అఫ్ఘాన్‌లో కొరడా ఝళిపిస్తున్న తాలిబన్లు

  • ఛాందసవాదనతో మహిళలపై ఆంక్షలు
  • మహిళలకు యూనివర్సిటీ విద్య నిషేధం

కాబూల్‌, ‌డిసెంబర్‌ 21 : అఫ్ఘానిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించు కున్న తాలిబన్లు తమ కాఠిన్యాన్నిప్రదర్శిస్తున్నారు. తొలుత ప్రపంచానికి భయపడి కొంత సంయమనం పాటించిన ముష్కరులు మెల్లగా తమ ఛాందసంతో ప్రజలను వేధిస్తున్నారు. ప్రధానంగా మహిళలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. పురుషులు వెంట లేకుండా మహిళలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేదని, బాలికల సెకండరీ స్కూళ్లు మూసివేయాలని, మహిళలు ఉద్యోగాలు చేయకూడదంటూ ఆదేశాలు జారీచేసిన తాలిబన్‌ ‌పాలకులు తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.

దేశంలో మహిళలకు యూనివర్సిటీ విద్యపై నిషేధం విధించారు.మహిళలకు విద్యాబోధనను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహమ్మద్‌ ‌నదీమ్‌ ‌లేఖ రాశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆజ్ఞాపించారు. అయితే తాలిబన్ల నిర్ణయంపై అమెరికా, బ్రిటన్‌ ‌వంటి దేశాలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. మహిళలకు యూనివర్సిటీ విద్యపై నిషేధం విధించడం, బాలికల సెకండరీ స్కూల్‌ ‌మూసివేయడం, మహిళలు, బాలికలపై ఆంక్షలు విధించడం వంటివి వారి హక్కులు, స్వేచ్ఛను హరించడమేనని అమెరికా హోం శాఖ ప్రతినిధి నెడ్‌ ‌ప్రైస్‌ ఆ‌గ్రహం వ్యక్తంచేశారు.

మహిళల హక్కులను ఇది కాలరాయడమేనని ఐక్యరాజ్య సమితిలో బ్రిటన్‌ ‌రాయబారి బార్బరా వుడ్‌ ‌వార్డ్ అన్నారు. మహిళలకు యూనివర్సిటీ విద్యను దూరం చేస్తూ తాలిబన్లు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *