దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైనది ,ప్రధానమైనది విద్య . ఏ దేశమైనా రాష్ట్రమైన ప్రగతి పదంలోకి నడవాలంటే అవి అనుసరించే విద్యా విధానాల పైన ఆధారపడి ఉంటాయి. కనుక అన్ని అగ్రరాజ్యాలలో పెట్టుబడిదారీ విధానాలు కలిగినటువంటి దేశాలలో కూడా విద్య ప్రభుత్వ నిర్వహణలోనే ఉంది. మన దేశంలో మాత్రం విద్య ఎక్కువ భాగం ప్రవేటు పరమయింది. పరాయి పాలన నుండి పాలకవర్గాలు విద్య పై శ్రద్ధ చూపలేదు. పొగ పాలకవర్గాలకు అనుకూలంగా విద్యా విధానాలను అమలుపరిస్తూ, విద్య అభివృద్ధి కోసం అనేక కమిషన్లు వేసినను, అవి సూచించిన సూచనలను అమలుపరిచిన దాఖలాలు లేవు . రాజ్యాంగం ప్రకారం విద్య మొదట రాష్ట్ర జాబితాలో ఉన్నను , ఆర్టికల్ 42 ప్రకారం ఉమ్మడి జాబితాలో చేర్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ అతి జోక్యం వలన రాష్ట్రాలలో విద్యాభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది.
19 66 లో కొఠారి కమిషన్ సూచించినట్లు దేశ స్థూల జాతీయోత్పత్తిలో 6శాతం నిధులు , రాష్ట్ర ప్రభుత్వాలు 30 శాతం నిధులను విద్యకు కేటాయించాల్సిందిగా సూచించనను ఇంతవరకు కేటాయించిన సందర్భం లేదు. వాళ్లకంటే నేటి ప్రభుత్వాలు ఏడాదికి ఏడాది విద్యకు నిధులు తగ్గిస్తూ వస్తున్నాయి. దీంతో పాఠశాలల అభివృద్ధి, భౌతిక వసతులు సరిగా లేక పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ముఖ్యంగా విద్యాభివృద్ధికి సీమాంధ్ర పాలకవర్గాలు శీతకన్ను వేశారని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అవే ఇబ్బందులు పడుతుండటం విచారకరం. కేజీ నుండి నుండి పిజి వరకు చిరు ఉద్యోగి నుండి కలెక్టర్ వరకు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించేలా అంతరాలు లేని సమాన అవకాశాలతో కూడిన విద్యను అందిస్తామని తెలంగాణ ఏర్పాటు ఆవిర్భావంలో పాలక పెద్దలు ప్రకటించిన విషయాన్ని ఇంతవరకు అమలులోకి తీసుకురాకపోవడంతో, గతంలో ఉన్న పారిశుద్ధ్య సిబ్బందిని తొలగించడం, ఖాలీ గా ఉన్న పోస్టులలో విద్యా బోధన చేస్తున్న 12,000 మంది విద్యా వాలంటీర్లను తొలగించడం, భౌతిక , మౌలిక వసతులకు నిధులు సరిపోయేంతగా సకాలంలో అందించకపోవడంతో పాఠశాలలన్నీ కనీస సౌకర్యాలు లేకుండా అపరిశుభ్రమైన వాతావరణంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
అన్ని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కన్నీటి పర్యంతమే. హైదరాబాదుకు సమీపంలో ఉన్న పాఠశాలలోనే కనీస అవసరాల లేమితో ఉంటే, అత్యంత మారుమూల ఆదివాసి గూడాలలో పల్లెలలో గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాల పరిస్థితి ఎంత దయనీయంగా అధ్వానంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి , మన బస్తి మనబడి కార్యక్రమాలలో భాగంగా పాఠశాలల అభివృద్ధి కోసం నిర్మాణాత్మక పనులు చేపట్టిన అవి పూర్తి కాలేదు . నిధుల లేమితో అసంపూర్తిగా ఆగిపోయాయి. గతంలో ఉన్న కొద్దిపాటి వసతులను కూడా నూతన నిర్మాణాల పేరిట తొలగించడంతో మూత్రశాలలు మరుగుదొడ్లు లేక బాలికలు ఉపాధ్యాయునిలు శారీరిక, మానసిక వేదనలకు గురవుతున్నారు. అంతేకాకుండా అనారోగ్యం పాలవుతున్నారు కూడా.
రాష్ట్రంలో సుమారుగా 26000 ప్రభుత్వ బడులు ఉండగా, వాటిలో 25 లక్షలకు మంది పైగా చదువుకుంటున్నారు. బడి బాటలో మరో లక్ష మంది పాఠశాలలో చేరడం జరిగింది. దీంతో స్కూల్ టీచర్ల కొరత తీవ్రమైంది. గత విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టింది. ఈ విద్యా సంవత్సరం నుండి 9వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో బోధించాల్సింది. ఆ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదివే విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల సర్దుబాటు లేదు. తాత్కాలికంగా 7వేల మంది మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. కానీ పాఠశాల విద్యా భాగంలో చదువు చెప్పే టీచర్ నుంచి పాఠశాలలను పర్యవేక్షించే వరకు అన్ని పోస్టులు ఖాలీ గానే ఉన్నాయి. దాంతో సరైన పర్యవేక్షణ లేక చదువు కుంటూ పడుతుందని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా, ఏడుగురు మాత్రమే రెగ్యులర్ డీఈవోలు ఉన్నారు. పెరిగిన జిల్లాల సంఖ్య కనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారుల పోస్టులు మంజూరు చేయబడలేదు. డిప్యూటీ డిఇఓ పోస్టులు 66 ఉండగా 60 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి, కేవలం ఆరుగురు మాత్రమే పనిచేస్తున్నారు. మండల విద్యాధికారుల పోస్టులో కూడా 95 శాతం మంది ఇన్చార్జిలే కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 607 మండలాలు ఉండగా, మంజూరైన మండల విద్యాధికారుల పోస్ట్లు 488, కానీ 17 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓ లు ఉన్నారు. ప్రధానోపాధ్యాయుల పోస్టులు 4252 ఉండగా 2270 మంది మాత్రమే చేస్తున్నారు. 10 డైట్ కాలేజీల ప్రిన్సిపాల్ పోస్టులు ఖాలీ గా ఉండగా ఆరు ఖాలీ గా ఉన్నాయి. 70 సీనియర్ లెక్చరర్ పోస్టు లన్ని ఖాలీ గానే ఉన్నాయి. దీంతో నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం లేదని విమర్శలు కూడా వున్నాయి . ఆ ముఖ్యంగా ప్రధానోపాధ్యాయుల విద్యాధికారుల పోస్ట్లు ఖాలీ గా ఉండడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని వాదనలు కూడా ఉన్నాయి .
పాఠశాలలు సక్రమంగా నడవాలన్నా విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందాలన్న క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థ కీలకం. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ , అన్ని విషయాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఈ విద్యా సంవత్సరం నేటి వరకు చేరలేదు. పుస్తకాలు రెండు భాషలలో ముద్రించడం మూలంగా పార్ట్ వన్ ,పార్ట్ 2 గా విడదీయడం జరిగింది. పోయిన విద్యా సంవత్సరం లో పార్ట్ వన్ పుస్తకాలే పూర్తి స్థాయిలో అందినాయి. ఈ సంవత్సరం పాఠశాలలు ప్రారంభమై రెండో నెల పూర్తి కావస్తున్న పాఠ్యపుస్తకాలు, పిల్లలకు అందించే ఏకరూప దుస్తులు నేటి వరకు కూడా అందలేదు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు నిర్వహించకపోవడం వలన, సంవత్సరాల తరబడి ఒకే పాఠశాలలో పనిచేస్తూ, నియామకం పొందిన దగ్గర నుంచి ఓకే క్యాడర్లో పనిచేస్తూ, 317 జీవో ద్వారా నాన్ లోకల్ పేరుతో ఇతర జిల్లాలకు విసిరి వేయబడటంతో, కుటుంబాలకు దూరమై, ఆర్థిక అవసరాల కోసం దాచుకున్న జిపిఎఫ్ నుండి పార్ట్ ఫైనల్స్ , లోన్లు కోసం దరఖాస్తు చేసిన వాటి చెల్లింపులు లేక, సంపాదిత సెలవుల నగదు చెల్లింపు లేక, డి ఎ లు ఇవ్వకుండా, చివరికి వేతనాలు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకు లోన్లకు సంబంధించిన నెలసరి వాయిదాలు చెల్లించలేక , రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ధరలను , కూరగాయల ధరలను భరించలేక, కుటుంబ అవసరాలు తీర్చలేక తీవ్రమైన మానసిక ఆందోళనతో అభద్రత భావంతో ఉపాధ్యాయులు బిక్కు బిక్కుమంటూ పనిచేస్తున్నారు. పెరిగిన ధరలు, నెలవారీగా వెంటనే మధ్యాహ్న భోజన బిల్లులు అందకపోవడం వలన,వారికి ఇస్తామన్న మూడు వేల గౌరవ వేతనం అమలు చేయకపోవడం వలన మధ్యాహ్న భోజన కార్మికులు అప్పుల పాలై నాణ్యమైన భోజనాన్ని అందించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె చేయడంతో పాఠశాలలో విద్యార్థుల ఆకలి తీర్చడానికి ఉపాధ్యాయులే గరిట తిప్పవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి దయనీయమైన పరిస్థితులలో కేశనగర్ పాఠశాల అభివృద్ధికి హిమాంశు కృషి చేయడం, ఈ పాఠశాల దత్తత తీసుకోవడానికి తాతగారే స్ఫూర్తి అని, చదువుతున్న సమాజంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఎప్పుడూ చెబుతుంటారని. ఆ మాటలతోనే ముందుకి సాగానని వెల్లడించడం జరిగింది. మనవడిలో స్ఫూర్తి నింపిన తాతగారికి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, దుస్థితి తెలియంది కాదు. హిమాంశు పేరు ప్రఖ్యాతుల కోసం, ముందు భవిష్యత్తు కోసం చేసిన, అత్యంత గొప్పదైన సామాజిక బాధ్యత, స్పృహతో కూడిన, ఉత్తమమైన సమాజ హిత అభివృద్ధికరమైన కార్యం. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి అభివృద్ధి కార్యక్రమం, మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం అందించడం, విద్యార్థులకు పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు అందించడం , ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం లాంటి అభివృద్ధి కరమైన కార్యక్రమాలు ఉన్నను, క్షేత్రస్థాయిలో విద్య పట్ల, పాఠశాలల అభివృద్ధి పట్ల ఇంకా ఎంతో శ్రద్ధ చూపవలసిన అవసరం ఉన్నది. కనుక ప్రభుత్వంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలో చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకొని ఆర్థికంగా బలపడిన వారు చిన్నారి స్ఫూర్తిగా పాఠశాల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది…
తండ సదానందం, టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్, మహబూబాద్.




