హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 06 : భారత రాజ్యాంగ పితామహుడు డా. భీం రావు రంజీ అంబేద్కర్ అణగారిన వర్గాల గొంతుక అని, సమాజంలో సామాజికంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ కొనియాడారు. సామాజిక న్యాయం సృష్టికర్త డా. బిఆర్ అంబెడ్కర్ 67వ వర్ధంతి సందర్బంగా బుధవారం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబెడ్కర్ విగ్రహానికి డాక్టర్ దిడ్డి సుధాకర్, ఆప్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్ తదితరులు ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, డా. అంబేద్కర్ చెప్పిన సూత్రాలను పాటిస్తామని ప్రమాణం చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాలకు విద్య, అధికారం లభించిన తర్వాత బానిసత్వం, అన్యాయం నిర్మూలించబడుతుందని అంబేద్కర్ విశ్వసించారని పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ పిల్లలను స్వతంత్రులుగా మార్చడానికి వారికి మంచి విద్యను అందించాలని కలలు కన్నాడని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అంబెడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని, నిరుపేద కుటుంబాల పిల్లలకు విద్యనందించేందుకు అంకితభావంతో వ్యవహరిస్తోందని అయన తెలిపారు. సామాజికంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన బాబా సాహెబ్ అంబెడ్కర్ బోధనలను అనుసరించే ఏకైక పార్టీ దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే అని అయన అన్నారు. భారతదేశ సామాజిక, రాజకీయ దృశ్యాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన దూరదృష్టి గల అంబెడ్కర్ వంటి నాయకుడి జీవితం, సేవలను ప్రజలందరూ స్మరించుకోవలసిన అవసరం ఉందని డాక్టర్ దిడ్డి సుధాకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆప్ మహిళా విభాగం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి హేమ జిల్లోజు, నర్సింగ్ యమునా గౌడ్, ఆర్థిక కార్యదర్శి మంచాల శ్రీకాంత్, వికలాంగుల కమిటీ అధ్యక్షులు దర్శనం రమేష్, అధికార ప్రతినిధి జావీద్ షరీఫ్, నేతలు శ్రీనివాస్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
అణగారిన వర్గాల గొంతుక బాబాసాహెబ్ అంబేద్కర్





