ఎలక్ట్రానిక్స్ తయారీలో‘గ్లోబల్ హబ్‌గా తెలంగాణ

– ఆ దిశగా రాష్ట్రంలో ఎకో సిస్టం అభివృద్ధి
– కోటి టీవీలను ఉత్పత్తి చేసిన హైదరాబాద్ కంపెనీ రేడియంట్
– ప్రత్యేకంగా అభినందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రపంచస్థాయి కేంద్రం(గ్లోబల్ హబ్)గా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పునరుద్ఘాటించారు.  ఉత్పత్తుల అసెంబ్లింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా విడిభాగాల తయారీ నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు అవసరమైన పూర్తిస్థాయి ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. కోటి(10 మిలియన్లు) టెలివిజన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న హైదరాబాద్‌కు చెందిన రేడియంట్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధుల్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో శనివారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రేడియంట్ సంస్థ సాధించిన ఈ ఘనత తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. ఈ లక్ష్య సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఆ దిశగానే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో టాప్ గ్లోబల్ ప్లేయర్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తూ వారికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, రెడీ టు వర్క్ ఫోర్స్ తయారీపై దృష్టి సారించామన్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి ఇక్కడి యువతకు ఉపాధి కల్పించాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, విస్తరణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. సరళతర వాణిజ్య విధానాలతో పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రెజల్యూట్ గ్రూప్ చైర్మన్ రమీందర్ సింగ్ సోయిన్, డైరెక్టర్ మణికందన్, లీగల్ అండ్ ఐపీఆర్ హెడ్ శుభజిత్ సాహా, అడ్మినిస్ట్రేషన్ హెడ్ నోయెల్ రాబిన్ సన్ తదితరులు పాల్గొన్నారు.

జీసీసీల గమ్యస్థానంగా హైదరాబాద్

ప్రపంచంలోని దిగ్గజ ఫైనాన్స్ సంస్థలన్నీ తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల(జీసీసీల) ఏర్పాటుకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానంగా ఎంచుకున్నాయని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. నైపుణ్యాలతో కూడిన టేలెంట్ పూల్, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్య లేని రోడ్లు, అందుబాటులో ఉండే అద్దెలు ప్రముఖ కంపెనీలని ఆకర్షిస్తున్నాయని తెలిపారు. న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే పికో టెక్నాలజి సంస్థ ప్రతినిధులు సచివాలయంలో శ్రీధర్‌బాబుతో శనివారం భేటీ అయ్యారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఫైనాన్సియల్ మార్కెట్‌కు సంబంధించిన సేవలు అందించే పికో టెక్నాలజీ సంస్థ పికో టెక్నాలజీ ఇండియా అనే అనుబంధ కంపెనీ ద్వారా ఇక్కడ జీసీసీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ సంసర్భంగా శ్రీధర్‌బాబు వారికి ఇక్కడి అవకాశాలు, మౌలిక వసతుల గురించి వివరించారు. రానున్న 5-10 సంవత్సరాలు, తర్వాత 20 సంవత్సరాల అవసరాలకు తగిన విధంగా మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. బెంగళూరు, ముంuయి నగరాలతో పోలిస్తే ఇక్కడ ఆఫీసు స్థలాల ఆక్యుపెన్సీ 73 శాతం ఉందని చెప్పారు. ముంuయిలో అది 52 శాతం మాత్రమేనని తెలిపారు. బెంగళూరు, ముంuయి మెట్రో నగరాల్లో ట్రాఫిక్, వాయు కాలుష్యం ప్రధాన సమస్యలుగా మారినందున ఐటి సంస్థలు, జిసిసిలు హైదరాబాద్‌కు తరలి వస్తున్నాయని తెలిపారు.

రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు : కోమటిరెడ్డి

ఇప్పుడున్న నెహ్రూ రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల వెలుపల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్టు ఆర్అండ్‌బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. దానికి అనుబంధంగా రేడియల్ రోడ్లు ఏర్పాటవుతున్నాయని, రింగ్ రోడ్ల పక్కన రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసి రవాణా సదుపాయాలను ప్రపంచంలోని పెద్ద నగరాలను తలదన్నేలా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. హయత్‌నగర్- ఎల్బీనగర్‌ల మధ్య డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మిస్తున్న్నట్టు చెప్పారు. కింది రోడ్డు స్థానిక ట్రాఫిక్ అవసరాలకు వినియోగిస్తామని, పైన ఉండే రెండు అంతస్థుల రోడ్లు నగరం నుంచి వెలుపలకు, లోపలికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకిస్తామని చెప్పారు. నాగపూర్ తర్వాత డబుల్ డెక్కరో రోడ్లు నిర్మిస్తున్న నగరం ఇదేనని అన్నారు. రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సమావేశంలో పికో టెక్నాలజి వ్యవస్థాపక సిఇఓ జారొడ్ యుస్టర్, పికో ఇండియా సిఈవో హరి కోదండరామన్, డైరెక్టర్ సీతారాం తదితరులు పాల్గొన్నారు. పికో టెక్నాలజి సీఈవో జారొడ్ యుస్టర్‌కు మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి జ్ణాపిక అందజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *