ఇండియా కూటమికి 295 సీట్లు

  • ప్రభుత్వం ఎగ్జిట్‌ పోల్స్‌లో తమ సీట్లను పెంచి చూపించే ప్రయత్నం
  • కౌంటింగ్‌ రోజున ఏజంట్లు కేంద్రం నుంచి బయటకు రావొద్దు
  • ఇండియా కూటమి నేతల సమావేశం  అనంతరం మీడియాతో ఖర్గే  

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 1 : లోక్‌సభ ఎన్నికల్లో భారత కూటమి పార్టీలకు 295 సీట్లకు పైగా వొస్తాయని, ప్రజల నుంచి వొచ్చిన అభిప్రాయాల మేరకు, తమ నాయకులందరితో మాట్లాడిన తర్వాత తాము ఈ లెక్కకు వొచ్చామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తెలిపారు. శనివారం దిల్లీలోని తన నివాసంలో ప్రతిపక్ష పార్టీ అగ్రనేతల సమావేశం అనంతరం ఖర్గే విలేఖరులతో మాట్లాడుతూ..కూటమి నేతలు సుమారు రెండున్నర గంటలపాటు సమావేశమై పలు అంశాలపై చర్చించారని, ముఖ్యంగా కౌంటింగ్‌ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తమ పార్టీ కార్యకర్తలకు ఇవ్వాల్సిన సూచనలపై చర్చించారని అన్నారు. బిజెపి ప్రభుత్వం ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా తమకు అనుకూలంగా కథనాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే తాము ప్రజలకు నిజం చెప్పాలనుకుంటున్నాని అన్నారు.

ఇది ప్రజల సర్వే అని, ప్రజలు ఈ సమాచారాన్ని తమ నాయకులకు ఇచ్చారని అన్నారు. మరోవైపు ప్రభుత్వ సర్వేలు, వారి మీడియా మిత్రులు కూడా లెక్కలు పెంచి బయటపెడతారని, కాబట్టి తాము వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలనుకుంటున్నామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు అన్నారు. ఇండియా బ్లాక్‌ పార్టీలు కూడా తమ కార్యకర్తలకు ఫారం 17సి గురించి సూచనలు ఇచ్చాయని, వారు ఎన్నికల ధృవీకరణ పత్రం పొందే వరకు కౌంటింగ్‌ హాల్‌ నుండి బయటకు రావద్దని ఆయన అన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌, సమాజ్‌ వాదీ పార్టీ, సీపీఐ(ఎం), సీపీఐ, డీఎంకే, జేఎంఎం, ఆప్‌, ఆర్జేడీ, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్‌ పవార్‌) సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నందున తాము సమావేశానికి హాజరు కాబోమని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించగా, వ్యక్తిగత కారణాలతో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సమావేశానికి హాజరుకాలేదు. హాజరయిన నాయకులలో శరద్‌ పవార్‌, అఖిలేష్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, అనిల్‌ దేశాయ్‌, సీతారాం ఏచూరి, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, సంజయ్‌ సింగ్‌, రాఘవ్‌ చద్దా, చంపాయ్‌ సోరెన్‌, కల్పనా సోరెన్‌, టిఆర్‌ బాలు, ఫరూక్‌ అబ్దుల్లా, డి రాజా మరియు ముఖేష్‌ ఉన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌ కూడా హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *