- అరవై ఏళ్లలో సాధ్యం కానిది దశాబ్ద కాలంలో ఆవిష్కారం
- 12,364 కోట్ల బడ్జెట్..3,352 రూ. తలసరి ఖర్చు
- నీతి ఆయోగ్ సూచీలో నాడు 11వ స్థానంలో…నేడు 3వ స్థానంలో
- కొరోనా తాత వొచ్చినా ఎదుర్కునేలా రాష్ట్ర ఆరోగ్య రంగం సిద్ధం
- త్వరలో హెలీక్యాప్టర్లతో ఎయిర్ అంబులెన్స్‌లు
- దీనికంతటికీ కర్త, కర్మ, క్రియ సిఎం కెసీఆరే
- ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉంటే మరింత ముందుకు
- వైద్యారోగ్య శాఖ పదేళ్ల ప్రగతి నివేదికను విడుదల చేసిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : పదేళ్ల ప్రయాణాల్లో ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయ్యిందని, అరవై ఏళ్లలో సాధ్యం కాని అద్భుతాలను దశాబ్ద కాలంలోనే ఆవిష్కరించిందని రాష్ట్ర వైద్యారోగ్య ఆర్థిక, శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ ముఖ్యమంత్రి కేసిఆరేనని అన్నారు. 2014లో నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిలో 11వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు 3వ ర్యాంకుకు చేరుకుందని, మొదటి స్థానానికి చేరడానికి అడుగులు వేస్తున్నామని, వైద్య సిబ్బంది సమిష్టి కృషివల్లే ఇది సాధ్యమైందని మంత్రి తెలిపారు. సోమవారం రవీంద్ర భారతి వేదికగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ పదేళ్ల ప్రగతి నివేదికను మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. 310 మంది ఫార్మసిస్టులకు మంత్రి పోస్టింగ్ ఆర్డర్స్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…ప్రజలకు మంచి సేవలు అందించడంలో, ప్రజల ప్రాణాలు కాపాడటంలో నిత్యం నిమగ్నమై కృషి చేస్తున్న వైద్యారోగ్య శాఖలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటే, నేడు సీఎం కేసీఆర్ పాలనలో పోదాం బిడ్డో సర్కారు దవాఖానకే అనేలా మార్పు జరిగిందన్నారు.
ఇది మంత్రమేస్తెనో, మాయ చేస్తెనో జరిగిన అద్భుతం కాదని, గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 12,364 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నామని, ఒక్కొక్కరి వైద్యం పట్ల చేస్తున్న తలసరి ఖర్చు రూ. 3,532 చేస్తూ దేశంలో మూడో స్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణ వైద్యారోగ్య రంగం ఇప్పుడు ఎటువంటి హెల్త్ ఎమర్జెన్సీని అయినా తట్టుకోవడానికి సర్వ సన్నద్ధంగా రూపొందిందని, మొత్తం 50 వేల పడకలతో కొరోనా కాదు దాని తాత వొచ్చినా ఎదుర్కునేలా సిద్దమైందన్నారు. ఈ సందర్భంగా ఫార్మసిస్టులుగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతూ వైద్య ఆరోగ్యశాఖ కుటుంబంలో చేరుతున్న 310 మంది ఫార్మసిస్టులకు ఆయన స్వాగతం పలికారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 105, టీవీవీపీ పరిధిలోని 135, డీఎంఈ 70 పోస్టులకు గాను మొత్తం 310 మంది ఎంపికయ్యారని మంత్రి తెలిపారు. హాస్పిటల్లో సేవలు బాగుండాలంటే అందరికీ తగినన్ని ఔషధాలు ఉండాలని, ఔషధాలను సమకూర్చడం, రోగులకు అందించడంలో ఫార్మసిస్టులది కీలకపాత్ర అని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగం అనేది గొప్ప అవకాశమని, ప్రైవేటు ఉద్యోగాలతో ఉపాధి దొరికితే..ప్రభుత్వ ఉద్యోగులకు..ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతుందని, రోగులకు చిరునవ్వుతో మందులు అందిస్తే వారు ఎంతో సంతోషిస్తారని మంత్రి హరీష్ రావు ప్రభుత్వ ఫార్మసిసులకు సూచించారు. ఈ 9 ఏళ్లలో వైద్య శాఖలో 22,600 పోస్టులు భర్తీ చేసుకున్నామని, మరో 7291 పోస్టుల భర్తీ పక్రియ కొనసాగుతున్నదని, ఇందులో 5204 స్టాఫ్ నర్స్ పోసులకు సంబంధించి పరీక్ష పూర్తయిందని, వారంపది రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, 1931 ఎంపిహెచ్ఏ ఫీమేల్(అప్లికేషన్ స్టేజ్) పోస్టులు ఉన్నాయని, ఇవి కూడా పూర్తయితే పదేళ్లలోనే 30 వేల ఉద్యోగాలు వైద్య శాఖలో ఇచ్చిన ఘనత సిఎం కేసిఆర్‌కు దక్కుతుందన్నారు. వైద్యారోగ్య శాఖ పదేళ్ల ప్రగతి నివేదిక విడుదల చేయడం సంతోషంగా ఉందని, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో, తమ ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ పని తీరుకు నివేదికే నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
గ్రామ స్థాయిలో పల్లె దవాఖానలు, పట్టణ స్థాయిలో బస్తీ దవాఖానలు, మండల స్థాయిలో పిహెచ్‌సిలు, నియోజక వర్గ స్థాయిలో 100 పడకల హాస్పిటళుళ్లు, జిల్లాకో మెడికల్ కాలేజీ, జిల్లాకో నర్సింగ్ కాలేజీ, జిల్లాకో పారా మెడికల్ కాలేజీ, వరంగల్‌లో హెల్త్ సిటీ నిర్మాణం,హైదరాబాద్ నగరానికి నలువైపులా టీమ్స్ హాస్పిటళ్లు, 4000 పడకల హాస్పిటల్‌గా నిమ్స్ విస్తరణ, సూపర్ స్పెషాలిటీ ఎంసిహెచ్ హాస్పిటల్ నిర్మాణం..ఇలా వైద్యయరంగాన్ని పటిష్ట పరిచామని హరీష్ రావు తెలిపారు. 119 నియోజక వర్గాల్లో నియోజకవర్గానికి ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని అన్నారు. అవయవ మార్పిడుల్లో దేశంలోనే తెలంగాణ భవిష్కరణలో ఉందని కేంద్రం ఇటీవలే చెప్పిందని, ముఖ్యంగా నిమ్స్ హాస్పిటల్లో ఆరు నెలల్లోనే 100 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు పూర్తయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది అందరికీ మంత్రి హరీష్ రావు అభినందనలు తెలిపారు. గాంధీ హాస్పిటల్ 8వ ఫ్లోర్లో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్లో ప్రతినెల సగటున 8 మందికి బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ ఉచితంగా చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో దేశ విదేశాల నుంచి వొచ్చి ప్రభుత్వ హాస్పిటల్లో అవయవ మార్పిడులు చేసుకునేలా మారబోతున్నాయని వివరాంచారు. ఔషధాల అందుబాటు, పంపిణీ పక్రియలో తెలంగాణ గతంలో మూడో స్థానంలో ఉండేదని, త్వరలో రెండో స్థానంలోకి చేరబోతున్నదని, కొత్తగా ఫార్మసిస్టులు చేరికతో మొదటి స్థానానికి చేరుకుంటుందని మంత్రి హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.
త్వరలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎయిర్ అంబులెన్సులు ప్రవేశపెట్టబోతున్నామని, రాష్ట్రంలో ఏ మూలన అత్యవసర పరిస్థితి ఏర్పడినా హెలికాప్టర్ ద్వారా వారిని దవాఖానకు తరలిస్తామని, కోటీశ్వరులకే పరిమితమైన ఈ సేవలను పేదలకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దని తెలిపారు.నిమ్స్‌లో ఈరోజు నుంచి వారం రోజులపాటు బ్రిటన్‌కు చెందిన వైద్యుల బృందం ఉచితంగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలియజేస్తూ ఈ సందర్భంగా బ్రిటన్ బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ అరుణ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉన్నంతకాలం తాము వైద్య ఆరోగ్య శాఖను మరింత ముందుకు తీసుకుపోతామని, పిహెచ్సి స్థాయి నుంచి అన్ని స్థాయి దవాఖానాల్లో ప్రగతి నివేదికను ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. తమ రిపోర్టును చూసే ప్రజలంతా ఆశీర్వదించాలని కోరుతూ.. అలా అయితే తాము ఉత్సాహంతో సేవలు అందిస్తామని మంత్రి హరీష్ హామీ ఇచ్చారు.



