- అత్యధికంగా నారాయణ్ పేట్లో 89..అతి తక్కువగా మంచిర్యాలలో 63 శాతం
- వైద్యారోగ్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు
- ఆశా, ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్లతో నెలవారీ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : ఆగస్ట్ నెలలో ప్రభుత్వ హాస్పిటల్స్లో 76.3 శాతం డెలివరీలు జరగటం గొప్ప విషయమని, చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో వైద్యారోగ్య శాఖ చేస్తున్న కృషి వల్ల 2014లో 30 శాతంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ డెలివరీలు, రెట్టింపు కంటే ఎక్కువ జరుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్స్పై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనం అన్నారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన వైద్యారోగ్య శాఖ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అత్యధికంగా నారాయణ్ పేట్ 89 శాతం, ములుగు 87శాతం, మెదక్ 86, భదాద్రి కొత్తగూడెం 84శాతం, వికారాబాద్ 83, గద్వాల్ 85శాతం డెలివరీలు చేసి మంచి పనితీరు కనబర్చాయని అభినందించారు. అతి తక్కువగా ప్రభుత్వ హాస్పిటల్స్ డెలివరీలు అవుతున్న మంచిర్యాల(63), నిర్మల్(66), మేడ్చల్, కరీంనగర్(67) జిల్లాల్లో పనితీరు మెరుగుపడాలన్నారు.
ఓవరాల్ పర్ఫార్మెన్స్ స్కోర్ విషయంలో మొదటి స్థానాల్లో నిలిచిన మెదక్(84.4), జోగులాంబ గద్వాల్(83.9), వికారాబాద్ (81), ములుగు(79), నాగర్ కర్నూల్(77) జిల్లాల వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. చివరి స్థానంలో ఉన్న జగిత్యాల, కుమ్రంభీమ్, నారాయణ్ పేట్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలు పనితీరు మెరుగుపర్చుకోవాలని ఆదేశించారు. ఆశాలు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లతో వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు మంగళవారం నెలవారీ సమీక్ష టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ రావు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, పోగ్రామ్ ఆఫీసర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో ఉంటూ ప్రాథమిక స్థాయి వైద్యం అందిస్తూ, ప్రజలను రోగాల భారి నుంచి కాపాడటంలో పీహెచ్సి మెడికల్ ఆఫీసర్లు, ఆశాలు, ఏఎన్ఎంలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.
రోగాన్ని ముందుగా గుర్తించి, చికిత్స అందించడం ద్వారా దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా ప్రజలను కాపాడుతున్నట్లు చెప్పారు. గర్బిణులను కంటికి రెప్పలా కాపాడుతూ, రూపాయి ఖర్చు భారం వారిపై పడకుండా ప్రభుత్వ హాస్పిటల్స్లో డెలివరీలు జరిగేందుకు ఆశాలు, ఏఎన్ఎంలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆశా, ఏఎన్ఎంల సేవలు గుర్తించిన సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక వేతనాలును అందిస్తున్నట్లు తెలిపారు. ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించేలా సపోర్టు చేస్తున్నారన్నారు. మాతా శిశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య లక్ష్మీ, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్స్, అమ్మఒడి వాహనాల సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఏ ఒక్క గర్బిణి కూడా పరీక్షల కోసం ప్రైవేటుకు వెళ్లొద్దనే ఉద్దేశ్యంతో టిఫా సహా అన్ని రకాల పరీక్షలను ప్రభుత్వ హాస్పిటల్స్లో అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. దీర్ఘకాలిక రోగాలు, ఇతర క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో ఉన్న గర్భిణులు గాంధీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ సేవలు పొందేలా చూడాలన్నారు. వందశాతం ఇమ్యునైజేషన్ జరిగేలా చూడాలన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా అన్ని రకాల పరీక్షలు ప్రజలకు అందేలా చూడాలన్నారు.




