- ఇదీ బిఆర్‌ఎస్ నినాదం…నూతన ఒరవడికి శ్రీకారం
- 14 దిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం
- త్వరలో జాతీయ విధానం ప్రకటన
- నియంతృత్వ ధోరణి పోవాలె…ఫెడరల్ స్ఫూర్తి రావాలె
- జాతీయ పార్టీ ఆవిర్భావ సభలో సిఎం కెసిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 09 : ‘అబ్ కీ బార్..కిసాన్ కా సర్కార్’ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి జాతీయ పార్టీగా అవతరించిన భారత రాష్ట్ర సమితి పార్టీ నినాదమని సిఎం కెసిఆర్ ప్రకటించారు. బిఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశ జనాభాలో 40 శాతం ఉన్న రైతులకు న్యాయం జరుగడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు రద్దు చేసి తాము నూతన విధానాలను అమలులోకి తెస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. దేశంలో కొత్త ఆర్థిక విధానం, కొత్త పర్యావరణ విధానంతో పాటు నూతన ఒరవడులను అమలులోకి తెస్తామన్నారు. ఇందుకు ఆయా రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు కొనసాగుతాయని తెలిపారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉండి, 70 వేల టిఎంసిల జల వనరులుండి రైతులు ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఇంకెంత కాలమని ప్రశ్నించారు. ఎన్ని ఉద్యమాలు జరిగినా పరిస్థితి మారడం లేదన్నారు. పరివర్తన కోసమే బిఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బిఆర్‌ఎస్ దివ్వెతో దేశ వ్యాప్తంగా వెలుగులు విరజిమ్ముతామని తెలిపారు. అంకిత భావంతో పని చేస్తే అన్ని సాధ్యం చేసుకోవచ్చన్నారు. ఈ నెల 14 దిల్లీలో బిఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, దానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. కాగా 2023 మేలో కర్నాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ సరిహద్దు జిల్లాలలో జెడిఎస్‌తో పొత్తుతో బిఆర్‌ఎస్ పోటీ చేస్తుందని తెలిపారు. దేశంలో ప్రస్తుతం నియంతృత్వ ధోరణి కొనసాగుతుందని ఆ పరిస్థితి పోయి సర్వత్రా ఫెడరల్ స్ఫూర్తి నెలకొనాలని అన్నారు.
కొరోనా సమయంలో దేశమంతా ఆర్థికంగా వెనుకబడినా తెలంగాణ మాత్రం ఆర్థిక క్రమశిక్షణ, నియంత్రణతో పాజిటివ్ వృద్ధి రేటుతో నిలదొక్కుకుందని సిఎం కెసిఆర్ అన్నారు. ఒకనాడు కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతూ వలసలకు పురుపొందిన పాలమూరు నేడు పచ్చని పొలాలతో విలసిల్లుతున్నదని అన్నారు. సమష్టి కృషితో ముందుకు సాగితేనే ఇంత అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. ఇంతగా వెనుకబడిన తెలంగాణను గొప్పగా లభివృద్ధి చేసుకోగలిగినప్పుడు రత్నగర్భ అయిన భారత దేశాన్ని ఇంకెంతగానో అభివృద్ధి చేసుకోగలమన్నారు.



