అభివృద్ధిని చూసి ఓర్వేకపోతున్నారు

బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా విమర్శలపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌
ఉప్పల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26 : ‌కెసిఆర్‌తో పెట్టుకున్న ఏ నాయకుడు బాగుపడిన దాఖలాలు లేవని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మంత్రి కెటిఆర్‌ ‌పరోక్షంగా హెచ్చరిక చేశారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదివారం నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ‌తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాగర్‌ ‌కర్నూల్‌ ‌సభలో పాల్గొనేందుకు వొచ్చిన నడ్డా ఆ సందర్భంగా ఇష్టారీతిన మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను జైల్లో పెడతామని, ధరణి వ్యవస్థను తీసేస్తామని చెప్పారని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. గత కొన్నేళ్లలో కేసీఆర్‌తో పెట్టుకున్న ఏ నాయకుడు బాగుపడినట్లు లేదని తేల్చి చెప్పారు. సోమవారం ఉప్పల్‌ ‌కూడలిలో నిర్మించిన స్కై వాక్‌ను మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ ‌మాట్లాడుతూ…గతంలో కరెంట్‌ ఉం‌టే వార్తలాగా ఉండేదని, ఇప్పుడు కరెంట్‌ ‌పోతే వార్త లాగా ఉందన్నారు. విపక్షాలు అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నాయని, జెపి నడ్డా అడ్డమైన మాటలు మాట్లాడి వెళ్లారని, సిఎం కెసిఆర్‌ను తిట్టి పైశాచికానందం పొందుతున్నారని కెటిఆర్‌ ‌దుయ్యబట్టారు.
ఉప్పల్‌ ‌ఫ్లై ఓవర్‌ ఎం‌దుకు కట్టలేదో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి చెప్పాలని నిలదీశారు. అవినీతి గురించి టిపిసిసి ప్రెసిడెంట్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడితే చంపి సంతాపం తెలిపినట్లుగా ఉందని కెటిఆర్‌ ఎద్దేవా చేశారు. ప్రగతి రథచక్రాలు ఆగొద్దంటే మళ్లీ బిఆర్‌ఎస్‌ ‌రావాలని పిలుపునిచ్చారు. స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామ రక్ష అని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ అం‌దిస్తున్నందుకు కేసీఆర్‌ను జైలులో పెట్టాలా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ‌కిట్లు, రెండు పడక గదుల ఇల్లు ఇస్తున్నందుకా? అని నిలదీశారు. జేపీ నడ్డా ఈ మాటలు మాట్లాడడానికి ఓ హద్దు అదుపూ అనేది ఉండాలని అన్నారు. గత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో కరెంట్‌ ‌కష్టాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ ‌సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఎండా కాలంలో నీటి సమస్య లేకుండా ఇబ్బందులను సీఎం కేసీఆర్‌ ‌పరిష్కరించారని అన్నారు. నారపల్లి నుంచి ఉప్పల్‌ ‌వరకు రహదారి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్‌ ‌సమస్యలు తీరతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నాలుగేళ్ల నుంచి రహదారుల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని ఆరోపించారు.
అవినీతి గురించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడితే పులి శాకాహారం గురించి మాట్లాడినట్లేనని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఒక హంతకుడే తాను చేసిన హత్యకు సంతాపం తెలిపినట్లు ఉంటుందని వ్యాఖ్యానించారు. రూ.50 లక్షల నోట్ల కట్టలతో దొరికి జైలుకెళ్లొచ్చిన వ్యక్తి చెప్పే నీతి ముచ్చట్లను మనం వినాలా? అని నిలదీశారు. కాంగ్రెస్‌ ‌నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జాప్యంతో ఎంతో మంది ఉద్యమకారులు చనిపోయారని, దానికి సోనియాగాంధీ కారణం కాదా? అని ప్రశ్నించారు. 9 ఏళ్లలో ఒక్కో పని చేసుకుంటూ హైదరాబాద్‌, ‌తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నామని..పేదలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని చెప్పారు. ఈ విషయాలను ప్రజలంతా గమనించాలని కేటీఆర్‌ ‌కోరారు. ఉప్పల్‌ ‌కూడలిలో రద్దీ ఎక్కువైనందున రోడ్లు దాటేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, అందుకే పాదచారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కునకుండా రోడ్డు దాటేందుకు ఉప్పల్‌ ‌చౌరస్తాలో రూ.36.50 కోట్ల ఖర్చుతో స్కైవాక్‌ ‌నిర్మించారు. ప్రయాణికలు రామంతాపూర్‌ ‌నుంచి ఉప్పల్‌ ‌వైపు.. ఉప్పల్‌ ‌వైపు నుంచి రామంతాపూర్‌ ‌వైపు..నాగోల్‌ ‌వైపు నుంచి హబ్సీగూడ వైపు..హబ్సీగూడ వైపు నుంచి నాగోల్‌ ‌వైపు పాదచారులు స్కైవాక్‌ ‌ద్వారా భద్రంగా రోడ్డు దాటొచ్చేలా నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *