- రాష్ట్ర ప్రజలు సోనియా రుణం తీర్చుకోవాలి
- దొరల దోపిడీ నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి
- ఓనమాలు రానివారు రాజకీయాల్లో ఉన్నారు
- పాలకుర్తికి గొప్ప చరిత్ర ఉన్నది:టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
జనగామ పాలకుర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : కుటుంబంలో మరణాలు జరిగితే బాధ ఎలా ఉంటుందో తెలిసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం కోల్పోతామని తెలిసినా తెలంగాణను ఇచ్చిన మహానేత సోనియా గాంధీ అని టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణను తెచ్చామని చెప్తూ అధికారంలోకి వొచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీశాడని మండిపడ్డారు. దోపిడీ దొరలపాలన నుండి తెలంగాణను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ అధికారంలోకి తీసుకుని రావాలని ప్రజలను కోరారు. బుధవారం దేవరుప్పుల మండల కేంద్రంలో హత్ సే జోడు యాత్రను ప్రారంభించి ధర్మాపురం మైలారం విష్ణురు విష్ణు మీదుగా పాలకుర్తికి చేరుకొని మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో కలిసి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
పాదయాత్రలో ఆయా గ్రామాల్లోని ప్రజలను పలకరిస్తూ వారి బాధలను తెలుసుకుంటూ… పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి తీసుకు రావాలని కోరుతూ పాదయాత్రను కొనసాగించారు. పాదయాత్రలో రేవంత్ రెడ్డికి ఆయా గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో..డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలుకుతూ వెంట నడిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… ప్రపంచ ప్రజాస్వామికులంతా కలిసి కుల మతాలను, పార్టీలను పక్కనపెట్టి పోరాటాలు చేసి తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. కుటుంబంలో అత్తను, భర్తను కోల్పోయిన బాధను అనుభవించిన తల్లి సోనియా గాంధీ తెలంగాణ అమరవీరుల కుటుంబాల బాధలను గుర్తించి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం కోల్పోతామని తెలిసినప్పటికీ తెలంగాణను ఇచ్చిన ఘనత సోనియా గాంధీదని అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి అనంతరం తమ హామీని వాయిదా వేయించిన నేతులు ఉన్నారని విమర్శించారు. పాలకుర్తిది ఎంతో గొప్ప చరిత్ర గల గడ్డ అని కొనియాడారు. బొమ్మెర పోతన, పాలకొల్లు సోమనాథుడు, వాల్మీకి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య వంటి మహానేతలకు జన్మనిచ్చిన పోరాటాల గడ్డయని కొనియాడారు.
భూ పోరాటాలు సాయుధ పోరాటాలు చేసిన వీరులను గన్న గడ్డ పాలకుర్తి అన్నారు. అటువంటి గడ్డపై ఓనమాలు రానీ నాయకుడు రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే దయాకర్ రావు నమ్మక ద్రోహి అని విమర్శించారు. నాడు సుధాకర్ రావుకు వెన్నుపోటు పొడిచాడని ఎద్దేవా చేశారు. పాలకుర్తిలో డిగ్రీ కాలేజీ, వంద పడకల హాస్పిటల్ ఏమయ్యాయని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే రిజర్వాయర్లను వాయిదాలు వేస్తూ వొచ్చాడని ఆరోపించారు. పాలకుర్తి చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించాలని కుట్రలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో అధికారంలోకి వొచ్చిన టిఆర్ఎస్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, రాష్ట్రాన్ని ఆపుల పాలు చేసింద•ని విమర్శించారు.
దళిత బంధు, మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒకే విడుతలో రైతు రుణమాఫీ రెండు లక్షలు, రైతులు పండించిన ప్రతి దాన్ని గింజలను చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చేస్తామని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలలో లక్ష ఉద్యోగాలను మొదటి ఏడాదిలోనే నోటిఫికేషన్లు ఇచ్చి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లింపు చేసి విద్యార్థులను ఆదుకుంటామన్నారు. ఆరోగ్య శ్రీలో రెండు లక్షలు కాకుండా ఐదు లక్షలకు పెంచుతామన్నారు. ఇన్ని మంచి పనులు కాంగ్రెస్ చేస్తామని తెలుపుతున్నప్పుడు ప్రజలు కూడా ఒక మంచి పని చేయాలి కదా అంటూ…కాంగ్రెస్‌కు వోటు వేసి అధికారంలోకి వొచ్చేలా దీవించాలని కోరారు.
తెలంగాణను తెచ్చానని చెప్పిన కేసీఆర్‌కి రెండుసార్లు అధికారం ఇస్తే…రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి పనిచేయాలని కోరారు. పదేళ్లుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కుంటూ పార్టీని, పార్టీ జెండా మోస్తూ వొస్తున్నామన్నారు. ఈ పది నెలలు కష్టపడి ప్రతి కార్యకర్త పనిచేస్తూ ప్రతి ఇంటికి కాంగ్రెస్ చేయబోయే పనులను వివరించి వోటు అడగాలని సూచించారు. పాలకుర్తిలో కాంగ్రెస్‌ను గెలిపించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తానూ కష్టపడతానని తెలిపారు. కార్యక్రమంలో బామ్మర్ది సాంబయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, హమ్యా డాక్టర్ లక్ష్మీనారాయణ, మాజీ జడ్పీ చైర్మన్ ధన్వంతి, పాలకుర్తి మండల పార్టీ అధ్యక్షులు కుమారు, దేవరుప్పుల అధ్యక్షులు కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.




