ఎమ్మెల్యే భేతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు : జౌండ్ల ప్రభాకర్ రెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 15: ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, చర్లపల్లి మాజీ వార్డు సభ్యులు జౌండ్ల ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సబబు కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో చెప్పాలన్నారు. మీరు గౌరవిస్తే మేము గౌరవిస్తామన్నారు. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సుమారు 450 కోట్లతో ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారాన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏం చేశారో చెప్పాలన్నారు. ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేను విమర్శిస్తే ఏం లాభంలేదని, మీ ప్రభుత్వ హయాంలో వాటర్ ట్యాంకర్ లతో నీళ్ళు తెస్తే బిందెలతో మహిళలు కొట్లాడుకునేవాల్లని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో డ్రైనేజీ వ్యవస్థలేదని ఓపెన్ నాళాలు ఉండేవన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే డ్రైనేజీ, రోడ్లు వేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 250 పెన్షన్ ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం 2000 పైగా పెన్షన్ ఇస్తుందన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో మూడు గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు వెల్ళలంటే 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళమని గుర్తు చేశారు. ఎల్లారెడ్డిగూడ స్మశాన వాటిక సమస్య ఎప్పటినుండో ఉందని మీ హయాంలో ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని కాలనీలలో అభివృద్ధి చేశారన్నారు. ఇంటింటికి నల్లా ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిది అన్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ప్రతీ కాలనీకి నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని, ఎవరు ఏం చేశారో ప్రజలకు అంతా తెలుసన్నారు. మీ కాంగ్రెస్ కార్యకర్తలే చర్లపల్లిలో కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యేపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఇందిరా గృహకల్ప ఇళ్లు కూలిపోయే స్థితికి వచ్చాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు, లేక ఉపాధి లేక జీవనోపాధి కోల్పోయి ప్రజలు ఇబ్బందుల పాలయ్యారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎక్కడైనా కబ్జాలకు పాల్పడ్డారా చెప్పండి అన్నారు. ఆనాడు రోడ్లు ఎలా ఉన్నాయి, ఈనాడు రోడ్లు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి రాగిడి లక్ష్మారెడ్డిది కాదన్నారు. కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు, డబ్బులు తీసుకున్నామని ఆరోపిస్తున్నారని మా నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా డబ్బులు తీసుకున్నట్టు నిరూపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపీ అయ్యాక ఎన్ని నియోజక వర్గాల్లో తిరిగారో చెప్పాలని, ఎంపీగా ఎక్కడన్నా అభివృద్ధి పనులు చేశారో, ఎవరికి సహాయం చేశారో చెప్పాలన్నారు. ఈ సందర్భంగా చర్లపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డప్పు గిరిబాబు మాట్లాడుతూ రాగిడి లక్ష్మారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఉదయం లేచిన నుండి రాత్రి నిద్ర పోయేవరకు అహర్నిశలు ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గంలో భగాయత్, శిల్పారామం, స్కైవే, మల్లాపూర్ లో వైకుంఠ ధామం, చర్లపల్లి లో రైల్వే బ్రిడ్జి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఇంత అభివృద్ధి చేస్తుంటే ఏమీ చేయడం లేదని అనడానికి మనసెలా వచ్చిందన్నారు. కేసీఆర్ కిట్టు, మధ్యాహ్న భోజనం, బయటి చదువులకు 25 లక్షల పథకం, పెళ్ళిచేసుకుంటే కల్యాణలక్ష్మి, శాధీ ముభారక్ పథకం ద్వారా 1 లక్ష 13 వేల రూపాయలు ఇస్తున్నామన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మీ ప్రభుత్వం వస్తె ఏం అభివృద్ధి చేస్తారో చెప్పాలన్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి పెద్దాపురం కుమారస్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపించకపోతే కళ్ళు కడుక్కుని చూదాలన్నారు. ఎమ్మెల్యే జోలికి వస్తే తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. ఉప్పల్ నియోజకవర్గంలో 10 డివిజన్లు విడిచి ఒక్క కాప్రా డివిజన్ పైనే మాట్లాడటం సబబు కాదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెడ్డి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *