న్యూ దిల్లీ, జూలై 24 : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అక్కైంట్లలో ఉండే సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేటు..2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15శాతం ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.15శాతం వడ్డీ ఇవ్వాలని ఈ ఏడాది మార్చిలో ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ (సీబీటీ) నిర్ణయం తీసుకుంది.
2021-22లో ఇచ్చిన 8.10శాతంతో పోల్చితే ఇది 0.05 శాతం అధికం. ఈ నిర్ణయాన్ని సీబీటీ.. కేంద్ర ఆర్థిక శాఖకు పంపించింది. తాజాగా ఆర్థికశాఖ కూడా ఇందుకు ఓకే అనటంతో వడ్డీరేటుపై ఈపీఎఫ్‌వో ప్రకటన చేసింది. కేంద్రం నుంచి ఆమోదం లభించడంతో ఈపీఎఫ్‌వో ఫీల్డ్ అధికారులు త్వరలోనే ఈ వడ్డీ మొత్తాన్ని 6 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 2022 మార్చిలో ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును నాలుగు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి తగ్గించిన విషయం తెలిసిందే.



