- మరోమారు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తా
- త్వరలోనే తెలంగాణ భవన్ నిర్మాణం
- రాష్ట్రానికి మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
న్యూ దిల్లీ, డిసెంబర్ 12 : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, విభజన చట్టంలోనే ఇది ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి వెల్లడిరచారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని…అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ హావిూ ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీని ఆదుకోవాలన్న లక్ష్యంతోనే పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక స్పెషల్ స్టేటస్ హావిూ ఇచ్చారని అన్నారు. విభజన వేళ ఇచ్చిన హావిూలను అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎప్పుడో హోదా దక్కేదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. దిల్లీలో పర్యటిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం ఉమ్మడి ఏపీ భవన్‌కు వెళ్లారు. అక్కడ పలు బ్లాక్‌లను మంత్రి పరిశీలించారు.
ఉమ్మడి ఏపీ భవన్ ఆస్తుల వివరాలు, రాష్ట్ర వాటాను అధికారులు మ్యాప్ ద్వారా ఆయనకు వివరించారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ నిర్మాణ స్థలాన్ని కోమటిరెడ్డి పరిశీలించారు. వొచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి దిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులు చేపట్టాలనుకుంటున్నట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఏపీ భవన్‌కు చెందిన ఆస్తులను పరిశీలించామన్న ఆయన.. తెలంగాణ భవన్ నిర్మాణ వివరాలను సీఎంకు వివరిస్తానన్నారు. ఇప్పటికే నిర్మాణం ఆలస్యమైందన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉమ్మడి ఏపీ భవన్ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేశారు. త్వరలో రీజనల్ రింగ్ రోడ్ పనులు ప్రారంభిస్తామన్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఛైర్మన్‌ను కలిసి చర్చిస్తానన్న ఆయన, గత ప్రభుత్వం రూ. 300 కోట్ల విషయంలో ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా చేసిందన్నారు.
రూ. 20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు పూర్తిగా కేంద్రం భరిస్తుందన్న కోమటిరెడ్డి, యుటిలిటీ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కోరిందన్నారు. గత ముఖ్యమంత్రి రూ. 300 కోట్లు ఇవ్వలేమని లేఖ రాయడంతోనే పనులు ప్రారంభం కాలేదని గుర్తు చేశారు. 340 కి.విూ పొడవైన రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకే మణిహారం అని, సగం తెలంగాణ రాష్ట్రం దీని కింద కవర్ అవుతుందన్నారు. దేశంలో మరెక్కడా ఇంత పెద్ద రింగ్ రోడ్డు ప్రాజెక్టు లేదన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి యుటిలిటీ ఖర్చులు భరిస్తామంటూ కేంద్రానికి లేఖ రాయిస్తానన్నారు. నెల రోజుల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చూస్తామని, రూ. 60 కోట్లకు ఒక టెండర్ చొప్పున బిట్లుగా పనిని విభజించి త్వరగా పూర్తయ్యేలా చూస్తామని వెల్లడిరచారు.





