- పకడ్బందీగా ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్
- మంత్రి హరీష్ రావును కలిసిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఖ్యాతి గడించిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఉద్యోగులు పింఛనర్ల అన్ని రకాల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. టిఎన్జివో సంఘం గౌరవాధ్యక్షులు దేవి ప్రసాద్ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి హరీష్ రావును కలిశారు. ఈ సందర్భంగా ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్, ఇతర సమస్యల గురించి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…ప్రభుత్వ ఉద్యోగులు పింఛనర్ల కోసం ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్‌ను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల ప్రతినిధులు సభ్యులుగా ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ స్కీమ్ ద్వారా అత్యున్నత వైద్య సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులోకి వొస్తాయన్నారు. ఉద్యోగులకు అత్యధిక వేతనాలు, పింఛన్లు అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో మొండిగా ప్రవర్తిస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ రాష్ట్ర అబివృద్ధి, సంక్షేమం పై చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. ఉద్యోగుల, పించనర్ల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, పింఛనర్ల అన్ని సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి హరీష్ రావును కలిసిన వారిలో తెలంగాణ స్టేట్ గౌట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్, ట్రెజరర్ గంగారెడ్డి, పింఛన్ల జెఏసి ఛైర్మన్ లక్ష్మయ్య, పూర్ణ చందర్ రావు, నర్సింగా రావు, ఎల్ శ్రీనివాస్ రెడ్డి ఇతర సభ్యులు ఉన్నారు.




