- మణిపూర్ అంశంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం
- కాంగ్రెస్ చెప్పుచేతల్లో బిఆర్‌ఎస్ : బిజెపి ఎంపి లక్ష్మణ్
న్యూ దిల్లీ, జూలై 25 : లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్న ఇండియా కూటమి నిర్ణయంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. మంగళవారం దిల్లీలో వి•డియాతో మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినా తమకు నష్టంలేదని అన్నారు. ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉందని తెలిపారు. విపక్షాలు మోదీ నాయకత్వాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. ఇండియా కూటమి ఎక్కువ కాలం ఉండదని ఎంపీ వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేంద్ర హోమ్ మంత్రి మణిపూర్ అంశంపై వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్డీఏ కూటమి చాలా విశ్వాసంతో ఉందని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో అన్ని పార్టీల ముసుగు తొలగిపోతుందన్నారు.
దొంగ నాటకాలు ఆడుతున్న బీఆర్‌ఎస్..కాంగ్రెస్, బీజేపీకి సమ దూరం పాటిస్తామని, ఏ కూటమితో సంబంధం లేదని అన్నారన్నారు. పార్లమెంట్ లోపల జరుగుతున్న వ్యవహారం చూస్తే కాంగ్రెస్ చెప్పుచేతల్లో బీఆర్‌ఎస్ ఎంపీలు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ వాకౌట్ అంటే వాకౌట్, బై కాట్ అంటే బైకాట్..అనే విధంగా బీఆర్‌ఎస్ వ్యవహరిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ నల్ల బ్యాడ్జీలు ధరిస్తే వీళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించడం పార్లమెంట్‌లో చూస్తున్నామన్నారు. పార్టీల వారిగా నోటీసులు ఇచ్చినప్పటికీ సభలో మాత్రం బీఆర్‌ఎస్ ఇండియా కూటమిలాగా వ్యవహరిస్తుందన్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి బీఆర్‌ఎస్ పార్లమెంటులో గాంధీ విగ్రహం ముందు కలిసి ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. దొంగల ముఠా లాగా బీఆర్‌ఎస్ ఎంపీలు వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.




