నేడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్థంతి
అలిశెట్టి అనగానే అందరికి ఎక్కువగా గుర్తుకు వచ్చే కవితలు ‘సిటీ లైఫ్’. వీటిని ఎందుకు రాసాడో అతని మాటల్లో ’’ధ్వంసమైపోతున్న సమస్త మానవ విలువల్నీ, హింసా రాజకీయాల్ని నిరసించడంతో పాటు నిప్పు కణికల్లాంటి, కన్నీటి గుళికలు ప్రతిరోజు ఆంధ్రజ్యోతి పాఠకులకు అందించే చిన్న చిన్న కవితలు’’ అని ముందుమాటలో చెప్పుకున్నాడు.
విప్లవాల పురిటిగడ్డ జగిత్యాలలో 1954 జనవరి 12 న అక్షర సూరీడు అలిశెట్టి తనకు తెలియని ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోతే పెద్ద కుటుంబ భారాన్ని మోస్తూ, జీవనోపాధికి జగిత్యాలలో పూర్ణిమ ఫోటో స్టూడియో ప్రారంభించాడు. పెన్సిల్ తో గీతలు గీయడం అబ్బిన కళను, స్నేహితుల కవితలకు సరిపోయే చిత్రాలుగా మలిచాడు.
ఆ ప్రక్రియనే అయన జీవితాన్ని మలుపు తిప్పి స్వయంగా కవితలు రాయడం, వాటికి అనుగుణంగా బొమ్మలు వేయడం అభ్యాసంగా మారింది.1975లో పరిష్కారం పేరుతో అలిశెట్టి రాసిన కవిత తొలిసారి ఆంధ్ర సచిత్రవారపత్రికలో ప్రచురితం అయింది. విప్లవ చరిత్రలో మైలు రాయిగా ఉన్న 1978 జగిత్యాల జైత్రయాత్ర ప్రభాకర్ హృద యాంత రాలలో నిక్షిప్తం అయి ఉన్న కవితావేశాన్ని తట్టి లేపి, దిశా నిర్దేశం చేసింది. ఇక ఆయన వెను తిరిగి చూసుకోలేదు. అక్షరాలతోనే సమర శంఖాన్ని పూరించి, చిన్న చిన్న పదాలతో అద్భుత విన్యాసాలు చేయిస్తూ, అన్ని సామాజిక రుగ్మతలను స్పృశిస్తూ, తెలుగు వచన కవితా ఉద్యమ కొత్త బాటకు మార్గ నిర్దేశం చేశాడు.
ప్రభుత్వాలు, పోలీసులు, భూస్వాముల తో వెగలేక, కరీంనగర్ కు తరలి వెళ్ళి, శిల్పి స్టూడియో నిర్వహించాడు.
1982లో భార్య,ఇద్దరు పిల్లలతో కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు మకాం మార్చాడు. అక్కడే స్థిరపడ్డారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియల్‌గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై మినీ కవిత్వం రాశాడు. హైదరాబాదీలు మాట్లాడే మాటల్నే వాడుతూ కవితలుగా ఎక్కుపెట్టాడు. ఆరుసంవత్సరాల పాటు సిటీలైఫ్ కాలమ్ లో రాశాడు..
అలిశెట్టి ప్రభాకర్ అనేది నిజానికి వ్యక్తి పేరు కాదు. అగ్ని జ్వాలా మయమైన కవితా శక్తి పేరు. …ఉప్పొంగే భావావేశానికి మామూలుగా కవులు అక్షరాలను అద్దితే, అలిశెట్టి కవితకు తన చెమటను, ఆపై రక్తాన్ని అద్దాడు. ఊపిరిని ఫణంగా పెట్టి అక్షరానికి ప్రాణ ప్రతిష్ట చేశాడు. సామాజిక సమస్యలపై కలంతో పోరాడి, తన పోరాట మాధ్యమం కవిత్వమే అని భావించి, కెమెరా కన్ను…కుంచె గన్ను…కవాతు పెన్నుల ఏకీకరణతో, కవిత కోసమే బతికాడు. కవిత కోసమే ప్రాణాలిచ్చాడు.
తను శవమై../ఒకరికి వశమై…/తనువు పుండై…/ఒకడికి పండై../ఎప్పుడూ ఎడారై…/ఎందరికో ఒయాసిస్సై..’లో ఉన్నవి మొత్తం పన్నెండు పదాలే. సెక్స్ వర్కర్ల దయనీయ స్థితి గురించి రాసిన అలిశెట్టి కవిత అల్ప పదాలలో అనల్ప భావాలను అద్దుకుని, సుప్రసిద్దమైనది. వేశ్యల గురించి ప్రస్తావన వచ్చిన అనేక సందర్భాలలో అనేక మందిచే ఉదహరింపబడిన కవిత.
హృదయ త్రాసు కవిత ఆయనకు కవిగా మంచి పేరు తెచ్చినదే. ఉదహరింపు కవితలో … ప్రతిభలేకపోతే జీవితం వ్యర్థం అని, సాధన చేస్తేనే బండ శిల్పంగా మారుతుందని, కాలానికి వదిలేయకుండా ప్రయత్నం చేయాలని, చిన్న కవితలో ఎంతో అందంగా చెప్పాడు ప్రభాకర్.
అలిశెట్టి కవిత ‘రక్తరేఖ’లో …
‘‘నువ్వు ఉరిమి చూసినప్పుడు
ఊరంతా పాలేర్లే
వాళ్ళే
ఊరినించి తరిమికొడితే
నీ బ్రతుకంతా పల్లేర్లే’’
అంటూ భూస్వాములను హెచ్చరించడం,
అలాగే..‘‘పుస్తకం లోంచి దులిపేసిన అక్షరాల్లా లక్షకి లక్షలు దేశమంతా నిరుద్యోగుల్కె నిండుకున్నారు’’ అంటూ నిరుద్యోగం గురించి, తన కవిత్వంలో ముక్కు సూటిగా, పదునుగా, ఘాటుగా, విమర్శించిన భావావేశపు తీరు తెలుగులో%“%కవిత్వంలో బహు అరుదు.
‘‘‘జలగాలు’ ‘బ్రహ్మ’జెముళ్ళూ
అవకాశవాది ‘రూలుకర్రా’
‘ఆరణాల కూలీ’
‘పునాది’లేని ‘భవనం’ నాచారం ‘సన్యాసులూ ’
అంతర్గత కలహాలు, తరుచూ సీఎంల మార్పులు…
ముఖ్యమంత్రులు ఎవరైనా, అక్షరాలా అరాచకంలో మార్పుండదు’’ అని చెపుతూ, కాసు, జలగం, అంజయ్య, భవనం, చెన్నారెడ్డి, ఎన్టీఆర్, నాదెండ్ల ఇలా ఆనాటి ముఖ్యమంత్రుల తీరు పైనా పెన్నును గురి పెట్టాడు.1978లో ప్రకటించిన తొలి కవితా సంకనం ‘ఎర్రపావురాలు’ లో
‘‘నా గుప్పిట్లో /మండుతున్న
ఎన్నో గుండెలు / ఒక్కొక్కదాన్లో
దూరి, వాటిని చీరి, రక్తాశ్రువులు ఏరి
పరిశీలిస్తాను నేను’’ అన్నాడు.
ఒకవైపు కటిక దారిద్య్రం, వేగంగా తనవైపు లాగుతున్న క్షయ రూప మృత్యువు, పభుత్వం సొమ్ము ముట్టననే భీష్మ ప్రతిజ్ఞ కారణంగా, ప్రభుత్వ దావాఖానా మందులు కూడా ముట్టని మొండితనం, వెరసి ఫణంగా పెట్టిన జీవితంలో అలిశెట్టి ఓడిపోయాడు. మృత్యువుకు లొంగి పోయాడు. మరణం నా చివరి చరణం కాదని ప్రకటించిన ప్రభాకర్.. కబళించే మృత్యువును ముందే గుర్తించాడు. తెర వెనక లీలగా మృత్యువు కదలాడినట్టు. తెరలు తెరలుగా దగ్గొస్తుంది..తెగిన తీగెలు సవరించడాని కన్నట్టు గబగబా పరిగెత్తుకొచ్చి నా భాగ్యం గ్లాసెడు నీళ్లందిస్తుందని పర్సనల్ పోయెం అనే కవితలో రాసుకున్నాడు. మృత్యువు తన చేతుల్లోకి తీసుకొన్న రోజు కూడా అక్షరాలకు జీవం పోస్తూ, అలిశెట్టి 1993 జనవరి 12న హైదరాబాద్ లో నిర్జీవుడు అయినాడు. సమాజ మార్పుని ఆకాంక్షిస్తూ పేదరికానికి బలైన కవి. ’మరణం నా చివరి చరణం’ కాదని, సమరమే తన అంతిమ చిరునామా అని ప్రకటించాడు. అందుకేనేమో ఈ అరుదైన కవి అలిశెట్టి పుట్టిన, గిట్టిన తేదీలు ఒకటే అయి, మళ్లీ మళ్లీ పుడుతూ సమాజ పరిస్థితులపై తాను రాసిన కవితల ద్వారా సమరం సాగిస్తూనే ఉన్నాడు.మరణానంతరం కూడా అలిశెట్టి ఆశించినట్లు, అయన భౌతికంగా వదిలి వెళ్ళిన కళాక్షరాలు ఆయనను సజీవంగా ఉంచుతున్నాయి. ఎందరికో మార్గ దర్శనం చేస్తూ, అలిశెట్టి ప్రభాకర్ ఆశయాలకు రూపాలుగా సాగుతూనే ఉన్నాయి. అందుకే అలిశెట్టి మరణం ఆయన చివరి చరణం కాదు.
-రామకిష్టయ్య సంగనభట్ల





