దీప‌శిఖ‌గా మారి  చీక‌టిని చీలుస్తూ  వెలుగై ముందుకు న‌డిపించే  మార్గ‌ద‌ర్శి క‌వి. బాధ‌ల బ‌రువుల్ని మోస్తూ మొక్కవోని ఆత్మ‌నిబ్బ‌రాన్ని ప్ర‌క‌టించే క‌విత్వంలో క‌వి సూర్యుడై ప్ర‌చండంగా ప్ర‌జ్వ‌రిల్లుతాడు. స‌మున్న‌త వ్య‌క్తిత్వంతో త‌లెత్తుకు చూసే కవిత్వం శాసించ‌గ‌లిగే స్థితిని వశం చేసుకుంటుంది. ఉద్విగ్ర‌మైన హృద‌యంలోంచి క‌విత్వం ఉవ్వెత్తున ఎగిసి ప‌డుతుంది. క‌విత్వం సున్నితంగా, ప‌రిమ‌ళంగా, స‌హ‌నంగా క‌నిపిస్తూనే ఎంతో ఆగ్ర‌హంగా మారి అంత‌రంగ సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తుంది. అక్ష‌రాన్ని న‌మ్ముకున్న క‌వికి అదే పెద్ద ఆయుధ‌మ‌వుతుంది. అంత‌రంగ భావాలకు న్యాయం చేకూర్చే అరుదైన అక్ష‌రాల‌ను కూర్చుకొని క‌వి క‌విత్వాన్ని ప‌ద‌నుతొక్కిస్తాడు. వాన ఉధృతంగా కురిసి వెల‌సిన సాయంకాల‌పు స్వ‌చ్ఛ‌త‌లా, చెద‌ర‌ని స్మృతిలా క‌విత్వం మిగిలిపోవాల‌ని భావిస్తూ అక్షర సేద్యం సాగిస్తున్న ఆశావాదక‌వి గ‌జ‌వెల్లి ద‌శ‌ర‌థరామ‌య్య.  అక్షర గుళిక‌లు అన్న భావాత్మ‌క, ప్రేర‌ణాత్మ‌క‌, ఆలోచ‌నాత్మ‌క సంపుటిని  ఆయ‌న వెలువ‌రించారు. ప్ర‌జా హిత‌మే  నీ మ‌తంగ/  తొలిమెట్టుపై అడుగు పెట్టు/  క‌ర్మ ర‌థాన్ని క‌ద‌లించు/  క్రియాశీల ప‌దంపైన అని త‌న క‌వితాభిమ‌తాన్ని ప్ర‌క‌టించారు. కెరటాలు తాకి తాకి/  శిల ప‌లు రూపాంత‌రాలు చెంద‌గా గ్రేట్ ఓషన్ ప‌య‌న‌మైంద‌ని చెప్పారు. ఆకులు రాలిన‌టుల/ వ‌య‌స్సు పూరేకులు రాలిపోయే చూడు అని కాలక్ర‌మ మార్పుల‌ను లోతైన దృష్టితో వెల్ల‌డించారు. అవినీతి యుద్ధాల‌ను అంత‌మొందించ‌గా త‌ర‌లిర‌మ్మని భార‌తీయుల‌కు పిలుపునిచ్చారు. తెలుగు అక్ష‌రాలు విను వీధుల్లో విరాజిల్లే శోభ‌లు అని కీర్తించారు. నా తెలంగాణ/  ప్ర‌జ‌ల‌ను నిద్దుర లేపిన/  విప్ల‌వ ధాత్రి అని ప్ర‌స్తుతించారు. సుమబాల‌ల పరిమ‌ళాలు/  నిండు పున్న‌మి పండు వెన్నెల ప్ర‌భ‌ల‌ను ప్ర‌ణ‌య వీచిక చేసి చూపారు. ఆకురాలు తోట‌లోన అగుపించెను కోకిల‌మ్మ అని న‌వ వ‌త్స‌రానికి ఆహ్వానం ప‌లికారు. తెర‌లుతెరలుగా చీక‌టి పొర తొల‌గి తూరుపున వెలుతురమ్మ పుట్టి త‌లుపు  త‌ట్టి శ్రామిక జ‌గ‌తిని లెమ్మంది అంటూ ప్ర‌భాత గీతాన్ని ఆల‌పించారు. నాటి, నేటి భార‌తాన్ని ప్ర‌పంచీక‌ర‌ణ దృష్టితో విశ్లేషించారు. శాంతి వీణాతంత్రులు తెగి విశ్వం క‌న్నీరు ఒలికింద‌ని వేద‌న ప‌డ్డారు. శ్ర‌మ జీవుల బ‌తుకుల్లో చేదు నిండుతున్న‌ద‌ని బాధ ప‌డ్డారు.విప్ల‌వం పండించేందుకు స‌మ‌రానికి క‌ద‌లి క‌లిసి ర‌మ్మ‌న్నారు. ఆజాద్ భ‌గ‌త్ సింగ్ మ‌ళ్లీ పుట్టి మ‌రో  స్వాతంత్ర్య పోరును న‌డ‌పాల‌ని అన్నారు. విశ్ర‌మించ‌కుండా విక్ర‌మిస్తే మ‌నిషి వేగు చుక్క‌లా ప్ర‌కాశిస్తాడ‌ని అన్నారు. గాంధీ రాజ్యంలో నెత్తుటేరులు పారుతున్నాయ‌ని అంటూ మ‌రోసారి  మ‌హాత్ముణ్ణి జ‌న్మించ‌మ‌ని వేడుకున్నారు. స‌మ‌స్య‌ల విష  విల‌యంలో  చిక్కిన రైత‌న్న కూలీగా మారి అర్థాక‌లితో ఎండిన ధైన్యాన్ని కాచివ‌డ‌బోశారు. గూడు  లేని గువ్వ‌ల‌కు, నీడ లేని నిర్భాగ్యుల‌కు దైర్యాన్ని నూరిపోశారు. చురుకుద‌నం, చైత‌న్యాన్ని మ‌నుషుల్లో నింప‌మ‌న్నారు. అధైర్య ప‌డ‌కుండా గర్జించ‌మ‌న్నారు. ఆరిపోని అభ్యుద‌య దీపాల‌తో లోకం కాంతి లోగిలి కావాల‌ని ఆకాంక్షించారు. శ్ర‌మ శ‌క్తుల మహోన్న‌తకు  స‌లాం చెప్పారు. ప్ర‌పంచ శాంతి కోసం అంద‌రిది ఒకే బాట కావాల‌ని అన్నారు.స‌క‌ల మాన‌వశాంతి ఇప్ప‌టి త‌క్షణ అవ‌స‌ర‌మ‌ని నొక్కి చెప్పారు.

విచ్ఛిన్న‌క‌ర‌ శ‌క్తుల విష‌పు కోర‌ల్ని ఊడ‌బెర‌క‌మ‌న్నారు. క‌వులు స‌మభావ‌పు  దీప్తులుగా ముందుకు సాగాల‌ని తెలిపారు. శ్రామిక జాతి జెండాను మండే కార్మికులు గుండెగా అక్ష‌రీక‌రించారు. ప్ర‌జాస్వామ్యం అప‌హాస్య‌మ‌వుతుందంటూ బాధ‌ప‌డ్డారు. చాలీచాల‌ని జీతాల‌ను ఇస్తూ జీవితాల‌తో యాజ‌మాన్యాలు ఆడుకుంటుంటే శ్ర‌మ జీవుల డొక్క‌లు బుక్క దొర‌క‌క‌ ఎండి పోతున్నాయ‌ని అన్నారు. తల్లి నేల విముక్తి కోసం నెత్తురు ధార‌పోసిన భార‌తీయ అమ‌ర‌వీరుల‌ను క‌ళ్ల‌క‌ద్దుకొని క‌వితామాలిక‌ను  నివాళిగా స‌మ‌ర్పించారు. మ‌స‌క చీక‌టులు తొల‌గాలంటే అక్ష‌ర దీపం వెల‌గాల‌న్నారు. స్వార్థం పెరిగిన మ‌నిషి సామ్య‌వాదాన్ని ప‌క్క‌కు నెట్టాడ‌ని ఆగ్ర‌హించారు. సామ్రాజ్యవాదుల ఆగ‌డాల‌ను  ఖండించారు. మ‌నిషి తెలివి ఉన్న మూర్ఖుడిలా మారిపోతున్నాడ‌ని అన్నారు. చ‌రిత్ర సాక్షిగా క‌ళ్ల ముందు మ‌నిషి సంస్కృతి నిలిచింద‌ని చెప్పారు. తుది స‌మ‌రంతో  స‌మ‌స్య‌ల‌కు చ‌ర‌మ‌గీతం పాడ‌మ‌న్నారు. ఉద్య‌మాల‌కు  ఊపు అక్ష‌ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. దెబ్బ‌తిన్న మ‌నిషిని మ‌ళ్లీ చిగురించ‌మ‌ని చెబుతూ జీవితం వైకుంఠ‌పాళి అన్నారు. బానిస బ‌తుకులు  ప్ర‌జ‌ల‌కు, రైతుల‌కు ఇంకెన్నాళ్లు అని ప్ర‌శ్నించారు. నిప్పులా గుప్పుమంటూ మండ‌మ‌ని స‌మ‌స్య‌ల్లో చిక్కిన మ‌నిషిని ఉద్దేశించి చెప్పారు. సిరులు సింగారించి కురులార‌బోసిన ఈ ప‌సిడి నేల ఎంతో చ‌క్క‌నిద‌ని తెలంగాణ ప్రాంత ప్రాభ‌వాన్ని అక్ష‌ర‌బ‌ద్ధం చేశారు. మ‌హాగ్ని గోళ‌మై మండే మ‌నిషి నిప్పులాంటి స్వ‌చ్ఛ‌త‌గా నిల‌బ‌డ‌తాడ‌ని చెప్పారు. కొత్త వెలుగుకై ఆశ‌యాల బావుటాన్ని ఎత్తుకొని నిరీక్షించారు. పోరు తెలంగాణ‌/ మ‌న‌ది వీర తెలంగాణ అని కొనియాడారు. రెక్క‌లిప్పిన చైతన్యంతో అగ్నిపూలు చ‌ల్లుతూ అంతిమ విజ‌యం కోసం పోరాడ‌మ‌న్నారు. నిరాశ‌ను విడ‌చి నూతనోత్సాహంతో క‌ద‌ల‌మ‌న్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు దొడ్డి కొమ‌ర‌య్య‌, చాక‌లి ఐల‌మ్మ‌కు అంజ‌లి ఘ‌టించారు. తెలుగుకు క‌ట్టిన అంద‌మైన జ‌రి అంచు చీర భాషోత్స‌వ‌మ‌ని వ‌ర్ణించారు. జీవితం రంగుల మేళా కావాలన్నారు. మ‌త‌వీణ‌ను శృతి చేస్తే ర‌ణ‌గీతాలే ఆడుకోవాల్సి వ‌స్తుంద‌ని  హెచ్చ‌రించారు. యుద్ధాన్ని జ‌నం వద్ద‌ని అంటున్న‌ద‌ని చెప్పారు. మే డే శ్ర‌మ జీవుల చిరునామా అని వ‌ర్ణించారు. మనిషి వేసే అడుగే మ‌రో మ‌లుపు కావాల‌న్నారు. న‌వ స‌మాజం నిర్మితం కావాల‌ని చెప్పారు. ప‌లుకుతుంది ప్ర‌తికంఠం/  ప్ర‌పంచం నిండార చూడు/  ఒదిగిన‌ట్టి శాంతి స్వ‌రం/  ఉబికి వ‌చ్చు ఉద్వేగం/  స‌మాధులు త‌వ్వ‌బోకు/  స‌త్య ధ్వ‌జానికి నీవు అని స్వార్థం వ‌దిలి మాన‌వ‌త్వంతో మ‌నిషిలాగా ప్ర‌వ‌ర్తించ‌మ‌ని సందేశించారు. మ‌నిషిని అర్థం చేసుకోవ‌డానికే మ‌నిషికి మ‌న‌స్సుకు మ‌ధ్య స‌యోధ్య కుదుర్చ‌డానికే క‌వి ప‌డే త‌ప‌న క‌విత్వ రూపంలో అక్ష‌ర‌బ‌ద్ధ‌మ‌వుతుంద‌న్న స‌త్యాన్ని క‌వి  త‌మ క‌విత‌ల ద్వారా ఎంతో స్ప‌ష్టంగా చెప్పారు. అనివార్యంగా నిత్య‌యుద్ధం చేస్తూ నిరంత‌ర సంఘ‌ర్ష‌ణ‌లు కొట్టుమిట్టాడే మ‌నిషిని, అత‌ని మాన‌వత్వాన్ని గెలిపించడానికి క‌విత్వం అక్ష‌ర‌పోరాటం చేస్తుంద‌న్నారు.
స్వ‌ర్ణ భార‌త ధైన్యాన్ని స‌మ‌స్యాత్మ‌కంగా ఎత్తిచూపారు. చిరు కవిత త‌న‌లో శిశిర‌మై చిగురిస్తూనే ఉంటుంద‌ని చెప్పారు. క‌ర‌వు తొల‌గి బతుకులో వెలుగు నిల‌వాల‌ని అన్నారు. పొంచి ఉన్న మృత్యు కుహ‌రాల‌ను చూసి జాగ్ర‌త్త ప‌డ‌మ‌న్నారు. ఆక‌లి కేక‌లను అక్ష‌ర‌మ‌యం చేసి నోటికాడి కూడును లాగే కుబేరుల‌ను జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రించారు. మనిషిలో మ‌ధురాక్షర ధ్వ‌నుల మాధుర్యంగా మార‌మ‌ని శార‌దాదేవిని వేడుకున్నారు. క‌వి క‌ళ్లు తెర‌చి అన్నింటినీ గ‌మ‌నిస్తూ స్నేహ దీప సుమాల‌ను పూయించి కొత్త జ‌గ‌తికి నిర్వ‌చ‌నంగా మార‌మ‌ని సూచించారు. అనుభూతుల సంద్రంగా అక్ష‌ర గుళిక‌లు ప్ర‌కాశించి సామాజిక చైత‌న్య ప్ర‌యోజ‌నాన్ని నెర‌వేర్చాల‌ని ఆకాంక్షిస్తూనే యుద్ధోన్ముఖ‌త‌నూ ప్ర‌బ‌లంగా వ్య‌క్తం చేశాయి.
            – డా. తిరున‌గ‌రి శ్రీ‌నివాస్  
                              8466053933

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *