హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : బీసీల విద్యా, ఉద్యోగ అవకాశాకు గొడ్డలి పెట్టు లాంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లను తక్షణమే రద్దు చేయాలని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ చేసారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కృష్ణ స్వరూప్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం లో కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ దేశంలోను, రాష్ట్ర జనాభాలోనూ మెజారిటీ బీసీ ప్రజల అవకాశశాలను కొల్ల గోడుతున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లతో విద్యా, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో నిజమైన బడుగు వర్గ బీసీలకు కేంద్ర రాష్ట్ర స్థాయిలో తీవ్రంగా అన్యాయం జరుగుతుందన్నారు. బీసీల కుల జనాభా గణన లెక్కించాలని, బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్ లు కేటాయిస్తూ పార్లమెంట్ లో చట్టం చేయాలనీ 149 బీసీ కుల సమాజం పోరాటం చేస్తున్నా స్పందించని ప్రధాని నరేంద్ర మోడీ సాధ్యం కానీ ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామని మోడీ ప్రకటించడం మోసపూరితం అన్నారు. బీసీలకు చెందాలిసిన రాజ్యాధికారంలో వాటాను దోపిడీ కులాలు, వైదిక బ్రాహ్మణ కులాలు అక్రమంగా అనుభవిస్తున్నాయని ఆరోపించారు. బీసీల నోటి కాడ కూడిని లాక్కునేలా బీజేపీ మోడీ సర్కార్ చర్యలు ఉన్నాయన్నారు. అగ్రకుల పేదలు ఈడబ్ల్యూఎస్ ముసుగులో బీసీల అవకాశాలను తన్నుకు పోతున్నారని విమర్శలు చేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ బీసీ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి దేవునూరి శ్రీనివాసు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి.హుస్సేన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరం సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తక్షణమే రద్దు చేయాలి




