పదేళ్లు నిరుద్యోగుల పట్ల బీఆరెస్ నిర్లక్ష్యం ˜త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తాం
-గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేసిన సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్లు బీఆరెస్ నిర్లక్ష్యం వహించిందని, వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు వొచ్చాయని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాము 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడుతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించామని, త్వరలోనే గ్రూప్ 1 పరీక్షను నిర్వహించబోతున్నామని, తమ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంటే.. మామా అల్లుళ్లు తమను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని దుయ్యబట్టారు. తాను రాజీనామా చెస్తే హరీష్ రావు కూడా చేసి చూపిస్తా అని అంటుండని, హరీష్ రావును చూస్తుంటే.. మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారని ఎదేద్వఆ చేశారు. అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుదని, పదేళ్లు మంత్రిగా ఉండి హరీష్ ఏం చేశారు.
అంటూ సిఎం ప్రశ్నించారు. మేడిగడ్డపై చర్చకు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పారిపోయిండ్రు..దశ బాగుంటే దిశతో పని లేదు.. ప్రజలకు ఏం ద్రోహం చేశారో ఇప్పటికైనా కేసీఆర్ తెలుసుకోవాలి.. 3,650 రోజులు అధికారంలో ఉండి మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? మా ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లో 25వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టాం.. ఇది మీ కళ్లకు కనిపించడం లేదా? మీరు ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా..ఇంకేం చేసినా.. ప్రజలు మీపై సానుభూతి చూపరు.. బీఆరెస్ పాలనలో తండాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న 6,450 సింగిల్ టీచర్ పాఠశాలలు మూసేశారు. పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే గత ప్రభుత్వం పాఠశాలలు మూసేసింది. త్వరలో మెగా డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టి పేదలకు విద్య అందేలా చర్యలు తీసుకుంటాం.. గురుకుల పాఠశాలలన్నీ ఒకే గొడుకు కిందకు తీసుకోస్తాం.. 20ఎకరాల్లో ఒకే క్యాంపస్ లో అన్ని రకాల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. కొడంగల్ లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నాం.. ఈ మోడల్ ను అన్ని నియోజకవర్గాల్లో ఆచరణలోకి తీసుకొస్తాం. అన్ని నియోజకవర్గాల్లో ఇందుకు కావాల్సిన స్థలాలను సేకరించాలని అధికారులకు ఆదేశిస్తున్నా…అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.





