•పాల్గొననున్న ఖర్గే, రాహుల్..మేనిఫెస్టో విడుదల
•పెద్ద ఎత్తున ప్రచారంతో లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23 : లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది. తెలంగాణ నుంచే దేశ వ్యాప్తంగా ప్రచారం ప్రారంభించనుంది. ఏప్రిల్ మొదటి వారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచార సభకు రానున్నారు. ఈ సందర్భంగా తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. సార్వత్రిక సమరంలో గెలుపే లక్ష్యంగా ఆరోజు మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న మొదటి సభ ఇదే కావడంతో ఆ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభ సక్సెస్ చేయడానికి నేతలు కష్టపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు తుక్కుగూడ మైదానాన్ని సందర్శించారు.
అసెంబ్లీ ఎన్నికలకు మందు కూడా తుక్కుగూడలో సోనియా తదితరులతో భారీ బహిరంగ సభ నిర్వహించి ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. ఈ క్రమంలో అదే సెంటిమెంటుతో తెలంగాణ కాంగ్రెస్ ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు పలువురు ఏఐసీసీ ముఖ్యనాయకులు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఏఐసీసీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోను తెలుగులో ఇక్కడ మల్లికార్జున ఖర్గే విడుదల చేస్తారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తున్న ఈ సభ నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇతర ముఖ్య నాయకులు కలిసి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.




