మాక్ పార్లమెంట్ సెషన్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, నైతిక విలువలతో కూడిన, నీతిమంతమైన రాజకీయాలను ప్రవేశపెట్టాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష అని, అందుకే దేశవ్యాప్తంగా లక్షమంది యువతను రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణపై మహిళా మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మాక్ పార్లమెంటులో పాల్గొన్న యువతీయువకులు భవిష్యత్తులో పార్లమెంటులో వాదించాల్సిన స్థాయికి ఎదగాలన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి అనేక దేశాల్లో రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మిలటరీ పాలనలతో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తుండటంతో ఆ దేశాల్లో అంతర్గత సంక్షోభాలు ఏర్పడ్డాయని తెలిపారు. భారత దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని అద్భుతంగా అమలు చేస్తున్నామన్నారు. అయితే 1975లో ఇందిరాగాంధీ హయాంలో రాజ్యాంగాన్ని పక్కనపెట్టి పౌర హక్కులను అణచివేసి, పత్రికా స్వేచ్ఛను హరించి ఎమర్జెన్సీ విధించారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను నేటి తరం తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ మాక్ పార్లమెంట్ నిర్వహిస్తున్నామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజల మౌలిక హక్కులను హరించిన సంఘటనలను భవిష్యత్ తరాలకు తప్పకుండా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమర్జెన్సీ అనేది చరిత్ర కింద కప్పేయదగిన సంఘటన కాదన్నారు. కుటుంబ పార్టీలు, అవినీతిపరులు, ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న పార్టీల పట్ల ప్రజలు చైతన్యవంతులై ఆలోచించాలని పిలుపునిచ్చారు. చరిత్రను తెలుసుకోవడం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం, భవిష్యత్తులో వాక్‌స్వాతంత్య్రాన్ని రక్షించుకోవడం, దేశాన్ని సరైన దిశగా నడిపించడం, పేదరిక నిర్మూలన వంటి బాధ్యతలు యువత భుజాలపై ఉన్నాయని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ యువతను రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే