ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నుంచి ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06 : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొత్తలపర్రె గ్రామానికి చెందిన నిజాం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, బాధితుడు భూక్యా తిరుపతి నాయక్, అతని భార్య మౌనిక విజ్ఞప్తి చేశారు. బొత్తలపర్రె గ్రామంలోని సర్వే నెం.49, 88 లలో ఉన్న 20 ఎకరాల వ్యవసాయ భూమిపై ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కన్నేసి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 30 ఏళ్ల క్రితం అమ్ముకొని వెళ్లిన సమీప బంధువులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తనపై, తన కుటుంబంపై ఉసిగొల్పి దాడులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చెందిన 20 ఎకరాల భూమిని ఎమ్మెల్యే తన పలుకుబడితో తన అనుచరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడన్నారు. దీంతో రికార్డుల్లో తన భూమి కనిపించకుండా పోయిందని ఆవేదన చెందారు. ఈ విషయమై జనగామ ఏసిపి దేవేందర్ రెడ్డికి కలువగా దున్నే వాడిదే భూమి అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బెదిరింపులకు గురిచేశాడని ఆరోపించారు. గతంలో తనపై మూడుసార్లు హత్యాయత్నం కూడా జరిగినట్లు చెప్పారు. వారం క్రితం ఎమ్మెల్యే అనుచరులు తన వ్యవసాయ బావి దగ్గర మోటారు వైర్లు కట్ చేసి విద్యుత్ నిలిపివేసి దాడికి పాల్పడ్డారని అన్నారు. తనపై తన వృద్ధ తల్లిదండ్రులపై దాడులు జరుగుతున్న పట్టించుకునే నాధుడు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తన తల్లిదండ్రులకు ఏం జరిగినా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బాధ్యత వహించాలని అన్నారు. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం పోరాటం కొనసాగిస్తానని అన్నారు. ఈ విషయంపై త్వరలో మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసి అనంతరం గవర్నర్ కు వినతిపత్రం సమర్పిస్తానని తిరుపతి నాయక్ తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తక్షణమే తనకు న్యాయం చేయాలని లేకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్యే శరణ్యం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *