అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి 

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ద్వంద వైఖరి వీడి అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనగా అర్హులైన పేదలందరికీ  సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సిద్దిపేటలోని ఆర్డీవో కార్యాలయం ముందు పార్టీ పిలుపు మేరకు గురు5 ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఇల్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ నాయకులకు వారి కుటుంబాలకే ఎక్కువ అందుతున్నాయే తప్ప అర్హులైన పేదలకు అందించడం లేదని విమర్శించారు.సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు నిరుపేదలకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ హామీని అమలు పరచకుండా అలసత్వం ప్రదర్శించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలు గాలికి వదిలి అక్రమ సంపాదన మీద పడ్డారని ఆరోపించారు‌.ఇల్లు లేని పేదవారికి ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి కేంద్రం ఇస్తున్న నిధులను బొక్కుతూ ప్రజలను మోసం చేస్తుందన్నారు.ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా మళ్లీ అధికారం కోసం కుట్రలు పన్నుతూ కలలు కంటున్నారని కలలు కలలుగానే మిగులుతాయని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో కెసిఆర్ పని అయిపోయిందని కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.కెసిఆర్ 10 సంవత్సరాల పదవీకాలం ముగుస్తున్న పేదలకు మాత్రం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని దుయ్యబట్టారు.స్థలమున్న వారికి రూ.5 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి మళ్ళీ మాట మార్చి రూ.3 లక్షలు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు.ఇంటి స్థలం ఉన్న వారికి ఎలాంటి షరతులు లేకుండా గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయాలని,దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని బీసీలందరికీ కూడా రూ లక్ష ఆర్ధిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ వచ్చిన నుంచి ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు మంజూరి చేయలేదని వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.పెండింగ్ లో ఉన్న వితంతు,వృద్ధాప్య,వికలాంగుల పింఛన్లు మంజూరు చేయాలని కెసిఆర్ ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.కార్యక్రమంలో బిజెపి నాయకులు విద్యాసాగర్,ఉపేందర్ రావు,కోడూరి నరేష్,పత్రి శ్రీనివాస్ యాదవ్,ఉడుత మల్లేశం, శివకుమార్, పురుమాండ్ల నరసింహారెడ్డి,  మల్లమ్మగారి శ్రీనివాస్ రెడ్డి, పర్శరాములు,గోనె మార్కండేయులు, రమేష్ గౌడ్, కనకరాజు,  అరుణ రెడ్డి,పద్మ, సుగుణ,లత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *