యువత మైదానం బాట పట్టాలి

– క్రీడలే దేశానికి భవిష్యత్

– సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10 : ప్రస్తుతం యువత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనవసరపు అలవాట్లకు గురవుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజీవ్ గాంధీ అండర్–19 లీగ్ టీ20 క్రికెట్ ఛాంపియన్‌షిప్–2026 ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా జర‌గ‌గా ఆయ‌న ముఖ్య అతిథిగా విచ్చేశారు. విజేత హైదరాబాద్ జట్టుకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ప్రతి ఒక్కరూ వీలైనంతగా మైదానాల బాట పట్టి వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నేత అని గుర్తు చేశారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. గత దశాబ్ద కాలంగా సరైన మౌలిక వసతులు, ప్రోత్సాహకాలు లేక ఎంతో మంది ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు వెనుకబడ్డారని విమ‌ర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం చరిత్రాత్మక నిర్ణయమని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఇది తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా కేంద్రంగా మార్చే దిశగా కీలక అడుగని అన్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులు క్రీడల్లో అద్భుత ప్రతిభ చూపుతున్నారని మంత్రి తెలిపారు. పేద కుటుంబాల పిల్లలకు క్రీడలే జీవితాన్ని మార్చే ఆయుధమని పేర్కొన్నారు.ఈ లీగ్‌లో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల జట్లు పాల్గొనడం యువతలో క్రీడల పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనమని మంత్రి అన్నారు. ఫైనల్‌లో విజయం సాధించిన హైదరాబాద్ జట్టును ప్రత్యేకంగా అభినందించారు. 20 సంవత్సరాలుగా రాజీవ్ గాంధీ పేరు మీద ఈ పోటీలు నిర్వహిస్తున్న మాజీ ఎంపీ హనుమంతరావు కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, హర్కర వేణుగోపాల్, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు మెట్టు సాయికుమార్, శివసేన రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ , డిసిసి అధ్యక్షులు మోతే రోహిత్, సయ్యద్ సైఫుల్లా తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *