- ప్రారంభించిన ప్రధాని మోదీ
- మొరాకో భూకంప మృతులకు నివాళి
- జీ20 దేశాల కూటమిలో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం
న్యూ దిల్లీ, సెప్టెంబర్ 9 : భారత్ తొలిసారిగా అతిథ్యమిస్తున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు దిల్లీ వేదికగా శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సదస్సు ప్రారంభించారు. తన ప్రసంగంతో మోదీ సదస్సును ప్రారంభించారు. తన ప్రారంభోపన్యాసంలో ప్రధాని మొరాకోలో సంభవించిన భూకంపంపై స్పందించారు. మొరాకోలో భూకంపం సంభవించడం చాలా విరాచకరమని అన్నారు. భూకంపంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మొరాకోకు భారత్ అండగా ఉంటుందని తెలిపారు. అంతకుముందు జీ-20 సదస్సు జరిగే భారత్ మండపం వద్ద.. ప్రపంచ నేతలకు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20 దేశాల కూటమిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు.
ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగల దేశాలు కలిసి జీ20గా 1999లో ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత ఈ కూటమిలో ఇతర దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించలేదు. జీ20 సమావేశాలు శని, ఆదివారాల్లో న్యూ దిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంకా ప్రధాని మోదీ మాట్లాడుతూ, అందరితో కలిసి సబ్కా సాథ్ అనే భావానికి అనుగుణంగా ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత దేశం ప్రతిపాదిస్తుందని తెలిపారు. ఈ ప్రతిపాదనను అందరూ అంగీకరిస్తారని నమ్ముతున్నానని చెప్పారు. ‘వి• అంగీకారంతో…‘ అని చెప్తూ, జీ20లోకి ఆఫ్రికన్ యూనియన్ ప్రవేశించినట్లు తెలియజేస్తూ, ఆయన ఓ చిన్న సుత్తితో మూడుసార్లు కొట్టారు. ‘మనం పని ప్రారంభించే ముందు, శాశ్వత సభ్యునిగా తన స్థానాన్ని స్వీకరించవలసినదిగా ఆఫ్రికన్ యూనియన్ ప్రెసిడెంట్‌ను ఆహ్వానిస్తున్నాను‘ అని చెప్పారు.
అనంతరం విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ప్రస్తుత ఆఫ్రికన్ యూనియన్ చైర్ పర్సన్, కొమొరోస్ ప్రెసిడెంట్ అజలి అసౌమనిని సాదరంగా ఆయనకు కేటాయించిన ఆసనం వద్దకు తీసుకొచ్చారు. అసౌమనిని మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, స్వాగతం పలికారు. ఆఫ్రికన్ యూనియన్ 2002లో ప్రారంభమైంది. దీనిని జీ20లో చేర్చుకోవడం గురించి ప్రస్తుత జీ20 దేశాల నేతల సమావేశం ముసాయిదా ప్రకటనలో చేర్చినట్లు తెల్తుంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్‌కు జీ20లో సభ్యత్వం ఉంది. 27 దేశాల యూరోపియన్ యూనియన్‌తో సమాన హోదాను ఆఫ్రికన్ యూనియన్‌కు కల్పించారు. ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత సభ్యత్వం పొందినప్పటికీ జీ20 పేరులో మార్పు ఉండబోదని తెలుస్తుంది. ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో సంపూర్ణ సభ్యత్వం ఇవ్వాలని మోదీ జూన్‌లో ఈ కూటమిలోని దేశాలకు లేఖలు రాశారు. ఈ ప్రతిపాదనను వేర్వేరు కారణాలతో ఈయూ, చైనా, రష్యా సమర్థించాయి.




