అణువణువునా ఆవరించిన అవినీతి

నేడు అవినీతి లేని రాజ్యం, అక్రమార్కుల్లేని వ్యవస్థలపై మనం కలలు కనడం దుస్సాహసమే. ఓ అధికారి నుంచి బంట్రోతు దాకా ఈ దుష్క•తానికి అతీతులు కాకపోవడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అవినీతి, అక్రమాలపై జనం ఎంతో ఆసక్తిగా వింటారు… కంటారు. మామూలు వార్తల కన్నా ఈ వార్తలకే ర్యాంకింగ్‌లు, ప్రియారిటీలు లభిస్తాయంటే అతిశయోక్తి కాదు. రోజూ పేపర్లు తిరగేస్తే ఏ మూలనో తప్పకుండా అక్రమ మరక ఉంటుంది. జనం ఇంతగా ఆ వార్తలకు స్పందిస్తున్నారంటే ఆ  మహత్కార్యాలు ఎంత గొప్పవో తెలుసుకోవాలన్న ఆసక్తే కారణం. అందుకే అక్రమార్కుల, అవినీతిపరుల చరిత్ర బయల్పడినప్పుడు జనం సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు. ఔరా అనుకుంటారు. ఆపై సరే అని సరిపుచ్చుకుంటారు. ఎవరు తక్కువేంటి? అందరూ అందరే… దీన్ని కట్టడి చేసేదెవరు? అంతం చేసేదెవరు? పోనీ తగ్గించేదెవరు? అన్నీ జవాబు దొరుకని ప్రశ్నలే. మెదళ్లను తొలుస్తాయి.

ఎందుకంటే ఇదో రాచపుండు లాంటిది. మానదు. కాల్చుకు తింటుంది… అంటూ నిట్టూర్పులే మిగులుతాయి. ఓ పెద్ద తిమింగలం దొరికింది… ఓ పెద్దాయన చిక్కాడంటూ ఆ కాసేపు లేదా ఆ ఒకటి, రెండు రోజులే గుర్తుంచుకుంటారు. ఆపై వదిలేస్తారు. అందుకే పబ్లిక్‌ ‌మెమొరీ ఈజ్‌ ‌వెరీ షార్ట్ అన్నది నిజమేననిపిస్తుంది. పట్టుబడిన, దిక్కుతోచక దొరికిన ఆ అవినీతి పరులు నరసింహారెడ్డి, సుబ్బారావు, ప్రదీప్‌కుమార్‌ ‌ప్రహ్లాద్‌రావుల పేర్లు  ఎవరికి గుర్తుంటాయి. అయినా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమేముందిలే అనుకుంటూ సకల జనం మిన్నకుండిపోతారు. వదిలేస్తారు. సంస్థాగతంగా, వ్యవస్థలకణుగుణంగా రావాల్సిన, ఉండాల్సిన ప్రామాణికాలేమిటి? వీటిపై ఆలోచించేది ఎంతమంది? అని మనం ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదు. ఇటీవల కాలంలో దొరికిన అక్రమార్కుల అసలు స్వరూపం కళ్లుగగుర్పొడుస్తున్నాయి. అంతెందుకు ఒకప్పుడు వేలు, లక్షల్లో ఈ లెక్కలుండేవి. ఇప్పుడైతే కోటలు దాటి కోట్లకు కోట్ల దాకా పడగ విప్పుతున్నాయి.

కరోనా పుణ్యమా అని ఆకాలంలో వ్యవస్థాపరమైన, వ్యక్తిగత లావాదేవీలు తగ్గిపోయాయి. ఆఫీసుల చుట్టూ తిరగడం, మధ్యవర్తులను ఆశ్రయించటం అప్పట్లో తగ్గింది. ఇదే సందర్భంలో అవినీతికి ఆశ్రయమిచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. వీటికి తోడు ఇటీవల కాలంలో సాంకేతికత దూసుకుపోవడం వల్ల కూడా కొంతమేర అవినీతికి ఆస్కారమిచ్చే వెసులుబాటు కూడా కిందకు దిగింది. ఇంటర్‌నెట్‌ ‌సేవలను బాగా ప్రాచుర్యంలోకి తేవడంతో కొద్దిపాటి పనులకైనా లంచాలిచ్చే సంస్క•తికి బ్రేకులు పడ్డాయి. అయితే కరోనా పిమ్మట షరా మామూలే. పైగా ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే…పలు వ్యవహారాలు వలంటీర్‌ ‌వ్యవస్థకు అప్పజెప్పడంతో ఎంతో కొంత అమ్యామ్యాలకు అడ్డుకట్టపడిందని పరిశీలకులు చెబుతున్నారు. ఇక అలవాటు పడ్డ లంచావతారాలు అవినీతి రాగాన్ని ఆలపిస్తూనే ఉండటం గమనార్హం. అవినీతి అంతం  లేదా నియంత్రణ ఉట్టి మాటేనని సకల జనులు ముక్తాయిస్తున్నారు.

దేవాదాయశాఖలో ఆ మధ్య ఓ తిమింగలం దొరికిందని, ఆయన పేరు ఆజాద్‌ అని పేర్కొంటూ ఆ… జాదు! అంటూ పెద్దపెద్ద శీర్షికలతో వచ్చిన ఆయన రూ.150 కోట్ల అక్రమాలను జనం చదివారు. అసలు వీరు ఇప్పుడే పుట్టుకొచ్చారా? అని ప్రశ్నించుకొంటే సమాధానం కన్పించదు. ఆజాద్‌ ఆ ఆస్తుల్ని కూడబెట్టాలంటే కనీసం ఓ పదో, ఇరవై ఏళ్లు పడుతుంది కదా! ఆయన తిమ్మిని బమ్మిని చేయాలంటే కొంత సమయం కావాలి. స్కెచ్‌లు గీసుకుని సఫలీకృతుడవ్వాలంటే ఎన్ని మార్గాలు ఎంచుకోవాలి? ఎంత సాహసం చేయాలి? అతను ఇలా ప్రజాధనం (మన మనుకు ంటున్నట్లు) కూడబెట్టాడంటే ఇన్నాళ్లు, ఇన్నేళ్లు ఎలా సాధ్యమైంది? అందరికీ కాకున్నా ఆయన చుట్టూ తిరిగే, నడిచే యంత్రాంగం, మనుషులకైనా ఎంతో కొంత తెలిసుండాలి. అది అక్రమ సంపదని తెలిసీ స్పందన వెలుగు చూడలేదంటే,  బయటకు రావటానికి బోలెడు టైము పట్టిందంటే ఏమనుకోవాలి. మన వ్యవస్థ లేదా ప్రభుత్వ యంత్రాంగం లోపమా లేక పౌర సమాజం చూసి కూడా మనకెందుకులే అనుకుంటున్నారనుకోవాలో తెలియడం లేదు. లేకుంటే సంబంధితులు ఉప్పందించిన వారి పని పడతారేమో అని భయాందోళనలు రేకెత్తడమో కావచ్చు. అసలు అవినీతి తప్పు… దాని జోలికెళ్లడం సరికాదని సర్వజనాలు తలచినప్పుడే అంతో ఇంతో కట్టడికి అవకాశముంటుంది.
– చెన్నుపాటి రామారావు,  విశ్రాంత పాత్రికేయుడు, సామాజిక విశ్లేషకుడు
9959021483.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *