ఉనికి కోసమే ప్రతిపక్షాల అసత్య ఆరోపణలు : మంత్రి పి.సబితా రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 15: మహేశ్వరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధితో తమ ఉనికి ఎక్కడ లేకుండా పోతుందోనని కొన్ని పార్టీల నాయకులు లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్ తో పాటు కార్పొరేషన్ లో దాదాపు రూ.2.67 కోట్ల విలువ గల పలు అభివృద్ధి పనులకు మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏంఏంసి 32వ కార్పొరేటర్ వేముల నర్సింహ అద్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పక్ష పార్టీల నాయకులు తమ ఉనికి ఎక్కడ లేకుండా పోతుందోనని, అర్థం పర్థం లేని అసత్య ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి మండిపడ్డారు. తరుచుగా నాపై వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేస్తున్న ప్రతి పక్ష పార్టీలను ఒకటే కోరుతున్న, మీకు నిజంగా చిత్త శుద్ది ఉంటే, మీరు నాపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. లేనిచో ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మీర్ పేట్ లో ఇంటి పన్నులపై కొందరు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అలాంటి తప్పుడు ప్రచారాలను ఎవరు పట్టించుకోవద్దన్నారు. పంచాయితీలుగా ఉన్నప్పటి పాత పన్నుల విధానానే కొనసాగించాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఒక ప్రకటనతో పాటు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఎవరు కూడా అధిక పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఒక వేళ మున్సిపల్ సిబ్బంది అధిక పన్నులు వసూలు చేసినచో, వాటిని వచ్చే ఏడాదికి సర్దుబాటు చేయాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. కరోనా సమయంలో సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఇంటి పన్నుల చెల్లింపును సగంకు తగ్గించడం జరిగిందని గుర్తు చేశారు. కానీ ఒకే విషయాన్ని కావాలని కొందరు పదే పదే ప్రస్తావిస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంటే ప్రతి పక్షాలకు మింగుడు పడటం లేదన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో విద్యా అభ్యున్నతి కోసం దాదాపు రూ.200 కోట్ల వరకు నిధులు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో మెడికల్ కళాశాలతో పాటు మూడు డిగ్రీ కళాశాలు, ఒక పాలిటెక్నిక్ కళాశాలను తేవడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని అన్ని పాటశాలలను ఆఫ్ గ్రేడ్ చేసినట్లు తెలిపారు. ఇవే కాకుండా ఫార్మా యూనివర్సిటీ కందుకూరు వరకు మెట్రో రైల్ వంటివి వస్తున్నట్లు చెప్పారు. ఇవేమీ తెలియని కొందరు మూర్కులు సబితమ్మ ఏమి చేసిందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నియోజవర్గం పరిధిలో గల పది చెరువులను రూ.40 కోట్లతో అభివృద్ధితో పాటు సుందరీకరణ చేస్తున్నట్లు చెప్పారు. నన్ను నాన్ లోకల్ అనే వాళ్ళుకు ఒకటే చెబుతున్న ఇక్కడి ప్రజలు నన్ను ఇప్పటికే రెండు సార్లు గెలిపించిన సంగతి గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. ఎవరు నాన్ లోకల్ ఎవరు లోకల్ అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో వందల కోట్లతో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా చెరువుల సుందరీకరణ, రోడ్ల విస్తరణతో పాటు వరద, మురుగు నీరు పోయే విధంగా నానాల నిర్మాణం చేసినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రోత్బలంతో ఎన్నడు లేని విధంగా మహేశ్వరం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి, అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కల్లబొల్లి మాటలను ఎవరు నమ్మకుడదన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తుంటే, దానిని తట్టుకోలేని కొందరు రైతులకు 3 గంటల విద్యుత్తు ఇస్తే చాలు అంటున్నారు. అంటే వారికి రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే నాయకుడు కేసీఆర్ అని అలాంటి నేతలు మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమములో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, దండుగుల కిరణ్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *