అభివృద్ధి, సంక్షేమంలో వైఎస్‌ది చెరగని ముద్ర

~ వైఎస్‌కు సీఎం నివాళులు

దిల్లీ, ప్రజాతంత్ర, జులై 8: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి కొనియాడారు. వైఎస్‌ జయంతిని పురస్కరించుకొని దిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, జలయజ్ఞం, ఔటర్‌ రింగు రోడ్డు, పింఛన్ల పెంపు వంటి కార్యక్రమాలతో ఉమ్మడి రాష్ట్ర ప్రజల్లో వై.ఎస్‌. శాశ్వతంగా నిలిచిపోయారన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని ఆయన చెప్పేవారంటూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సీఎం అన్నారు.

క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానిగా రాణించిన చంద్రశేఖర్‌

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా చంద్రశేఖర్‌ రాణించారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్‌ వర్ధంతిని పురస్కరించుకొని దిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సీఎం నివాళులర్పించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానమంత్రులుగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌ నాయకునిగా పలు విధాన నిర్ణయాల్లో ప్రభుత్వానికి అండగా చంద్రశేఖర్‌ నిలిచారని సీఎం గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీలు డాక్టర్‌ మల్లు రవి, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్‌ రెడ్డి, రోహిన్‌ రెడ్డి పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *