- పెండింగ్‌లో బిల్లులు…సర్పంచ్‌లే కాంట్రాక్టర్‌ల అవతారం
- పలు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానాలు
- అవిశ్వాసకాల సవరణ బిల్లు గవర్నర్ కోర్టులో..
- పంచాయితీ నిధుల దారి మళ్లింపు ఆరోపణలు
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా భారత రాష్ట్ర సమితి ఉపక్రమిస్తుంటే, ఆ పార్టీ పునాదుల్లోనే ముసలం మొదలైంది. ఏ పార్టీ అయినా పటిష్టంగా మనగలగాలంటే గ్రామీణ స్థాయిలో బలంగా ఉండాలే. రాష్ట్రంలో దాదాపు అన్ని సంస్థల్లో తిరుగులేని ప్రజా బలాన్ని సమీకరించుకున్న బిఆర్‌ఎస్ ఇప్పుడు వాటిని కాపాడుకునే విషయంలో పెద్దగా శ్రమపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయితీల్లో తీవ్ర అసంతృప్తి చోటుచేసుకుంది. పంచాయితీ నిధులు లేమిపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. పంచాయితీలకు అందాల్సిన కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించిందన్న వివాదం ఇంకా కొనసాగుతూనేఉంది. పంచాయితీ స్థాయిలో పలు నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించిన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉండడంతో కాంట్రాక్టర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు.
అభివృద్ధి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో స్వయంగా సర్పంచ్‌లే కాంట్రాక్టర్‌ల అవతారం ఎత్తి, ఒళ్ళు, ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. బిల్లులు అందక అర్థిక భారం మోయలేక నానా అవస్థలు పడుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిధులు తేలేని సర్పంచ్‌లు మాకొద్దని కొన్ని గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సర్పంచ్‌లపై అవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మున్సిపాల్టీకు ఈ నిరసన కార్యక్రమాలు పాకాయి. ఇక్కడ ఆధిపత్య పోరు మొదలైంది. దీంతో రాష్ట్రంలోని పలు పురపాలకాల్లో, మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటివరకు పదుల సంఖ్యలో అవిశ్వాస తీర్మానాలు చేపట్టి ఆయా జిల్లా కలెక్టర్లకు పంపించడంతో , అధికార పార్టీకి వారిని సముదాయించడం శక్తికి మించినట్లవుతున్నది.
మున్సిపల్ ఎన్నికలు జరిగి, అధికారికంగా పదవులు చేపట్టి మూడు ఏళ్ళు పూర్తికావడంతోనే ఈ ముసలం పుట్టింది. పురపాలక చట్టం ప్రకారం ఎన్నికల పక్రియ పూర్తి అయిన మూడేళ్ళ వరకు ఎలాంటి అవిశ్వాస తీర్మానాలకు అవకాశం లేదు. అయితే మూడేళ్ళ క్రితం అంటే 2020 జనవరి 27న సర్పంచ్, ఉపసర్పంచ్‌లు పదవులు చేపట్టి 2023 జనవరి 27కు మూడేళ్ళు పూర్తి అయింది. ఈ మూడేళ్ళ కాలంగా అంతర్ఘత విభేదాలున్నా ఓపిక పట్టిన అవిశ్వాసులకు ఒక్కసారే రెక్కలు వొచ్చినట్లు అయింది. విచిత్రమేమంటే ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీలన్న భేదం లేకుండా అందరిపైన అవిశ్వాసాలు మొదలైనాయి. సర్పంచ్ పదవుల విషయంలో తీవ్ర పోటీ ఎదురైన దగ్గర సంబంధిత మంత్రులు, ఎంఎల్‌ఏలు సర్పంచ్ పదవి కాలాన్ని ఒకరి తర్వాత ఒకరు అనుభవించేలా వారిమధ్య ఒప్పందాన్ని కుదిర్చి అనాటికి సమస్య అయిందనిపించుకున్నారు. రెండున్నర ఏళ్ళ చొప్పున ఇద్దరు పదవిని చేపట్టాల్సి ఉండగా మూడేళ్ళు అయినా కొందరు పదవిని వీడకపోవడంతో ఆ పదవికోసం ఆశిస్తున్నవారిలో తీవ్ర ఆసంతృప్తి చోటుచేసుకుంది. దీంతో అవిశ్వాస తీర్మానంతోనైనా వారి ఆశయాన్ని నెరవేర్చుకోవచ్చన్న ఉద్దేశ్యంగా చట్ట ప్రకారం మూడేళ్ళవరకు ఆగారు.
జనవరి 27తో మూడేళ్ళు ముగియటంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాల్టిల్లో అవిశ్వాస తీర్మానాలు ఒకదాని వెనుక ఒకటిగా మొదలైనాయి. తాజాగా జగిత్యాల విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. చైర్పర్సన్ బోగ శ్రావణి బలవంతంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి, అందుకు స్థానిక ఎంఎల్‌ఏ ప్రోత్సాహంపై ఆమె ఎలక్ట్రానిక్ మీడియా ముందు ఎలా కన్నీరు మున్నీరైన సంఘటన దేశవ్యాప్తమైంది. ప్రస్తుతం చైర్మన్‌లుగా కొనసాగుతున్న వారిపై అవిశ్వాసానికి స్థానిక ఎంఎల్‌ఏ, ఎంఎల్సీ లేదా మంత్రుల పరోక్ష ప్రమేయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో వారివారి ఆధిపత్యం కోసం ముసలం పుట్టిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీకి మెజార్టీ ఉన్నప్పటికీ అంతర్ఘత కలహాల దృష్ట్యా కౌన్సిలర్లు రెండు వర్గాలుగా ఏర్పడి, ప్రతిపక్ష పార్టీల సహకారంతో అధికారాన్ని హస్తగతం చేసుకునే ప్రణాళికలను రచిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీల వారితో కలిసి క్యాంపులు నిర్వహించే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.
నిర్మల్‌లో అదే పరిస్థితి కొనాసాగుతున్నది. ఇప్పటివరకు అవిశ్వాస తీర్మానాలు చేసి, కలెక్టర్ల ఆమోదం కోసం పంపించిన వాటిల్లో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ నగరపాలక సంస్థ, రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట, ఇబ్రహిం పట్టణ పురపాలక సంఘం, వికారాబాద్ జిల్లా తాండూరు, యాదగిరి మున్సిపాలిటీలున్నాయి. జనగామ మున్సిపాలిటీ కూడా అదే దారిలో ఉండగా, ఆర్మూర్, హుజురాబాద్ ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలు చేస్తున్నారు. వాస్తవంగా ఇలాంటి పరిస్థితి వొస్త్తుందని అధికార బిఆర్‌ఎస్ ముందుగానే ఊహించింది. అందుకే గత శాసనసభ సమావేశాల్లో చట్ట సవరణ చేసే బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి. ఇప్పటివరకు అవిశ్వాసానికి మూడేళ్ళు ఆగాల్సి ఉండగా కొత్తగా సెప్టెంబర్‌లో ఉభయసభలు ఆమోదించిన దానిలో నాలుగేళ్ళ కాలం ఆగాల్సి ఉంటుంది. అయితే ఈ బిల్లును ఆమోదానికి రాష్ట్ర గవర్నర్‌కు పంపించగా, రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఇతర బిల్లులతోపాటు దీన్ని కూడా గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం ఇప్పుడు బిఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారింది. గవర్నర్ అప్పుడే ఆమోదించి ఉంటే ఇంతటి రాజకీయ సంక్షోభం ఎదురయ్యేది కాదు. పైగా ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో అవిశ్వాసం ప్రకటిస్తున్న వారు కూడా పట్టుదలగా ఉన్నారు. వొచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రతినిధుల మద్దతు అధికార పార్టీకి అవసరం కనుక, తమ డిమాండ్‌ను తప్పక అంగీకరిస్తుందన్న నమ్మకంగా వారున్నారు. ఈ వివాదం మరింత ముదరకుండా వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికార పార్టీ మంత్రులు,ఎంఎల్‌ఏల పై ఒత్తిడి తెస్తుండగా,ఇదే అవకాశంగా ప్రతిపక్షాలు దూకుడు పెంచుతున్నాయి.





