ఎల్బీనగర్ , ప్రజాతంత్ర, నవంబర్న్ని 19: దళిత వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎల్.బి.నగర్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ కార్యక్రమంలో సుధీర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 60 ఏళ్ల కాలంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. ఏ రాష్ట్రంలోని జరిగిన అభివృద్ధి ప్రజా సంక్షేమం తెలంగాణ రాష్ట్రంలో కేవలం తొమ్మిదిన్నర కాలంలోనే జరిగిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిషాలు కృషి చేస్తున్నారని అన్నారు. పుట్టిన బిడ్డ నుంచి ముసలవ్వ వరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ని కొనియాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 పెన్షన్ ఇస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ ముసలవ్వల ఆత్మగౌరవ సూచికగా ఆసరా పెన్షన్ ను రూ.2016లు అందిస్తూ ఆర్థిక భరోసా కల్పించారని అన్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని గొప్ప ఆలోచనను నిరుపేద యువతి పెళ్లికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం ద్వారా రూ.100,116లు, రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతుబీమా పథకాలను, దళిత జీవితాలలో వెలుగులు నింపేందుకు దళిత బంధు అందిస్తున్న మహోన్నత నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఉద్యమ సమయంలో ఏనాడు పదవుల కోసం ఆశపడలేదని, ఆనాడు తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడమని, ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. కానీ కొంతమంది పదవుల కోసమే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఉద్యమ మహానేత కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణలోని అమలు కావడం ఎంతో సంతోషమన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ పేరుతో రుణాలు ఇవ్వకుండా బ్యాంకుల చుట్టూ తిప్పించుకునేదని అన్నారు. కేవలం దళితుల సంక్షేమానికే కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. నిత్యం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తున్న సీఎం కేసీఆర్ ని ప్రతి కుటుంబం తమ పెద్ద కొడుకుగా భావిస్తున్నారని, ఇప్పటికే ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో కొన్ని వేల మందికి ఆసరా పెన్షన్, కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్, తదితర సౌకర్యాలు అందజేయడం జరిగిందన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ఏర్పాటుతో ఉచితంగా నాణ్యమైన విద్య, డా.బి.ఆర్. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ తో విదేశీ విద్య సాకారం, కులాంతర వివాహం ప్రోత్సాహం 2 లక్షల 50 వేలు, తెలంగాణ కి తలమానికంగా హైదరాబాద్ లో డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, తెలంగాణ నూతన సచివాలయనికి డా.అంబేద్కర్ పేరు పెట్టి ఆయనకు సముచిత స్థానం కల్పించారని అన్నారు. నియోజకవర్గ ప్రజలు గతంలో తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారని, వారి రుణం తీర్చుకునేందుకే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలో గులాబీ జెండా తప్పక ఎగురుతుందని ఆయన అన్నారు. ప్రజలకు సంక్షేమం, న్యాయం, అభివృద్ధి జరగాలంటే కేవలం బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. వారి ఆలోచనకు అనుగుణంగానే సంక్షేమపాలన కొనసాగుతుందని అన్నారు. మాదిగ సోదరులు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా బిజెపి పార్టీలో వణుకు ప్రారంభమైందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచి కారు గుర్తుకు ఓటెయ్యాలని, కెసిఆర్ ని హ్యాట్రిక్ సీఎంగా గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడి పాపయ్య, మామిడి రామచందర్, బండారు వెంకటరమణ, మల్లెపాక యాదగిరి, భారీ ఎత్తున మాదిగల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం : దేవిరెడ్డి సుధీర్ రెడ్డి




