ఉభయసభలు నేటికి వాయిదా

నేడు గవర్నర్‌ ప్రసంగంపై చర్చ
తొలిరోజు సభకు కెసిఆర్‌ డుమ్మా

హైదరాబాద్‌,ఫిబ్రవరి8 : ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించారు. గవర్నర్‌ ప్రసంగంలో కాళోజీ కవితను ప్రస్తావించిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజాకవి, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు కవితతో గవర్నర్‌ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ కవితలో గత ప్రభుత్వం తీరును ఎండగడుతూ గవర్నర్‌ వ్యాఖ్యలు చేశారు.
‘ అధికారమున్నదని హద్దు పద్దు లేక.
అన్యాయమార్గాల నార్జింపబూనిన .
అచ్చి వచ్చే రోజులంతమైనాయి .
అచ్చి వచ్చే రోజులంతమైనాయి!‘ అంటూ గవర్నర్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. కాగా… గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్‌ స్పీచ్‌లో గత బీఆర్‌ఎస్‌ పాలనపై ఘాటైన విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.  మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ డుమ్మా కొట్టారు. శుక్రవారం ధన్యవాద తీర్మానం చేయడానికి ఆయన హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. శస్త్ర చికిత్స చేయించుకున్న కారణంగా గత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ హాజరుకాలేదు.గవర్నర్‌ ప్రసంగం అనంతరం ఉభయసభలు వాయిదా పడ్డాయి. శుక్రవారం  గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. శాసనసభ కార్యకలాపాల సలహాకమిటీ బీఏసీ సమావేశమై సభను ఎన్ని రోజులు నడపాలనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది.. ఆర్థిక శాఖను నిర్వహించే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫిబ్రవరి 10న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం బడ్జెఎపై సాధారణ చర్చ జరగనుంది. సమావేశాలు సుమారు 7`10 రోజుల వరకు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. బడ్జెట్‌కు ఆమోదం తరవాత వాయిదా పడుతుంది. ఇకపోతే ఆనవాయితీ ప్రకారం కాంగ్రెస్‌ సభ్యులు సిఎం రేవంత్‌ సహా అంతా కండువాలు కప్పుకుని వచ్చారు. బిఆర్‌ఎస్‌ సభ్యులు గులాబీ కండువాలతో వొచ్చారు.

13 వరకు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు
నేడు గవర్నర్‌ ప్రసంగంపై చర్చ
10న బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న భట్టి
బిఎసి సమావేశంలో నిర్ణయం
సమావేశానికి హరీష్‌ రాకపై శ్రీధర్‌ బాబు అభ్యంతరం

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశం నిర్ణయించింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించగా.. శుక్రవారం గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది.  ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థకమంత్రి హోదాలో డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెడుతారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక ఇవే తొలి  బడ్జెట్‌ సమావేశాలు కాగా… పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉండి సమావేశాల్లో పాల్గొంటోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌  ప్రవేశపెట్టడానికే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అనంతరం బ్జడెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. ఈ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తిని సంతరించుకున్నాయి. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపటానికి ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు బీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతోంది.  అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి దూరంగా ఉన్న కేసీఆర్‌..  ఫిబ్రవరి 10వ తేదీన  అసెంబ్లీకి రానున్నారు. ఇదిలావుంటే బీఏసీలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావుకు చేదు అనుభవం ఎదురయ్యింది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అధ్యక్షతన జరుగుతున్న బీఏసీ విూటింగ్‌కు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు బదులుగా హరీష్‌రావు హాజరయ్యారు. దీనిపై మంత్రి శ్రీధర్‌ బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఏసీలో మెంబర్‌ కాకుండా హరీష్‌ హాజరుకావడంపై అభ్యంతరం తెలిపారు. స్పీకర్‌ అనుమతితో కేసీఆర్‌ స్థానంలో హాజరైనట్లు హరీష్‌రావు చెప్పారు. అయినప్పటికీ అలా కుదరదని మంత్రి శ్రీధర్‌ బాబు తేల్చిచెప్పేశారు. దీంతో చేసేదేవిూ లేక బీఏసీ సమావేశం మధ్యలో నుంచి హరీష్‌రావు బయటకు వచ్చేశారు. అయితే బిఆర్‌ఎస్‌ నుంచి అప్పటికే కడియం శ్రీహరి హాజరయ్యారు. కాగా.. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు హాజరయ్యారు. అలాగే బీఆర్‌ఎస్‌ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ నుంచి మహేశ్వర్‌ రెడ్డి, ఎంఐఎం నుంచి బలాల, సీపీఐ ఎమ్మేల్యే కూనంనేని సాంబశివ రావు హాజరయ్యారు. అసెంబ్లీ పనిదినాలు, ఎజెండాపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *