- ఆర్మీ హెలికాప్టర్లు, బోట్లతో తరలించిన రెస్క్యూ టీమ్స
- సిఎం కెసిఆర్ ఆదేశాలతో రంగంలోకి ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూలై 27 : వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి గ్రామస్తులు సురక్షితంగా బయటపడ్డారు. భారీ వర్షాల కారణంగా మోరంచ వాగు పొంగిపొర్లడంతో మోరంచ గ్రామంలోకి వరద నీరు వొచ్చి చేరింది. గ్రామంలోని ఇళ్లు నీట మునిగాయి. దీంతో అక్కడి ప్రజలు భవనాలపైకి ఎక్కి తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. మోరంచపల్లి గ్రామస్తుల పరిస్థితిపై సీఎం కేసీఆర్ స్వయంగా స్పందించారు. హెలికాప్టర్ల ద్వారా వారిని రక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అధికార యంత్రాంగం అక్కడకు తరలివెళ్లి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టింది. హెలికాప్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామంలోని ప్రజలందరినీ సేఫ్‌జోన్‌కు చేర్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా మోరంచపల్లి గ్రామస్తులు అంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక రెండు మూడు రోజులుగా కురుస్తున్న జడివానకు మోరంచపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది.
గ్రామ శివారులో ఉన్న వాగులోకి భారీగా వరద చేరడంతో గ్రామంలోకి ముంచెత్తింది. దీంతో ఇండ్లన్నీ నీటమునిగాయి. సమాచారం అందుకున్న అధికారులు గ్రామస్తులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. సహాయక బృందాలు గ్రామానికి చేరుకొని దాదాపు 200 మంది వరకు ప్రజలను సురక్షితంగా కాపాడారు. ముంపు ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతానికి బోట్ల ద్వారా తరలించారు. అక్కడి నుంచి పునరావాస కేంద్రానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తరలించాయి. వరదలో ఇంకెవరైనా చిక్కుకున్నారేమోననని సహాయక బృందాలు గాలిస్తున్నాయి. మోరంచపల్లిలో రెండు ఆర్మీ హెలికాప్టర్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరదలపై సవి•క్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ మోరంచపల్లిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్‌ను పంపాలని సీఎస్‌ను ఆదేశించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలటరీ అధికారులతో సీఎస్ శాంతికుమారి సంప్రదింపులు జరిపారు.
సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్ వినియోగించడం కష్టంగా మారడంతో సైన్యంతో చర్చలు జరిపారు. సైన్యం అంగీకారం తెలపడంతో ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లను ప్రభుత్వం మోరంచపల్లి గ్రామానికి పంపి..సహాయక చర్యలు చేపట్టింది. దీనిపై అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ…పాత వరంగల్, భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలిపారు. మోరంచపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. అక్కడి ప్రజలను సురక్షితంగా కాపాడగలిగామన్నారు. మోరంచపల్లి గ్రామంలో మొత్తం ప్రజలను సేఫ్ జోన్‌కు తరలించామన్నారు. కాటారం మండలంలో నలుగురు నీళ్లలో ఉన్నారని.. వారికోసం బోట్లను పంపించామన్నారు. అగ్నిమాపక శాఖ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా అలెర్ట్‌గా ఉన్నారన్నారు. ఇండ్లు, చెట్లు కూలిపోయినా తమ సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు. మోరంచపల్లిలో 70 మందిని రెస్క్యూ ఆపరేషన్ చేసి కాపాడగలిగినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సెల్ఫీల కోసం ఆరాటపడొద్దన్నారు.
ములుగులో ఇలా సెల్ఫీ కోసం వెళ్ళిన వారిని కాపాడేందుకు తమ సిబ్బంది చాలా శ్రమించాల్సి వొచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 బోట్ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నట్లు అగ్నిమాపక శాఖ డీజీ వెల్లడించారు.వరంగల్ టౌన్లో కూడా బోట్స్ సహాయంతో లోతట్టు ప్రాంతాల్లో సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. మంథనిలో కూడా ఇసుక క్వారీ వద్ద తొమ్మిది మందిని కాపాడామని.. ఇద్దరిని ఇంకా కాపాడే ప్రయత్నం సాగుతోందన్నారు. హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఎక్కడ ఇబ్బంది ఉన్నా 100, 101కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకి రావద్దని.. శుక్రవారం కూడా వర్ష ప్రభావం ఉంటుందని.. అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి ఆదేశించారు.




