- పరీక్షలే జీవితం కాదని గుర్తించండి
- ఇంటర్ ఫెయిల్ విద్యార్థులకు పిసిసి చీఫ్ రేవంత్ విజ్ఞప్తి
- ఫీజులు మినహాయించాలని ప్రభుత్వానికి సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29 : ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల తర్వాత విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆందోళనవ్యక్తం చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం చూస్తుంటే తన గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితం విలువ తెలుసుకుని.. ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. పరీక్షల కంటే ప్రాణాలు ముఖ్యమని హితవు పలికారు. ఇంటర్మీడియట్ ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఒకేరోజు ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని వాపోయారు. వారి తల్లిదండ్రుల పరిస్థితి చూస్తుంటే తన గుండె బరువెక్కుతుందని అన్నారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినా.. మళ్లీ సప్లిమెంటరీ రాసుకోవచ్చని.. విద్యార్థులెవరూ అధైర్యపడొద్దని రేవంత్ సూచించారు.
పరీక్షలకన్నా..చదువుకన్నా.. ప్రాణాలు విలువైనవని..తల్లిదండ్రులు విలువైన వారని చెప్పారు. వారి కోసమైనా తమ భవిష్యత్‌ను అర్దాంతరంగా ముగించుకోవద్దని అన్నారు. మరోవైపు సప్లిమెంటరీ, రీవాల్యూయేషన్, రీకౌంటింగ్ రుసుములను మాఫీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రేవంత్ కోరారు. ట్విటర్లో ఈ మేరకు ట్వీట్ చేస్తూ వారిని ట్యాగ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్ కోసమైనా తెలంగాణ సర్కార్ వీలైనంత త్వరగా చర్యలకు ఉపక్రమించాలని కోరారు. ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోవద్దని ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆయన విజ్ఞప్తి చేశారు.



