- ఆవ పంటకు అనుమతిని కేంద్రం వెనక్కి తీసుకోవాలి
- శాస్త్రవేత్తలు, రైతులు, రైతు సంఘాల, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థుల డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : ఇటీవల జన్యుమార్పిడి ఆవ పంటకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆహార పంటలలో జన్యుమార్పిడి పంటలను చొప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘‘సురక్షిత ఆహార దినోత్సవం’’ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సు తీర్మానించింది. ఫిబ్రవరి 9, 2010 రోజునే బీటీ వంకాయను నిషేధిస్తూ అప్పటి కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ ప్రకటించిన నిర్ణయాన్ని గుర్తు చేసుకుంటూ, పౌర సమాజ సంఘాలు, ప్రతినిధులతో జరిగిన సదస్సులో వక్తలు జన్యు మార్పిడి పంటలపై ప్రపంచ వ్యాపిత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆహార పంటలలో జన్యు మార్పిడిని ప్రవేశ పెట్టకుండా ఆపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఫిబ్రవరి 9 సురక్షిత ఆహార దినోత్సవం సందర్భంగా రైతు స్వరాజ్య వేదిక, జన విజ్ఞాన వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదిక, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక(ఎన్ఏపిఎమ్) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. సదస్సు అనంతరం సుందరయ్య పార్క్ చుట్టూ బ్యానర్, పోస్టర్లతో, నినాదాలతో ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించారు. ఫిబ్రవరి 9 నుండీ 15 వరకూ రాష్ట్ర వ్యాపితంగా రైతులకూ, వినియోగదారులకూ, విద్యార్థులకూ అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని సమావేశం పిలుపునిచ్చింది. సామాజిక కార్యకర్త డా.
రుక్మిణీ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక నుండి విస్సా కిరణ్ కుమార్, జన విజ్ఞాన వేదిక నుండి శాస్త్రవేత్తలు ప్రొ. బి.ఎన్. రెడ్డి, డా. కోయ వేంకటేశ్వర రావు, ప్రొ. సత్య ప్రసాద్, ప్రొ. ఆదినారాయణ, రైతు స్వరాజ్య వేదిక నుండి బి.కొండల్, శ్రీ హర్ష, తెలంగాణ విద్యావంతుల వేదిక నుండి అంబటి నాగయ్య, దోనగంటి కృష్ణ, తెలంగాణ జన సమితి నాయకులు ప్రొ. కోదండరామ్, సామాజిక విశ్లేషకులు, స్వతంత్ర జర్నలిస్ట్ కె సజయ మరియు ఇతర తెలంగాణ రైతు సంఘం నాయకులు, రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.




