ఆకాశాన్నంటిన కెసిఆర్‌ ‌జన్మదిన సంబురాలు

రాష్ట్ర రాజధాని మొదలు మారుమూల గ్రామాలు సైతం శుక్రవారం  రాష్ట్ర ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాయి. తెలంగాణ ఏర్పడిన ఈ ఎనిమిదేళ్ళలో ఇంత పెద్ద స్థాయిలో కెసిఆర్‌ ‌పుట్టినరోజు వేడుకలు చేయలేదు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీని బిఆర్‌ఎస్‌గా పేరు మార్చడంతో పాటు జాతీయ పార్టీగా రూపొందించిన తర్వాత వొచ్చిన బర్త్‌డే కావడం వల్ల ఆ పార్టీ శ్రేణులు, ఇప్పుడిప్పుడే  వివిధ రాష్ట్రాల్లో  వేళ్ళూనుకుంటున్న ఆ  పార్టీ నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ పార్టీలు, సంస్థలకు చెందినవారు కూడా కెసిఆర్‌ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని తమ శుభాకాంక్షలను  అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదలు ప్రధాని నరేంద్రమోదీ ఇతర నాయకులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఫోన్‌ల ద్వారా, ప్రకటనల ద్వారా తెలియజేశారు.

సోషల్‌ ‌మీడియా అంతా కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలిపేవారి మెస్సేజ్‌‌తో నిండిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో బిఆర్‌ఎస్‌పై ఆగ్రహంగా ఉన్న బిజెపి నాయకులుకూడా కెసిఆర్‌కు తమ శుభాకాంక్షలు తెలపడం విశేషం. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీలాంటి వారు శుభాకాంక్షలు  అందజేసిన నేపథ్యంలో రాజకీయాలను పక్కకు పెట్టి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌, ‌రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళి సై శుభాకాంక్షలు తెలిపినవారిలో ఉన్నారు. ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అదినాయకుడు పవన్‌ ‌కళ్యాణ్‌, అసోం ముఖ్యమంత్రి హేమంత్‌ ‌బిశ్వశర్మ , తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, ‌దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌, ‌సినీ ప్రముఖులు, వివిధ పార్టీలనాయకులు, అభిమాన సంఘాలు, సంస్థలు  తమ సందేశాల్లో  కెసిఆర్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

తెలంగాణ ఉద్యమకాలంలో ఎలాగైతే వివిధ• రీతుల్లో తమ ఆకాంక్షను తెలియజేశారో, ఇవ్వాళ  పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అమితోత్సాహంగా భారీ స్థాయిలో వింత రీతుల్లో  తమ ప్రియతమ నాయకుడు కెసిఆర్‌ ‌జన్మదిన వేడుకలను నిర్వహించారు..ఇంకా నిర్వహిస్తున్నారు కూడా. బాణాసంచాలను కాల్చడం, రక్తదాన శిబిరాలను నిర్వహించడం, పాదయాత్రలు జరుపడం, క్రికెట్‌ ‌పోటీలు, పెద్ద పెద్ద బెలూన్లపైన దేశ్‌ ‌కీ నేత కెసిఆర్‌ అం‌టూ రాసి ప్రదర్శించడం,  వికలాంగులకు పుస్తకాలను పంపిణీ చేయడం, పేదలకు, హాస్పిటల్స్‌లో రోగులకు పండ్లు పంచిపెట్టడంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలతో రాష్ట్రమంతా  మారుమోగింది. అభిమానుల పూజలు, హోమాలతో వివిధ ఆలయాలు సందడిగా మారాయి. ఏ నాయకుడికైనా అభిమానులు, కార్యకర్తలు ఆతని జన్మదినంరోజున మాత్రమే వేడుకగా జరుపుకోవడమన్నది ఆనవాయితీ. కాని, కెసిఆర్‌ ‌జన్మదినాన్ని తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల నాలుగు నుండి అయిదు రోజులపాటు నిర్వహించడం కొత్త ట్రెండ్‌గా కనిపిస్తున్నది.

తెలంగాణ ఉద్యమ సమయంలో తరుచూ గ్లూకోస్‌ను అందించిన జిల్లాగా పేరున్న వరంగల్‌లో ఆయన అభిమానులు వరుసగా నాలుగు రోజులపాటు నిర్వహిస్తున్న ఉత్సవాలను ఒక రోజు ముందు నుండే  భారీ ఏర్పాట్లతో ప్రారంభించారు. ఆజంజాహిమిల్లు గ్రౌండ్‌లో భారీ సెట్టింగ్స్‌తో వివిధ కార్యక్రమాలతో అంబరాన్నంటే సంబరాలకు శ్రీకారం చుట్టారు. సిద్ధిపేటలో రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు సిఎం కేసీఆర్‌ ‌సైకత శిల్పం ఏర్పాటు చేసి  సెల్ఫీతో తన అభిమానాన్ని చాటుతూ శుభాకాంక్షలు తెలియ జేసారు. కెసిఆర్‌ ‌సొంత• నియోజకవర్గమైన గజ్వెల్‌లో పద్దెనిమిది అడుగుల భారీ చిత్రాన్ని ఆవాలతో రూపొందించడం ద్వారా కెసిఆర్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వనపర్తిలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో  స్థానిక రైతులు పల్లీలు, ఉలవలతో కెసిఆర్‌ ‌చిత్రపటాన్ని వేసి తమ అందరినీ ఆశ్చర్యపర్చారు. వికలాంగుల కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌వాసుదేవరెడ్డి కెసిఆర్‌ ‌జీవిత చరిత్రను బ్రేయిలీ లిపిలో రాయించి, దాన్ని  పుస్తక రూపంలో తీసుకురావడం హర్షించదగిన విషయం.

ప్రత్యేకంగా అంధ విద్యార్థుల కోసం తయారు చేసిన ఇలాంటి పుస్తకం బహుషా దేశంలోనే ఇదే మొదటిదై  ఉంటుంది. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఎంఎల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే భారత జాగృతి పక్షాన హైదరాబాద్‌  ఎల్‌బీ స్టేడియంలో  కెసిఆర్‌ ‌కప్‌ – 2023 ‌వాలీబాల్‌ ‌టోర్నమెంట్‌ ‌ఫైనల్‌ ‌మ్యాచ్‌ ‌సందర్భంగా అర్ధరాత్రి కవిత కేక్‌ ‌కట్‌చేశారు. మంత్రి మల్లారెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ‌కీసరలో ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అమెరికాలో స్కై డైవర్‌ ‌సంతోష్‌ ‌పారాచూట్‌ ‌సహాయంతో గగన వీధుల్లో తేలియాడుతూ కెసిఆర్‌కు బర్త్‌డే విషెస్‌ ‌చెప్పడం మరో వింత పరిణామం. అయితే సిద్ధిపేట జిల్లా రంగనాయక సాగర్‌లో కూడా బిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర నాయకుడు అరవింద్‌ అలిశేట్టి వినూతనంగా పారా గ్లైడర్‌పై హ్యాపీ బర్త్‌డే సిఎం, అబ్‌ ‌కీ బాత్‌ ‌కిసాన్‌ ‌సర్కార్‌ ‌నినాదాలు రాసి గగన విహారం చేశాడు.

ఇదిలాఉంటే ఏ సమాచారాన్ని అయినా క్షణాల్లో చెప్పడంతోపాటు, ప్రస్తుతం ఉన్న పరిస్తితుల ఆధారంగా అనాలసిస్‌ ‌చేసి అభిప్రాయాన్ని చెప్పే విషయంలో ఇటీవల ఛాట్‌ ‌జీపీటి బాగా పాపులర్‌ అయింది. సిఎం కేసిఆర్‌ ‌బర్త్‌డేను పురస్కరించుకుని ఛాట్‌ ‌జీపీటి ఒక వ్యాసం రాయడం కూడా మరో వింత వేడుక. కెసిఆర్‌ ‌పుట్టుపూర్వోత్తరాలు, రాజకీయ నేపథ్యం, తెలంగాణ ఉద్యమం తీరు అన్నిటినీ అది వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో వాడవాడలా బాణాసంచాల చప్పుళ్ళతోపాటు సీట్లు పంచిపెడుతూ తమ అభిమాన నాయకుడికి హార్దిక శుభాకాంక్షలను తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *