పని ఇప్పటికే హెచ్ఎండీఏ ఆయనపై వేసిన పరువు నష్టం పిటిషన్లు కూడా కోర్టులో ఉన్నాయి.




