- తెలంగాణలో మొదటి పది ర్యాంకుల్లో ఒక్క యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చోటు
- వంద ర్యాంకుల్లో ఉస్మానియా, ట్రిపుల్ ఐటిలకు మాత్రమే చోటు
- ఉన్నత విద్యలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తమిళనాడు, దిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు
ప్రపంచ వ్యాప్తంగా 31,097 యూనివర్సిటీలు ఉండగా భారత దేశ వ్యాప్తంగా 1,113 కేంద్రీయ, రాష్ట్ర, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. దేశంలో దాదాపు 43,000 కళాశాలలు, 4.13 కోట్లకు పైగా విద్యార్థినీ విద్యార్థులు యూనివర్సిటీ విద్యను అభ్యసిస్తున్నట్లు వివరాలు తెలుపుతున్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ‘‘నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్, ఎన్ఐఆర్యఫ్-2023‘‘ చేసిన అధ్యయన ఫలితాలను ఇటీవల విడుదల చేసి దేశంలోని అనేక యూనివర్సిటీ, కళాశాలల ర్యాకింగ్స్‌ను శాస్త్రీయంగా నిర్ణయించి జాబితాను విడుదల చేశారు. అత్యుత్తమ 100 ఉన్నత విద్య కళాశాలల్లో తమిళనాడుకు చెందినవి అధికంగా ఉండడం గమనించారు. టీచింగ్/లెర్నింగ్/ రిసోర్సెస్ (40 శాతం వేయిటేజ్), రీసర్చ్ అండ్ ఫ్రొఫెషనల్ ప్రాక్టీస్(15 శాతం), గ్రాడ్యుయేషన్ అవుట్‌కమ్(25 శాతం), అవుట్‌రీచ్ అండ్ ఇన్‌క్లూజివిటీ(10 శాతం), పర్సెప్షన్ (10 శాతం) అనబడే పారామీటర్స్‌ను పరిగణనలోకి తీసుకొని వివిధ కళాశాలలు, యూనివర్సిటీల ర్యాకింగ్స్ నిర్ణయించారు. 2023 ర్యాంకింగ్స్‌లో 2,746 కళాశాలలు మాత్రమే పాల్గొనగా, ఇతర కళాశాలల్లో కనీస వసతులు, సరైన బోధన విధానాలు లేవని స్పష్టం అవుతున్నది.
ఇండియాలోని అత్యుత్తమ కళాశాలలు
అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన 100 కళాశాలల్లో మరండా హౌజ్ కళాశాల(దిల్లీ), హిందూ కళాశాల (దిల్లీ), ప్రసెన్సీ కళాశాల (చెన్నై), పిఎస్జిఆర్ క్రిష్ణమ్మల్ మహిళా కళాశాల(కోయంబత్తూరు), సెయింట్ గ్జావియర్ కళాశాల(కలకత్తా), ఆత్మారామ్ సనాతన్ ధర్మ్ కళాశాల (దిల్లీ), లయోలా కళాశాల(చెన్నై), రామకృష్ణ మిషన్ వివేకానంద సెంటినరీ కళాశాల(పశ్చిమ బెంగాల్), కిరోరీమల్ కళాశాల(దిల్లీ), లేడీ శ్రీరామ్ మహిళా కళాశాల(దిల్లీ) తొలి 10 ర్యాంకులు పొందాయి. తొలి 100 అత్యుత్తమ కళాశాలల్లో తెలంగాణకు చెందిన ఒకే ఒక సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల(హైదరాబాదు)కు 98వ ర్యాంకు లభించడం, ఆంధప్రదేశ్ నుంచి ఒక్క కళాశాల కూడా చోటు దక్కించుకోక పోవడం విచారకరం. తొలి 100 ర్యాంకుల్లో తమిళనాడుకు చెందిన 35 కళాశాలలు, దిల్లీకి చెందిన 32, కేరళకు చెణదిన 14, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 08 కళాశాలలు ఉన్నాయి. అత్యుత్తమ 100 కళాశాలల్లో తమిళనాడు/ఢిల్లీ/కేరళ/పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 89 శాతం కాలేజీలు ఉండడం విశేషం.
ఇండియాలో అత్యుత్తమ యూనివర్సిటీలు
ఎన్ఐఆర్ఎఫ్ విడుదల చేసిన అత్యుత్తమ 100 యూనివర్సిటీల జాబితాలో ఐఐఎస్సి(బెంగుళూరు), జెఎన్యూ (దిల్లీ), జామియా మిలియన్ ఇస్లామియా (దిల్లీ), జాదవ్‌పూర్ యూనివర్సిటీ (కలకత్తా, పశ్చిమ బెంగాల్), బెనారస్ హిందూ యూనివర్సిటీ (వారణాసి, యూపీ), మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్(మణిపాల్, కర్నాటక), అమ్రిత విశ్వ విద్యాపీఠ్(కొయంబత్తూరు, తమిళనాడు), వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వెల్లుర్, తమిళనాడు), అలిధడ్ ముస్లిమ్ యూనివర్సిటీ(అలిఘడ్, యూపీ), యునివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(హైదరాబాదు, తెలంగాణ) తొలి 10 ర్యాంకులు పొందాయని తెలుస్తున్నది. తొలి 100 యూనివర్సిటీల జాబితాలో ఆంధప్రదేశ్‌కు చెందిన కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ వడ్డేశ్వరం, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ఉండగా తెలంగాణకు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ, ట్రిపుల్‌ఐటి హైదరాబాదు మాత్రమే చోటు దక్కించుకున్నాయి.
ఇండియాలో ఉన్నత విద్యా సంస్థల ఓవరాల్ ర్యాంకింగ్స్
ఐఐటి మద్రాస్, ఐఐఎస్సీ బెంగుళూరు, ఐఐటి దిల్లీ, ఐఐటి బాంబే, ఐఐటి కాన్పూర్, ఏఐఐఎంఎస్ దిల్లీ, ఐఐటి ఖరగ్‌పూర్, ఐఐటి రూర్కీ, ఐఐటి గౌహతి, జెఎన్యూ ఢిల్లీలు ఓవర్ఆల్ ర్యాంకింగ్స్‌లో తొలి 10 స్థానాలను ఆక్రమించాయి. ఈ జాబితాలోని తొలి 100 సంస్థల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఐటి హైదరాబాదు, యునివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, కె ఎల్ యునివర్సిటీ, ఎన్ఐటి వరంగల్, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యతో పాటు పరిశోధనల్లో మద్రాస్/ఢిల్లీ/బాంబే/కాన్పూ
ప్రపంచంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయాలు
‘‘క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2023‘‘ ప్రకారం ప్రపంచంలోనే అత్యున్నత 10 యూనివర్సిటీల్లో మ్యాసెచ్యూట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటి), యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీ, క్యాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూసిఎల్, ఈటిహెచ్ జూరిచ్, యూనివర్సిటీ ఆఫ్ చికాగోలు నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ ముందున్నాయి. భారత్‌లో ఉన్నత విద్యకు చెందిన అత్యుత్తమ యూనివర్సిటీలు, కళాశాలల్లో తమిళనాడు, దిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఇతర భారత రాష్ట్రాలు/యూటీలకు మార్గదర్శనం చేస్తున్నాయి. పేరుకు గొప్ప, నాణ్యతకు దిబ్బగా మారిన తెలుగు రాష్ట్రాల కళాశాలలు, యూనివర్సిటీలు వెనుకంజలో ఉండడం అత్యంత విచారకరం. యూనివర్సిటీలు, కళాశాలలు నెలకొల్పడంతో ఉన్న శ్రద్ధ వాటి నాణ్యతలను నెలకొల్పడంలో దారుణంగా వెనుకబడి ఉన్నాయి. రాసి కన్న వాసికి, సంఖ్య కన్న నాణ్యతకు పట్టం కట్టడానికి ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. ఇదే విధంగా నిర్లక్ష్యం చేస్తే యువభారత యూనివర్సిటీలు, కళాశాలలు నిరుద్యోగాన్ని పెంచి పోషించే కేంద్రాలుగా మాత్రమే మిగిలి పోతాయని తెలుసుకోవాలి.




