పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 13: దశాబ్ది కాలంలో పటాన్ చెరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్క ఓటరుకి వివరించి, సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నికల్లో గెలిపించేలా చైతన్య పరచాలని బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.సోమవారం పటాన్ చెరు డివిజన్ బిఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని 405 బూతులలో 3,97,237 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. బూత్ స్థాయి ఏజెంట్లు, కార్యకర్తలు తప్పనిసరిగా ప్రతి ఓటరు ని కలిసి పదేళ్ల అభివృద్ధిని సవివరంగా వివరించాలని కోరారు. ప్రభుత్వంతో పాటు సి ఎస్ ఆర్, వ్యక్తిగత నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో గెలిస్తే అమలు చేయబోయే మేనిఫెస్టోను ప్రతి గడపకు అందించాలని కోరారు. పదేళ్లపాటు ప్రజలను పట్టించుకోని ప్రతిపక్ష పార్టీల తీరును ఎండగట్టాలని కోరారు. సమన్వయంతో పని చేస్తే లక్ష మెజారిటీతో పటాన్ చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలిపారు.ఈ సమావేశంలో కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన దేవ్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధిని వివరించండి ప్రగతిని కొనసాగించండి



