రాజీనామాకు సిద్ధమా…లేకుంటే ముక్కు నేలకు రాస్తావా..
సిద్ధిపేటకు మేమేం చేయలేదో చెప్పాలి..
నాడు మెదక్ అభివృద్ధి అన్నావు…నేడు సిద్ధిపేట అభివృద్ధి జరుగలేదంటున్నావు..ఏది నిజం
రాష్ట్ర ఆదాయం పడిపోయింది అకాంగ్రెస్, బిజెపి మధ్య చీకటి ఒప్పందం
మీడియా సమావేశంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, మే 3 : ఆగస్టు 15న సిద్దిపేటకు వొస్నానన్న రేవంత్ రెడ్డి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, కానీ తన సవాల్‌ను ఆయ్డ స్వీకరిస్తలేడని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఏ హరీష్ రావు అన్నారు. విలువలతో కూడిన రాజకీయం తనకు అలవాటని, వంద రోజులులో ఆరు గ్యారంటీలు రెండు లక్షల రుణమాఫి చేస్తే తన రాజీనామా ఆమోదింప చేసుకుని ఆయనకు శాలువా కప్పుతానన్నారు. వ్యక్తిగా కంటే కోట్లాది ప్రజలకు న్యాయం జరగడమే తాను కోరుకునేదన్నారు. రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ బౌన్స్ అయిందని, రేవంత్ రెడ్డి రాజీనామాకి సిద్ధమా లేకుంటే కొడంగల్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తావా అంటూ హరీష్ సవాల్ విసిరారు. వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తే తాను స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానన్నారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా కేంద్రం భారత్ నగర్‌లోని తన నివాసంలో హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ…సీఎం రేవంత్ రెడ్డి గురువారం సిద్ధిపేటలో చేసిన వ్యాఖ్యలు అసంబద్దమైనవని, ఆయనకు దేవుడు శాపాలు పెట్టినందున ఎప్పుడూ నిజాలు మాట్లాడడని విమర్శించారు. సిద్ధిపేట అభివృద్ధిని రేవంత్ రెడ్డి కండ్లు ఉండి చూడలేక పోతున్నాడని, అభివృద్ధిలో సిద్ధిపేట ఎన్నో జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిందన్నారు. సిద్ధిపేట పేరు లేకుండా అవార్డులు రాలేదని, సిద్ధిపేటకు తాము ఎం చేయలేదో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. సిద్ధిపేటకు మెడికల్ కళాశాల, పోలీస్ కమిషనర్ కార్యాలయం, ఐటీ హబ్, రైతు బజార్వంటివి ఎన్నో తెచ్చామని, అన్నింటికి మించి తెలంగాణ తెచ్చామన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే సిద్దిపేట పుణ్యమేనని, తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు మోచేతి నీళ్లు త్రాగేవాడని అన్నారు. నిన్నటి వరకు మెదక్ అభివృద్ధి జరిగిందని మాట్లాడిరది నిజమా..లేక నేడు సిద్ధిపేట అభివృద్ధి జరగలేదనేది నిజమా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. ఒకరేమో దేవుణ్ణి చూపించి వోట్లు అడుగుతారని, మరొకరేమో దేవుని మీద ఒట్లు పెట్టీ వోట్లు అడుగుతారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలనుద్దేశించి హరీష్ రావు విమర్శించారు. వారి పిచ్చి ప్రయత్నం వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేల్ అయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చాక భూమి కొనేవారు లేకుండా పోయారని, రాష్ట్రం దివాలా తీసిందని లేని అప్పులు చూపెడుతున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు.
నేడు రాష్ట్ర ఆదాయం పడిపోయింది..
ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగాలు రాకుండా పోయాయని, రియల్ ఎస్టేట్ పడిపోయిందని, గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడని హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట అభివృద్ధి ప్రజల ముందు కనబడుతున్నదని, అయినా సిగ్గు లేకుండా మాట్లాడకు రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేసీఆర్ హయాంలో 24 గంటల కరెంటు ఉందని, కేసీఆర్ బస్ యాత్ర సుపర్ హిట్ కావడంతో కాంగ్రెస్ బీజేపి పార్టీలు నయా నాటకాలు ఆడుతున్నారని, ఆ రెండు పార్టీలు బీఆర్ఎస్ను లేకుండా చేయాలని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి బలంగా ఉన్న చోట బీజేపీ డమ్మీ అభ్యర్థిని, బీజేపి అభ్యర్థి బలంగా ఉన్న చోట కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పెట్టాయన్నారు.
కాంగ్రెస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం..
రేవంత్ పాలన 5 నెలల్లోనే రివర్స్ గేర్‌లో నడుస్తుందనీ, కరెంట్ కోతలు వొచ్చాయని, కల్యాణ లక్ష్మి చెక్కులు అగాయని, కొత్తవి ఇస్తలేరు..కానీ పాత పథకాలు ఆపుతున్నారని హరీష్ రావు విమర్శించారు. రైతు బంధు ఇవ్వకపోవడంతో రైతులు వడ్డీలకు అప్పు తీసుకుని పంటలు వేసుకున్నారన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవంకు నిలువెత్తు నిదర్శనం కెసిఆర్ అయితే..రేవంత్ రెడ్డి దిల్లీకి గులాంగిరి చేస్తున్నాడన్నారు. రిజర్వేషన్లు పోతాయని రేవంత్ రెడ్డి కొత్త నాటకం ఆడుతున్నాడని, మరో వైపు హిందువుల ఆస్తులు పోతాయని మోదీ అంటున్నాడని, హిందువుల ఆస్తులు ముట్టుకుంటే ఈ ప్రజలు ఊరుకోరనీ, ప్రజలను సెంటిమెంటల్‌గా రెచ్చగొట్టి కాంగ్రెస్ బీజేపి వోట్లు అడుగుతున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోదీ అంటున్నారని, అది నిజమైతే ఈడి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో రేవంత్ రెడ్డి మాటల్లో అంత నిజం ఉంటదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇచ్చిన సిద్దిపేట వెటర్నరీ కాలేజ్శ్రీతీ రేవంత్ రెడ్డి గద్ద లాగా కొడంగల్‌కి లాక్కుని పోయాడని, సిద్ధిపేట జిల్లాను రద్దు చేసే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఆరోపించారు.
జిల్లాను తీసి అభివృద్ధిని ఆపుతావా రేవంత్ అంటూ ప్రశ్నించారు. జిల్లాను తీస్తా అన్న రేవంత్‌కి ప్రజలు వోటుతో సమాధానం చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.





