- వాటిపై అభ్యంతరాలెందుకో..
- బ్యాలెట్‌తో ఎన్నికలకు వెళ్లి గెలవగలరా..
- రాహుల్ గాంధీకి ఎంపీ రఘునందన్ సూటి ప్రశ్న
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14: ఓటు చోరీ అంటూ మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తను పోటీ చేసి గెలిచిన రాయ్‌బరేలిలో రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు వస్తే మాకు అభ్యంతరం లేదు.. కానీ పోటీ చేయడానికి, రాజీనామా చేసేందుకు మీకు ధైర్యం ఉందా అని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తొలుత ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దురదృష్టవశాత్తూ ఈ దేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న వ్యక్తికి గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ దేశంలోని ఏ వ్యవస్థలపై కూడా నమ్మకం లేకపోవడం బాధాకరమన్నారు. 1989లో ఓటమి తర్వాత బ్యాలెట్ పేపర్లు మంచివి కావని, బ్యాలెట్ పేపర్లతోనే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఓడిపోయిందని, అందుకే వాటి స్థానంలో ఈవీఎంలను తీసుకురావాలని రాజీవ్‌గాంధీ నిర్ణయించారని తెలిపారు. మొదటిసారిగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని షాద్‌నగర్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించారన్నారు. బ్యాలెట్ పేపర్లకు, ఈవీఎంలకు మధ్య తేడా ఏంటని రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ఎప్పుడైనా శాస్త్రీయంగా స్టడీ చేశారా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ కూడా ప్రారంభ దశలో ఈవీఎంలకు వ్యతిరేకమని, కానీ శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత ఈవీఎంలకు ఓకే చెప్పిందని వివరించారు. కాంగ్రెస్ నేతలు తమ పార్టీ గెలిస్తే ఈవీఎంలు ‘సరే’ అని.. ఓడితే ‘తప్పు’ అని దురుద్దేశంతో అంటున్నారని ఆయన విమర్శించారు. 20వ శతాబ్దంలో దేశానికి కంప్యూటర్ పరిచయం చేసిన తన తండ్రి ఆలోచన ప్రోగ్రెసివ్ అయితే ఇపుడు కొడుకు ఆలోచనేమో డిస్ట్రక్టివ్ అని ఎద్దేవా చేశారు. రేపు పశ్చిమ బెంగాల్, బీహార్ ఎన్నికల సందర్భంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) చేసి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడినవారి ఆధార్/ఎలక్షన్ కార్డులను గుర్తించి ఓటు హక్కును రద్దు చేస్తుందేమోననే భయంతో కాంగ్రెస్ పార్టీ ముందే దీన్ని వ్యతిరేకిస్తోందన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మీద వాళ్లకు విలువ లేదు.. వాళ్లు గెలిచిన ఈవీఎంలకే విలువ చూపడం లేదని అన్నారు. ఒక వ్యవస్థపై ఆరోపణ చేస్తున్నప్పుడు, ఒక వ్యవస్థని నిందిస్తున్నప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ శాస్త్రీయంగా ఆ వ్యవస్థపై స్టడీ చేయాలని హితవు పలికారు.
ఈవీఎంలపై స్టడీ చేశారా?





