ఆదిలాబాద్ , ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : రాంజీ గోండు, కొమరం భీమ్ పోరాటాలతో స్ఫూర్తి పొందిన గడ్డ ఈ ఆదిలాబాద్ గడ్డ.. గిరిజన బిడ్డలుగా వారి వారసులుగా ఆదిలాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరావేద్దాం అని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ లో జరిగిన బీజేపీ జనగర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాబోతున్న వేళ ఫామ్ హౌస్ లో ఉన్న కెసిఆర్ కుటుంబానికి, దారుస్సలామ్ లో ఉన్నఎం.ఐ.ఎం రజాకార్ల వారసులకు, ఒవైసీ కుటుంబానికి మన నినాదాలు వినపడాలి అంటూ ప్రజలతో నినాదాలతో హోరేత్తించారు.
రజాకార్లను పారద్రోలి త్రివర్ణ పతాకం ఎగురవేసిన రోజున సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవాలను అమిత్ షా ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించుకున్నాం. నిజాం అభినవ సర్దార్ పటేల్ గా అమిత్ షా నేతృత్వంలో తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా జరుపుకున్నాం. తెలంగాణ గడ్డపై ఎన్నికల షెడ్యూల్ ప్రకటన జరిగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత మొట్టమొదటి సభ ఆదిలాబాద్ వేదికగా జరుపుకుంటున్నాం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.





