ఎం‌త అభివృద్ధి సాధించినా…పర్యావరణ పరిరక్షణే ప్రాథమిక ధ్యేయం

  • అటవీ రక్షణ కోసం అధికారుల కార్యదీక్ష
  • అటవీ అధికార అమరుల ఆశయాలు సజీవంగా ఉండాలి
  • రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలోనే సమతుల్య పర్యావరణానికి ప్రణాళిక
  • అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరుల ఆశయాలు సజీవంగా ఉండాలంటే..జంగల్‌ ‌బచావో-జంగల్‌ ‌బడావో నినాదాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేలా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు. సోమావారం అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం తన సందేశంలో…అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేమని, రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు గుర్తు చేశారు. దశాబ్ది తెలంగాణలో ఆ సంకల్పం ఫలితాలు చూస్తున్నామని తెలిపారు. అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి అన్నివర్గాల మద్దతు లభించటంతో ఇవాళ అద్భుతమైన ఫలితాలను చూస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

హైదరాబాద్‌ ‌లాంటి కాంక్రీట్‌ ‌కీకారణ్యంలో కూడా ఊహించనంత పచ్చదనం పెరగడంతో అంతర్జాతీయ ఉద్యానవన ఉత్పత్తిదారుల సంఘం అందించే వరల్డ్ ‌గ్రీన్‌ ‌సిటీ అవార్డ్ ‌హైదరాబాద్‌కు దక్కిందని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. అభివృద్ది ఎంత సాధించినా..సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా..ప్రకృతి పరిరక్షణ మన ప్రాథమిక ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు. పర్యావరణపరంగా తగిన రక్షణ చర్యలు చేపట్టని ఫలితమే గ్లోబల్‌ ‌వార్మింగ్‌ ‌రూపంలో చూస్తున్నామని అన్నారు. మనతో పాటు భవిష్యత్‌ ‌తరాలూ పుడమిపై జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

ఈ దిశగా అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని.. హరిత తెలంగాణ కోసం లక్షిత పచ్చదనం 33 శాతం సాధించే దాకా కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే అటవీ రక్షణ కోసం కార్యదీక్షతో పని చేసిన అధికారులు, సిబ్బంది.. 22 మంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారన్న సీఎం కేసీఆర్‌..‌వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తి దాయకమని చెప్పారు. అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరులకు హృదయ పూర్వక శ్రద్ధాంజలి ఘటించారు. వారి ఆశయాలు సజీవంగా ఉండాలంటే.. ప్రభుత్వం అమలు చేస్తున్న జంగల్‌ ‌బచావో-జంగల్‌ ‌బడావో నినాదాన్ని చిత్తశుద్ధితో మనం అమలు చేయాలని, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆ దిశగా ప్రతిజ్ఞ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *