పాటై, మాటై, పదునెక్కిన నినాదమై ప్రతిధ్వనించాలి… ఈ మట్టిమీద పుట్టెడాశతో, ఈ మనుషుల మీద గుండెడు నమ్మకాలతో, రేపటి మీద అనంతమైన ప్రేమతో, మానవత నిండిన మనుషుల ప్రపంచం కోసం ఇప్పుడు కవులు కవితరాయాలి అంటారొక కవి. నిజమే సమాజాన్ని స్పృశించని కవితలో ఉద్వేగానుభూతుల యదార్థ జీవితం అంతగా కనిపించదు. అంతర్గతంగా, బాహ్యంగా అనేక సంక్షిష్టతలను తొలచినప్పుడు బయల్పడే కవిత్వ వ్యక్తీకరణను అవిరామంగా కవి నక్క హరికృష్ణ పాఠకలోకానికి అందించారు. అనేక బాధల్లో అక్షరమే ఒక బాసట, చెప్పుకోలేనంత చెలిమిని అందించిన గొప్ప ఊరట అన్న సంగతికి అద్దంపట్టే కవితలిందులో ఉన్నాయి. నైతికత, సామాజికతతో కూడిన శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి మానవీయ హృదయ చైతన్య దీపికలుగా కవితలను కవి మలిచారు. ప్రధానంగా తెలంగాణ సంస్కృతి, పర్యావరణం, మానవీయ విలువలు, దేశభక్తి, మానవ సంబంధాలు, కరోనా వంటి అంశాలపై ఆలోచింపజేసే కవితలిందులో ఉన్నాయి.
మట్టి పెల్లలో ప్రాణం కరిగి పల్లె కన్నీరు పెడుతున్నందున మనిషితనం బతకాలన్నారు. వలస భూతానికి బలియై గల్లంతైన గ్రామంలో కండ్లలో ఖాళీ గుల్లలు కనబడుతున్నాయని ఖేదపడ్డారు. మానవత్వం చిగురించి మనిషితనం మళ్లీ బతికితే పల్లె తల్లి విముక్తి పొందుతుందని చెప్పారు. కవిగా తాను కన్న కల జీవన కవనమై విశ్వనరునికి మార్గమై దేశజనుల పూలపండుగగా ప్రభవించాలని కోరుకున్నారు. అందమైన అబద్ధపు సౌధాలను కూలదోసి దేహపుతిత్తిలో సమభావన సేద్యం చేస్తే విశ్వమానవ పరిమళం పరివ్యాప్తమవుతుందని చెప్పారు. అలవోకగా కంచంలో పంచబడి కనబడకుండా జీర్ణమై పోతావని మనిషిని హెచ్చరించారు. నిర్జీవస్థితిలో అబద్దం నిజం, నిజం అబద్ధం అయి వాస్తవం నివురు కింద నలుగుతున్నందున సంగతితో కూడిన తాత్విక సత్యాన్ని నొక్కి చెప్పారు. ఆలోచనలకు హరిత వర్ణం అందించి, మురికి గోడల విధ్వంసాలకు ముగింపును పలకమని మనిషికి హితవు పలికారు. గాయపడ్డ కాలం కట్టలు తెగిన ఆగ్రహమై, అనంతమై ప్రవహిస్తుందని చెప్పారు. తెగదీత, తెగింపుల మధ్య భవిష్యత్తు కలికుండ అన్నారు. ఇన్ని రక్తబంధాల నడుమ అమ్మ అడుగులను రూపమాపడం ఎన్నటికీ నెరవేరని కల అని స్పష్టం చేశారు.
చూపుడు వేలు నీవైపే ఎందుకు తిరుగుతున్నదో తెలుసుకుంటే పరివర్తనా మూలాలు ఆవిష్కృతమవుతాయని చెప్పారు. కోట్ల విశ్వాసాలకు ప్రతీకగా తెలంగాణ తల్లిని ఇలవేల్పుగా నిలుపుకుంటామని చెబుతూ మృత్యువును ముద్దాడిన భగీరథునిగా జయశంకర్ సార్‌ను స్మరించారు. తెలంగాణ త్యాగాల జనసాగరంగా ట్యాంక్‌బండ్ పునీతమైందని తెలిపారు. తంగేడు చెట్టును సకల జనుల ఆకలి తీర్చిన దయాపూర్ణగా అభివర్ణించారు. నోటికాడ, మాటకాడ మనిషికి హద్దుండాలంటూ అతని స్వీయ అంతర్నాధనమే ఫలితాన్ని తేల్చేస్తుందని చెప్పారు. ఊహాన్ వారసుని కరోనా అమానవీయానికి ఒక దీపం, కొన్ని జ్ఞాపకాలు మిగిలాయని వేదన చెందారు. వైరస్ విస్తరణ చుట్టూ విద్యుత్ కంచె కట్టడమే మానవ కళ్యాణమన్నారు. కాటు వేసే ఖలుని కలుగులోంచి లాగే సరిపడే ధూపమేదో తెలుసుకుంటే సమస్య సమసిపోయి పరిష్కారం దక్కుతుందని తెలిపారు. బతుకుకు తాత్వికతను నేర్పే త్యాగశీలిగా, ఎండుటాకును చూపారు. మనిషి ఎరుకను కొత్తతీరం ఆవిష్క్రతమై చూపాలన్నారు. గాన భారతిగా గాయకుడు బాలును స్మరిస్తూ ప్రపంచానికి స్వరాన్నిచ్చిన రసక్రాంతిగా చూపారు. వసంతం వజ్రాయుధమై లేస్తే పాతాళానికి పార్సిల్ అవుతారంటూ రాజకీయులకు ఆకుపచ్చతడి సాక్షిగా బలమైన హెచ్చరిక చేశారు. కవిత్వాన్ని భవిష్యత్తుకు భరోసా చేశారు. తెలంగాణ అమరుల ఆశయాల సాధనకు ప్రశ్నలమై మేం కాపు కాస్తుంటామన్నారు. మనుషుల మీద కబ్చా మొదలయ్యాక ప్రపంచం ప్రయాణమెటని ప్రశ్నించారు. పారేనది ఒంటరయ్యిందని బాధపడ్డారు. అగ్నితత్వం వెలికివస్తే ఆదిశక్తి అసలు శక్తి ఏమిటో తెలుస్తుందన్నారు. మనిషి జీవితం గాయాల గొంతుకగా వాడిపోతుందని వాపోయారు.
బతుకు కథల్ని అనుభవంతో అల్లి జీవితపు అంచులను ముందే చూపించిన అవ్వను తలుచుకున్నారు. రేపటి విజయసారధులకు జర తొవ్వ సూపుండ్రి అని అడిగారు. శరీరం మీద అనునిత్యం కొత్తగా కన్పిస్తున్నవన్నీ పాతగాయాలేనని చెప్పారు. బతకడం ఊపిరి కోసం చేసే పోరాటంగా మారిందని, విషవాయువుల ద్రోహచర్యను కూల్చడానికి ఉద్యమం పురుడు పోసుకుంటుందని విశ్వాసంగా తెలిపారు. నిప్పుల వర్షంలో తడిచి వాకిలి విలపించిందన్న భావన కవిలోని అంతర్నిగూఢ ఆలోచనాశీలతకు అద్దం పట్టింది. కర్తవ్యకాంతులు, శ్రమజీవిరెక్కలను ఆలింగనం చేసుకోవడం వంటి ప్రత్యేక ప్రయోగాలను యుద్ధానంతర కర్తవ్యం కవితలో చేశారు. భూగోళం కొత్తగా అనిశ్చిత వర్ణాలలో కనిపిస్తున్నదని తెలిపారు. నూతన యుగారంభం కోసం అనేక విజయాలనిచ్చే యుద్దానికెళ్లాలని అన్నారు. బంధనాల బాధ్యతల నుండి బాల్యాన్ని తప్పించి భవిష్యత్తుకు దారిచూపమని వేడుకున్నారు. కర్రుకాలిన వాసనలతో వెన్నువిరిగిన రైతు చూపులు అన్న వాక్యం ఎంతో దైన్యాన్ని చూపించింది. కరోనా విజృంభణలో కొత్త శ్వాసలను ఊదే ప్రాణదాతలుగా మారాల్సింది మనమేనన్నారు. సశేష ప్రాయశ్చిత్తం అన్న కవిత భూమి కొత్త వర్ణాలను చిత్రించుకోవడం ఆరంభించిందన్న సంగతిని తేల్చేసింది. కలాల లోపల ఎలిమినేట్ ఇంకుని పోసి/ మాటలు పూసిన కత్తి చేసినై అన్న వాక్యం వివర్ణసిరా కవితలోని వాస్తవాల అక్షరీకరణను స్పష్టంగా చూపింది. పథకాంతి లేకుంటే అంతా అగమ్యగోచరమేనన్నారు. విలువల ఊటబావి నుంచి పూడిక ఎవరు తీస్తారు అన్న ప్రశ్న కలిచివేస్తుంది. విస్తరణాకాంక్ష వాదం జ్ఞాన నేత్రాలను క్షతగాత్రం చేసిందని తెలిపారు.
బూడిద కుప్పమీద నీతి వచనాల చాన్పి జల్లుతుంటే తథాగతుడా నీ దారెటు అని వాపోయారు. కడుపుకోత కవితలో నెత్తుటితో అలికిన దేహం, అదృశ్యగాయాలు, రాలిపడ్డ వెన్నుపూసలు, కన్నీటిగీతలు, నిర్లక్ష్యపు సంతకం, నిప్పుల ఊబి, నిగ్గదీరే మొగ్గలు వంటి ప్రత్యేక ప్రయోగాలు ఆలోచింపజేస్తాయి. ఏ ప్రభలు వెలగాలి.. ఏ ఊపిరిని నిలబెట్టాలో అని మనిషిని స్వయంగా ఆలోచించుకోమంటారు. దేహం ఎడారి కాగా మనిషితనం ప్రశ్నార్థకమైందంటారు. శీతకన్నొకటి మనిషితనాన్ని మసిచేసిందని చెప్పారు. మళ్ళింపు కవితలో నిశిరాతిరి కలవర పాటు, చిగురు మేఘం గర్జన, కొత్త మెలకువ వంటి ప్రయోగపద సంయోజనం కన్పిస్తుంది. కాలరాత్రి కౌగిలి/ ఆత్మ ఘనీభవించిన/ అవకాశవాదపు ఎడారి అని నిర్వేదం ప్రకటించారు. యుద్ధభేరి మోగించాం/ మిగిలింది విజయమొక్కటే అని ఆశావాదాన్నీ వినిపించారు. కృతజ్ఞత ఎడారి ఇసుకలో పూడ్చబడింది/ మానవత్వం మంచుఖండంలో గడ్డకట్టుకుంది అన్న వాస్తవీకరణను చూపారు. ఆకలి ఆరాటం/ గడియగడియకు పోరాటమే సింగరేణి గానమన్నారు. మెదడుకు వేసిన సంకెళ్ల నుండి విముక్తి పొందేందుకొక ఆయుధం కావాలని చెప్పారు. గాయం వాసన పీల్చుకొని ఒంటికన్ను రాకాసులు తృప్తి పడతారని అన్నారు. నిర్విరామ స్వేచ్ఛా పోరాట పరంపర గురించి వివరించారు. మా మాగణం సాహిత్యం వడ్డించిన విస్తరి అని చెప్పారు. సంకలనం చివర కవి రాసిన అడుగు దగ్గరి చిగురు, విలువల భరోసా కవితలకు డాక్టర్ రామారావు వాడపల్లి చేసిన ఆంగ్లానువాదాన్ని జతచేశారు. ఎండిన నది కింద భూమి మూలుగు చప్పుడును జాగ్రత్తగా కవిత్వం చేసిన ఈ కవి మున్ముందు విరామెరుగక విస్తరించాలి.
– తిరునగరి శ్రీనివాస్, 8466053933




