ఆరోగ్య తెలంగాణయే లక్ష్యం

  • అందుకే మెడికల్‌ ‌కళాశాలలకు ప్రాధాన్యం
  • ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వివక్షతకు గురయ్యాం
  • ఎన్నో అవమాన పరిస్థితులు…అన్నింటినీ తట్టుకుని నిలబడ్డాం
  • ఒకేసారి 9 మెడికల్‌ ‌కళాశాలల ప్రారంభం..సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం
  • నేడు స్వరాష్ట్రంలో అభివృద్ధితో స్వేచ్ఛగా ఎగురుతున్నాం
  • మెడికల్‌ ‌కళాశాలలను వర్చువల్‌గా ప్రాంభించిన సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ఉమ్మడి రాష్ట్రంలో చాలాసార్లు వివక్షతకు గురయ్యామని, అందుకే ఆనాడు అభివృద్ధిలో వెనుకబడ్డామని కానీ స్వరాష్ట్రంలో అభివృద్ధిలో స్వేచ్ఛగా ఎగురుతున్నామని, ఒకే సారి 9 మెడికల్‌ ‌కాలేజీలు ప్రారంభించుకోవడం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. ప్రగతి భవన్‌ ‌నుంచి వర్చువల్‌ ‌విధానంలో 9 మెడికల్‌ ‌కాలేజీలను సీఎం కేసీఆర్‌ ‌ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ…‘ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటుంటాం. కానీ ఈ కార్యక్రమం చాలా ఆత్మసంతృప్తి కలిగే గొప్ప సన్నివేశం. ఎందుకంటే పరిపాలన చేతకాదు అని ఎగతాళి చేసిన పరిస్థితులను చూశాం. అటువంటి తెలంగాణలో ప్రతి జిల్లాకు మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. 2014లో 2850 మెడికల్‌ ‌సీట్లు ఉంటే 2023 నాటికి 8515 మెడికల్‌ ‌సీట్లు ఉన్నాయని కేసీఆర్‌ ‌తెలిపారు. ఈ సంవత్సరంలో దాదాపు 24 వరకు చేరుకున్నాం. గతంలో ఐదు మెడికల్‌ ‌కాలేజీలు ఉంటే.. ఇవాళ ఆ సంఖ్య 26కు చేరింది. వొచ్చే విద్యా సంవత్సరానికి 8 కాలేజీలు నూతనంగా ప్రాంరంభం కాబోతున్నాయి. వీటికి కేబినెట్‌ ఆమోదం కూడా లభించింది’ అని తెలిపారు.

తెల్ల రక్త కణాల మాదిరిగానే తెలంగాణ తెల్ల కోట్‌ ‌డాక్టర్లు పని చేస్తారని, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, రోగ నిరోధక శక్తి ఉండాలంటే.. తెల్ల రక్త కణాలు ఏ విధంగా పని చేస్తాయో..తెలంగాణ ఉత్పత్తి చేయబోయే తెల్ల కోట్‌ ‌డాక్టర్లు రాష్ట్రానికే కాదు..దేశ ఆరోగ్య వ్యవస్థను కూడా కాపాడుతారని కేసీఆర్‌ ‌వివరించారు. ఇందులో ఎవరికి సందేహం లేదని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పుడు 34 వేల పడకలకు చేరుకున్నామని, మరో 6 హాస్పిటల్స్ ‌నిర్మాణంలో ఉన్నాయని, వరంగల్‌లో అద్భుతమైన హాస్పిటల్‌ ‌నిర్మాణం జరుగుతుందని, హైదరాబాద్‌కు నలువైపులా గచ్చిబౌలి, ఎల్‌బీ నగర్‌, అల్వాల్‌, ఎ‌ర్రగడ్డలో 1000 పడకల చొప్పున హాస్పిటల్స్ ‌నిర్మిస్తున్నామని సిఎం కెసిఆర్‌ ‌తెలిపారు. నిమ్స్‌ను మరో 2 వేల పడకలతో విస్తరిస్తున్నామని, హాస్పిటళ్లలో పడకల సంఖ్య 50 వేలకు చేరుకోబోతుందని, ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖను అభినందిస్తున్నానని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా వైద్యశాఖ మంత్రి, కార్యదర్శిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. 85 శాతం మెడికల్‌ ‌సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కాలని పటిష్టంగా పోరాటం చేసి హైకోర్టులో విజయం సాధించామని, ఇది గొప్ప విజయమని కెసిఆర్‌ ‌తెలిపారు.

ప్రయివేటు, గవర్నమెంట్‌ ‌మెడికల్‌ ‌కాలేజీల ద్వారా సంవత్సరానికి 10 వేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేయబోతున్నామని సిఎం పేర్కొన్నారు. కొరోనా టె•మ్‌లో ఆక్సిజన్‌ ‌చాలా అవసరం ఉండెనని, దాన్ని గుణపాఠంగా తీసుకొని ఈరోజు వైద్యారోగ్య శాఖ మంత్రి నేతృత్వంలో 500 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసుకుంటున్నామని తెలిపారు. విద్యుత్‌ ‌రంగంతో పాటు సాగు, తాగునీటి రంగంలో అద్భుతాలు సాధించామని, నేడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగామన్నారు. గంజి కేంద్రాలతో విలసిల్లిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు వ్యవసాయం పరుగులు పెట్టిందని, పాలమూరు ప్రాజెక్టును కూడా ప్రారంభించుకోబోతున్నామని కెసిఆర్‌ అన్నారు. ఒక్క కాలేజీ లేని పాలమూరులో ఐదు మెడికల్‌ ‌కాలేజీలు వొచ్చాయని, ఇది గొప్ప విజయంమని సెం అన్నారు. నల్లగొండలో మూడు కాలేజీలు వొచ్చాయని, మారుమూల జిల్లాలైన ఆసిఫాబాద్‌, ‌ములుగు, భూపాలపల్లి జిల్లాలు..అలా అడవి బిడ్డలు నివసించే ప్రాంతాల్లో కూడా మెడికల్‌ ‌కాలేజీలు స్థాపించుకుని అద్భుతాలు సృష్టించబోతున్నామని కేసీఆర్‌ ‌తెలిపారు.

ఒక దేశం కావొచ్చు..రాష్ట్రం కావొచ్చు..ఎక్కడైతే వైద్యారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో..అక్కడ మరణాలు, నష్టాలు తక్కువగా సంభవిస్తాయని కేసీఆర్‌ ‌తెలిపారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మెడికల్‌ ‌కాలేజీలతో పాటు అద్భుతమైన హాస్పిటళ్లను కూడా తీసుకువస్తున్నామని, వందలాది బెడ్స్‌తో మెడికల్‌ ‌ఫెసిలిటీ వొస్తుందని, వైద్యారోగ్య శాఖ చాలా విజయాలు సాధించిందని కెసిఆర్‌ ఈ ‌సందర్భంగా అభినందించారు. దేశంలో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్‌ ‌సీట్లు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని, ఇది మన సాధించిన ఘనత అని తెలిపారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 17 వేల పడకలు ఉంటే.. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు మౌలిక సదుపాయాలు కల్పించుకున్నామని, 50 వేల పడకలను ఆక్సిజన్‌ ‌బెడ్స్‌గా తీర్చిదిద్దుకుంటున్నామని, 10 వేల సూపర్‌ ‌స్పెషాలిటీ బెడ్స్ ‌కూడా అందుబాటులోకి వొస్తున్నాయన్నారు. పారా మెడికల్‌ ‌సిబ్బందికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌ ఉం‌దని, మెడికల్‌ ‌కాలేజీలకు అనుబంధంగా..ప్రతి జిల్లాలో నర్సింగ్‌ ‌కాలేజీలు, పారా మెడికల్‌ ‌కోర్సులు పెట్టాలని చెప్పామని, అందుకు చర్యలు తీసుకుంటున్నారని సీఎం తెలిపారు.

ఒకే రోజు తొమ్మిది మెడికల్‌ ‌కాలేజీల ప్రారంభం…తెలంగాణ వేదికగా సరికొత్త రికార్డు
దేశ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా శుక్రవారం సరికొత్త రికార్డు నమోదైంది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యాయి. కామారెడ్డి, కరీంనగర్‌, ‌ఖమ్మం, జయశంకర్‌ ‌భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ‌నిర్మల్‌, ‌రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, ‌జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్‌ ‌కాలేజీల తరగతులను సీఎం కేసీఆర్‌ ‌వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు,వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటుతో జిల్లాకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఇటీవల మంత్రులు కేటీఆర్‌, ‌హరీశ్‌రావు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. కనీసం 15-20 వేల మందితో జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున యువతను, విద్యార్థులను భాగస్వాములను చేశారు. మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటుతో విద్యార్థులకే కాకుండా దానికి అనుబంధంగా అందుబాటులోకి వొచ్చే దవాఖానతో ప్రజలకు ఎలాంటి అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతాయో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *