అనవసర భయాలతో ఆత్మహత్యలు వద్దు

వేధింపులనేవి సర్వసాధారణంగా మారిపోయాయా, వేధింపులనేవి ఎక్కడైనా, ఎవరికైనా తప్పవా? ఇటీవల వార్తా పత్రికలలో ప్రచురితమైన వార్తలను చూస్తే వేధింపులతో ఆత్మహత్యలా అనే సందేహం కూడా కలుగుతోంది. ఇంత సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటున్నారా? మానసిక ధృఢత్వం వ్యక్తుల మధ్య కొరవడుతోందా….ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తీవ్ర దిగ్బ్రాంతిని కలుగ చేస్తున్నాయి. నల్లగొండలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు యువతుల ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న ఇద్దరు యువతులు ఇటీవల రాజీవ్‌ పార్క్‌ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వాట్సాప్‌ అకౌంట్‌కు డీపీగా పెట్టుకున్న ఫోటోలను కొందరు యువకులు మార్ఫింగ్‌ చేసి ఇన్‌స్టాలో పోస్టు చేసి, బెదిరింపులకు పాల్పడినందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలినట్లుగా వివిధ పత్రికలలో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తోంది. జీతాలు ఆలస్యం కావడంతో హోంగార్డు ఆత్మహత్య. ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ బాత్‌రూమ్‌లో తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం పోలీసు వర్గాల్లో కలకలం రేపుతుంది.

క్షణం ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం
క్షణికావేశంలో తీసుకొనె నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఆత్మహత్యలకు పురిగొల్పబడుతాయి. మనపై ఆధారపడిన, చిన్నప్పటి నుండి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిలించడం భావమా. జీవితంపై సరైన అవగాహన, దృక్పథం లేకపోవడం మూలంగా ఆత్మహత్య ఆలోచనలు మదిని తొలచివేస్తూ ఉంటాయి. సమస్యలకు పరిష్కారమే లేదని భావిస్తున్నారు. ఒక్క క్షణం సానుకూలంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం కళ్లముందు కనిపిస్తుంది.

ఆత్మన్యూనతతో ఆత్మహత్య భావనలు
ఆత్మహత్యలకు ఎన్నో కారణాలు అందులో ప్రధానంగా మారుతున్న కాలానుగునంగా మారలేకపోవడం,  తనపై తనకు నమ్మకం సన్నగిల్లడం, ఆత్మన్యూనత, జీవితంలో ఎదురయ్యే సంఘటనలు ఎదుర్కోవాలనే ఆలోచనలు తక్కువ కావడం, ప్రతి దానికి  ఇతరులతో తమను తాము పోల్చుకుని ఆత్మన్యూనతతో భావనలను కలిగిఉండడం, ఎప్పుడో  జరిగిపోయిన వాటి గురించి అతిగా ఆలోచిస్తూ బాధపడడం, ఏవేవో సంఘటనలు జరుగుతాయని భావించి అనవసరమైన విషయాలను ఊహించుకుని భయపడడం, సామాజిక అంశాలు కూడా ఒక్కోసారి ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంటాయి.

ఆత్మహత్యలకు పాల్పడు వారిలో ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగిన ఆర్థిక నష్టం భరించలేక, ఉద్యోగం సాధించటంలో వైఫల్యం పొందినవారు, భౌతిక, లైంగిక వేధింపులకు గురికావడం, కుటుంబ సామాజిక సంబంధాల లోపం, సమాజంలో స్తాయి కోసం శక్తికి మించి పనులు చేయడం, వృద్దాప్యంలో నిరాదరణకు గురికావడం, ప్రేమలో వైఫల్యం పొందడం,దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతూ, మానసిక వేదనతో, ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు అనిపించినవారు, సమాజంలో పరువుపోతుందన్న భయంతో బాధపడుతున్నవారు, తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చలేకపోతున్నామనుకునేవారు, మత్తుమందులు, మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన వారు బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న వారు, పెద్దవారిలో అయితే కుటుంబ, ఆస్తి తగాదాల కారణంగా వివాహేతర సంబంధాలున్నవారు, దంపతుల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం లేక అనుమానించుకునే వారు, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో వైఫల్యం, చదువులో వెనుకబడినవారు ఇలా పలు కారణాలు ఉన్నాయి.

పరోక్ష సంకేతాలు
ఆత్మహత్యకు పాల్పడే వారిలో కొన్ని మార్పులు గమనించవచ్చు. ఒంటరితనంనకు ఇష్టపడటం, మద్యం అతిగా సేవించటం, ప్రతికారం తీర్చుకోవడం గురించి ఎక్కువగా మాట్లాడటం, తీవ్ర మానసిక ఒత్తిడిని ప్రదర్శించడం, అతిగా నిద్ర పోవడం, రాత్రి సమయంలో నిద్ర పోకుండా అతిగా ఆలోచించడం, అనవసర (ప్రాధాన్యతలేని) విషయాల పట్ల అతిగా స్పందించటం, అసలు స్పందించక పోవటం, చనిపోతున్నాని ముందుగానే పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి చేష్టలను ముందుగానే స్నేహితులు, కుటుంబసభ్యులు పరిశీలించి సైకాలజిస్ట్‌ ను సంప్రదించడం ద్వారా కౌన్సెలింగ్‌, సైకాలజికల్‌ థెరపీ ద్వారా కొంత వరకు ఆత్మహత్య ఆలోచలను నివారించవచ్చును.

పానిక్‌ డిజార్డర్‌
భయంకరమైన భయాందోళనలకు కారణమవుతుంది, వ్యక్తి చాలా నిమిషాల పాటు భయం మరియు నిస్సహాయత యొక్క ఆకస్మిక అనుభూతిని అనుభవించినప్పుడు పానిక్‌ డిజార్డర్‌ ఏర్పడుతుంది. పానిక్‌ డిజార్డర్‌ సాధారణంగా శ్వాస సమస్యలు, గుండె కొట్టుకోవడం, చేతులు మొద్దుబారడం మరియు చెమటలు పట్టడం వంటి భయానక లక్షణాలతో కూడి ఉంటుంది. ఇంటి నుండి లేదా ప్రియమైన వ్యక్తి నుండి వేరు చేయబడతామనే మితిమీరిన భయం తో ఏర్పడేదే వేరు ఆందోళన రుగ్మత.  పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ అనేది ఆందోళన రుగ్మత, పి.టి.ఎస్‌.డి. ద్వారా హింసాత్మక, రక్త రూపం కనబడే సంఘటనలు, ప్రియమైన వ్యక్తి యొక్క ఆకస్మిక మరణం వంటి ఆందోళనకరమైన లేదా బాధాకరమైన సంఘటనను తిరిగి పొందుతాడు.

ఆత్మహత్యలు పెరుగుతున్నాయి
గతంతో పోల్చితే ఆత్మహత్మలకు పాల్పడేవారి సంఖ్య నానాటికి పెరుగుతున్నది. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం, మానవ సంబంధాలు తగ్గడం, వ్యక్తులలో జీవన నైపుణ్యాలు కొరవడడమే ప్రధాన కారణం. ప్రస్తుత ఆధునిక జీవన విధానంలో  చిన్న సమస్యను పరిష్కరించుకోలేక చావే పరిష్కారమని భావిస్తున్నారు.

కలసి పని చేద్దాం ఆత్మహత్యలు నివారిద్దాం ఆత్మహత్యల నివారణకు సామాజిక చైతన్యం తీసుకువద్దాం
ఆత్మహత్యను అడ్డుకోవడంలో కలిసి పనిచేయడం చాలా కీలకమైంది. ఆత్మహత్య ఆలోచనలను   అడ్డుకోవడం, ఆత్మహత్యల నివారణలో  కుటుంబ సభ్యులు,  స్నేహితులు, సహోద్యోగులు, సమాజంలోని  విద్యావేత్తలు, మత నాయకులు, ఆరోగ్య నిపుణులు, రాజకీయ నాయకులు, కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాల  కృషి చాలా అవసరం. ఆత్మహత్యకు బాధపడుతున్న వారు స్వయంగా సహాయం కోరుకునే అవకాశం లేదు, కాబట్టి తల్లిదండ్రులు, ఇంటి ఆవరణలోని మిత్రులు, పాఠశాల లేదా కాలేజి ఉపాధ్యాయులు, బందువులు, సహచరులు ఆత్మహత్యకు హెచ్చరిక సూచనలు గ్రహించి ముందుగా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాద్యత గుర్తించాల్సిన అవసరం ఉంది.

అత్యవసర పరిస్థితుల్లో తెలియని వ్యక్తులను కూడా సహాయం అడుగుతాం. అలాంటిది జీవితంలోని కొన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి సహాయం అడగటానికి ఇబ్బందేముంది? ఎవరూ జీవితంలో అన్ని బాధ్యతలనూ ఒంటరిగా తలకెత్తుకోలేరు. అందుకని భాగస్వామినుంచో, స్నేహితుడి నుంచో, కుటుంబ సుభ్యుల నుంచో, సహోద్యోగుల నుంచి సహాయం తీసుకోవడం తప్పుకాదు. ఆత్మహత్యకు పాల్పడే చర్యలను గుర్తించినపుడు వారి కోసం ప్రత్యేక మైన చర్యలు తీసుకోవాలి. ఆహ్లాదకరమైన వాతావరణంను కల్పించడం. చావు ద్వారానే సమస్యకు పరిష్కారం రాదు అనే విషయాన్ని గుర్తంపచేయాలి. జీవిత విలువలను గుర్తింపచేసేవిధంగా ప్రేరణ కల్పించాలి.అభయ హస్తం అందించాలి. ఒంటరిగా ఉండకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి సంభాషణను కొనసాగించేలా చర్యలు ఉండాలి. సైకాలజిస్ట్‌ ను కూడా స్నెహితులు గా గుర్తించి తగు సలహాలు సూచనలు తీసుకొనేవిధంగా ప్రోత్సహించాలి.
image.png
 డా. అట్ల శ్రీనివాస్‌ రెడ్డి రిహాబిలిటేషన్‌ సైకాలజిస్ట్‌,
స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ మెంటల్లీ రీటార్డేషన్‌, ఫ్యామిలీ కౌన్సెలర్‌ 9703935321

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *