గ్లోబల్ వర్క్‌ ఫోర్స్‌గా తెలంగాణ యువత

– స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్‌పై ప్రత్యేక దృష్టి
– ఆర్థిక వ్యవస్థను శాసించేది మూలధనం కాదు.. నైపుణ్యమే
– ‘ఫీస్టా 2026’ సదస్సులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 30ః తెలంగాణ యువతను ప్రస్తుత అంతర్జాతీయస్థాయి అవసరాలకనుగుణంగా గ్లోబల్ వర్క్ ఫోర్స్‌గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆ దిశగా యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. హైటెక్ సిటీలోని ఓ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన ‘ఫ్యూచర్ ఆఫ్ ఇంటెలిజెంట్ అండ్ ఎవాల్వ్డ్ స్ట్రాటజీస్ ఇన్ టాలెంట్ ఆక్విజిషన్(ఫీస్టా) 2026’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ గమనాన్ని శాసించేది మూలధనం కాదని, నైపుణ్యం మాత్రమేనని చెప్పారు. నిరంతరం నేర్చుకునేతత్వం ఉన్నచోటే ప్రతిభ నిలుస్తుందని, అదే వృద్ధికి అసలైన ప్రాతిపదిక అని అన్నారు. భారత వృద్ధి రేటు 7 శాతం వరకు ఉండొచ్చని కేంద్ర ఆర్థిక సర్వే అంచనా వేసిందని, ఇది శుభపరిణామని, అయితే ఈ వృద్ధిని నిలబెట్టుకోవాలంటే కేవలం బడ్జెట్ కేటాయింపులు సరిపోవని, సంస్థాగత సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరముందని వివరించారు. కృత్రిమ మేధపై ఆధారపడటం కంటే దానిని సమర్థవంతంగా వాడుకునేలా సంస్థలు రూపాంతరం చెందాలని, లేకపోతే దీర్ఘకాలంలో సవాళ్లు ఎదురయ్యే ప్రమాదముందని అన్నారు. ఉద్యోగాలు సృష్టించే రాష్ట్రంగానేకాక పరిశ్రమలకు భవిష్యత్తు భాగస్వామిగా మార్చేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. అత్యుత్తమ మానవ వనరులకు కేరాఫ్ అడ్రస్‌గా రాష్ట్రాన్ని నిలపడంలో ఏఐ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఐకాం, లైఫ్ సైన్సెస్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటర్నేషన్ స్కూల్స్ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కార్యక్రమంలో అంతర్జాతీయ, జాతీయ టెక్ కంపెనీల హెచ్‌ఆర్ హెడ్స్, సోషల్ టాలెంట్ ఫౌండర్ జానీ క్యాంప్‌బెల్, క్యారలాన్ గ్లోబల్ సొల్యూషన్స్ ఎండీ పవన్ సచ్ దేవా, క్రౌడ్ స్ట్రైక్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ మీనన్, ప్రముఖ నటి, రచయిత్రి మందిరాబేడీ, ఫీస్టా-2026 ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు హరికృష్ణ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

s a glob

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *