ఆం‌దోళన వద్దు…అప్రమత్తంగా ఉందాం..

  • ప్రపంచంలో కొరోనా వ్యాప్తి తీరును గమనిస్తున్నాం
  • వైద్య ఆరోగ్యశాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది
  • కొరోనా పరిస్థితులపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌కొరోనా పట్ల ఆందోళన చెందవద్దని, అయితే అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, కోవిడ్‌ ‌టీకా తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని, బూస్టర్‌ ‌డోసు వేసుకోవాలని సూచించారు. చైనా సహా పలు దేశాల్లో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలు అనుసరించి, కోవిడ్‌ ‌సన్నద్ధతపై ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు గురువారం ఉన్నత స్థాయి సమీక్ష జూమ్‌ ‌ద్వారా నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో కొరోనా ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌బి.ఎఫ్‌ 7 ‌వ్యాప్తి, ప్రభావం గురించి అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం ఆరోగ్య శాఖ కోవిడ్‌ ‌సన్నద్ధతపై మంత్రి సమీక్షించారు. ప్రభుత్వం కోవిడ్‌ ‌నియంత్రణకు సర్వం సంసిద్ధంగా ఉందని ప్రజలు ఎటువంటి భయాందోనళకు గురి కావద్దని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి దిశా నిర్ధేశంతో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కొరోనాను విజయవంతంగా ఎదుర్కుని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిందన్నారు. కొరోనా వ్యాప్తి మన వద్ద లేనప్పటికీ, ముందు జాగ్రత్తగా అన్ని చెక్‌ ‌చేసుకోవాలని వైద్యాధికారులకు మంత్రి ఆదేశించారు.

మానవ వనరులు, మందులు, ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు అన్ని కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పాజిటివ్‌ ‌వొచ్చిన శాంపిల్స్‌ని జీనోమ్‌ ‌సీక్వెన్స్ ‌కోసం గాంధీ హాస్పిటల్‌కి పంపాలని, ఎయిర్‌ ‌పోర్టులో స్క్రీనింగ్‌ ‌నిర్వహించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్‌ ‌శ్వేతా మహంతి, డైరెక్టర్‌ ఆఫ్‌ ‌పబ్లిక్‌ ‌హెల్త్ ‌జి శ్రీనివాసరావు, డైరెక్టర్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ‌రమేష్‌ ‌రెడ్డి, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి చైర్మన్‌ ఎ‌ర్రోళ్ల శ్రీనివాస్‌, ఎం‌డి చంద్రశేఖర్‌ ‌రెడ్డి, టీవీవిపి కమిషనర్‌ అజయ్‌ ‌కుమార్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *