- భారత్ స్ఫూర్తిని నిలిపిన ఎన్‌డిఏ కూటమి
- విజయవంతమైన భాగస్వామ్యం
- పేదల సంక్షేమమే మనందరి కర్తవ్యం
- ఎన్‌డిఏ అంటే…న్యూ ఇండియా, ఆస్పిరేషనల్ ఇండియా, డెవలప్‌డ్ ఇండియా
- ఎన్‌డిఎ భేటీలో ప్రధాని మోదీ ఉద్ఘాటన
న్యూదిల్లీ, జూన్ 7 : ఎన్డీయే అంటేనే సుపరిపాలన అని, మన కూటమి అసలైన భారత్ స్ఫూర్తిని చాటుతుందని, మనది అత్యంత విజయవంతమైన భాగస్వా మ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం దిల్లీలో శుక్రవారం జరిగింది. ఇందులో తమ లోక్‌సభా పక్ష నేతగా మోదీని ఎన్డీయే నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. అనంతరం ఆయన మాట్లాడు తూ… మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపా రు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లలో ఈ కూటమి దేశాన్ని మూడుసార్లు ఐదేళ్లు పాలించిందని, మరోసారి ఐదేళ్ల పాలనకు ప్రజలకు అవకాశమిచ్చారని, దేశం కోసం నిబద్ధత కలిగిన బృందం ఇదని, పేదల సంక్షేమమే మనందరి ప్రథమ కర్తవ్యమని మోదీ అన్నారు. దేశ అభివృద్ధి చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించామని, వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసి తీరుతామని స్పష్టం చేశరు.
ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న కూటమి ఇంతగా ఎప్పుడూ విజయవంతం కాలేదని, ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంఖ్యాబలం అవసరమని, దేశాన్ని నడపాలంటే సర్వసమ్మతం కావాలని, కూటమిలో పరస్పర విశ్వాసమే ప్రధానమని, అన్ని అంశాల్లో ఏకగ్రీవ నిర్ణయాలే లక్ష్యమని మోదీ అన్నారు. ఇక అంటే ’న్యూ ఇండియా, డెవలప్‌డ్ ఇండియా, ఆస్పిరేషనల్ ఇండియా’ అని కొత్త అర్థం చెప్పారు. దక్షిణాది ప్రజలు ఎన్డీయేను ఆదరించారని, కర్ణాటక, తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డా.. అతి తక్కువ కాలంలోనే అక్కడి ప్రభు త్వాలు ప్రజల విశ్వాసం కోల్పోయాయని, లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లోని ప్రజలు భాజపాకు అండగా నిలిచారన్నారు.
తమిళనాడులో సీట్లు గెలవలేకపోయినా వోట్లు పెరిగాయని, కేరళలోనూ తమ కార్యకర్తలు ఎన్నో బలిదానాలు చేశారని, తొలిసారి అక్కడి నుంచి తమ ప్రతినిధి సభలో అడుగుపెడు తున్నారన్నారు. అరుణాచల్, సిక్కింలో క్లీన్‌స్వీప్ చేశామని, ఏపీ ప్రజలు కూటమికి పెద్ద ఎత్తున మద్దతిచ్చారని, చంద్రబాబుతో కలిసి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నామని, ఏపీలో ఇంత భారీ విజయం ప్రజల ఆకాంక్షలను అద్దం పట్టిందని మోదీ కొనియాడారు. ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించిందని, అయినా కూడా విపక్షాలు తమ విజయాన్ని తిరస్కరించేందుకు ప్రయత్నించాయని, తాము ఓడిపోయామని చిత్రీకరించాలని చూశాయని, కానీ, తమకు ఓటమి లేదని దేశ ప్రజలకు తెలుసునన్నారు. ఎన్నికల ముందు ఈవీఎంలను కొందరు సందేహించారని, ఫలితాల తర్వాత అవన్నీ పటాపంచలయ్యాయని, ఇకనైనా విపక్షాలు పార్లమెంట్‌లోకి వొచ్చి చర్చల్లో పాల్గొంటాయని భావిస్తున్నానని మోదీ అన్నారు.





